
భారత్ దేశంలో ఉండి.. స్వదేశానికే ద్రోహం చేస్తున్నారు కొందరు దుర్మార్గులు.. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత.. భారత్ లో నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. పాకిస్థాన్ వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉండి.. వారితో సీక్రెట్ గా సంభాషణలు జరుపుతున్న వారి వివరాలు సేకరించాయి. ఈ సమయంలోనే హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పేరు బయటకు వచ్చింది. యూట్యూబర్ పేరుతో భారత రహస్యాలను పాకిస్థాన్ కు చేరవేస్తోందనే ఆరోపణలతో జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేశారు.. అసలు జ్యోతి మల్హోత్రా ఏం చేసింది..? ఐఎస్ఐతో ఎలాంటి సంబంధాలు కలిగిఉంది..? భారత్ కు చెందిన కీలక ఆధారాలను ఆమె వారికి ఎలా అందించింది..?
అత్యుత్సాహమో.. కావాలనే చేస్తున్నారో తెలియదు.. కాని ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయంజర్స్ .. కొన్ని పనికిమాలిన పనులు చేసి.. చిక్కుల్లో ఇరుక్కుంటున్నారు. హద్దు మీరి మాట్లాడటం నుంచి.. హద్దులు దాటి వెళ్లి సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. వ్యూస్ లైక్స్ కోసం అసలు ఏం చేస్తున్నారు.. వారి చేష్టల వల్ల ఏం నష్టం జరుగుతుందో కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఇదే తీరుగా ప్రవర్తించి అరెస్ట్ అయ్యింది హర్యానా రాష్ట్రంలోని హిసార్‌కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా. ట్రావెల్ విత్ జో యూట్యూబ్ చానెల్ నడుపుతూ, పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ కి భారత సైనిక సమాచారాన్ని అందించిన ఆరోపణలతో జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేశారు. ఆమె 2023లో పాకిస్థాన్‌కు మూడు సార్లు వెళ్లింది. ఢిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్‌లో పనిచేసే ఎహసాన్-ఉర్-రహీమ్ అలియాస్ డానిష్‌తో సంబంధాలు కొనసాగిస్తోంది. ఈ సంబంధాల ద్వారా ఆమె ఐఎస్ఐ అధికారులతో సన్నిహితంగా మాట్లాడి, సున్నితమైన సమాచారాన్ని వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి ఎన్క్రిప్టెడ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పంచుకుందని అనుమానిస్తున్నారు. జ్యోతి .. భారత్ కు సంబంధించిన ఎలాంటి సమాచారం వారికి చెప్పింది..? ఇంకా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి..? వంటి వివరాలను ఆమె నుంచి తెలుసుకుంటున్నారు.
పాక్ వీసా కోసం ఢిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్‌లో జ్యోతి మల్హోత్రా డానిష్‌ను కలిసింది. అప్పుడే ముగ్గురు ఐఎస్ఐ అధికారులు కూడా పరిచయమైనట్టు తెలుస్తోంది.. ఆమె షహబాజ్ నంబర్‌ను జట్ రంధావా పేరుతో సేవ్ చేసి, గుర్తింపును దాచింది. పాకిస్థాన్‌లో లాహోర్, కటాస్ రాజ్ ఆలయం, రంజాన్ ఫుడ్ టూర్లను వీడియోలుగా చిత్రీకరించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలు పాకిస్థాన్‌ను సానుకూలంగా చూపించేలా ఉన్నాయని, ఇవి ఐఎస్ఐ ప్రచార ఎజెండాకు ఉపయోగపడ్డాయని పోలీసులు ఆరోపించారు. ఆమె ఒక ఐఎస్ఐ అధికారితో సంబంధం కలిగి ఉందని.. బాలీలో కలిసి ప్రయాణించినట్లు కూడా సమాచారం ఉందని పోలీసులు చెబుతున్నారు. హర్యానా, పంజాబ్‌లో మొత్తం ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. జ్యోతి మొబైల్, ల్యాప్‌టాప్‌లో అనుమానాస్పద సమాచారం పోలీసులు కనిపెట్టారు. ఆమె నిరంతరం పాకిస్థాన్ అధికారులతో సంప్రదింపులు జరిపినట్టు గుర్తించారు. భారత సైనిక స్థావరాలు, వ్యూహాత్మక స్థలాల సమాచారాన్ని పాకిస్థాన్ అధికారులతో పంచుకుందని అంటరున్నారు. ఆమె సమాచారాన్ని ఎన్క్రిప్టెడ్ యాప్‌ల ద్వారా బదిలీ చేసి, అధికారుల గుర్తింపును జట్ రంధావా వంటి ఫేక్ పేర్లతో దాచింది. ఈ చర్యలు భారత జాతీయ భద్రతకు ప్రమాదం.
అటు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విచారణలో అధికారులు కీలక విషయాలు రాబడుతున్నారు. మల్హోత్రాను ఓ అస్త్రంగా పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్లు మలచుకున్నట్లు హరియాణా పోలీసులు గుర్తించారు. జ్యోతి మల్హోత్రా సైనిక లేదా రక్షణ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం వారితో పంచుకుందని ఈ దశలో చెప్పలేం.. కానీ, పాక్ నిఘా వర్గాలతో ఆమె నేరుగా సంప్రదింపులు జరిపిందని హిసార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావర్ తెలిపారు. వాళ్లు మల్హోత్రాను ఓ అస్త్రంగా చేసుకున్నారని కచ్చితంగా చెప్పగలమని… ఇతర యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్లతోనూ ఆమె టచ్‌లో ఉన్నారని అంటున్నారు. వాళ్లు కూడా పీఐవోలతో సంప్రదింపులు జరుపుతున్నారు అని హిసార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావర్ తెలిపారు. జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్‌లో పలుమార్లు పర్యటించిందని, ఓసారి చైనాకూ వెళ్లి వచ్చినట్లు హరియాణా పోలీసులు వెల్లడించారు. ఇటీవల బహిష్కరణకు గురైన పాక్ అధికారితోనూ ఆమె టచ్‌లో ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆర్థిక లావాదేవీలు, ప్రయాణ వివరాలు విశ్లేషిస్తున్నామని, ఎక్కడికి వెళ్లింది.. ఎవరిని కలిసింది? అనే విషయాలను కనుగొనే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఆమె ల్యాప్‌టాప్ సహా ఎలక్ట్రానిక్ పరికరాలపై ఫోరెన్సిక్ విశ్లేషణ చేస్తామని, ఏం సమాచారం పంచుకుందనే విషయం అప్పుడు స్పష్టమవుతుందన్నారు హిసార్ ఎస్పీ.
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు పూరీకి చెందిన మరో యూట్యూబర్‌తో ఉన్న సంబంధంపై ఒడిశా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మల్హోత్రా గతేడాది సెప్టెంబర్‌లో పూరీని సందర్శించారని, అక్కడ మరో మహిళా యూట్యూబర్‌ను కలిసినట్లు గుర్తించామని ఒడిశాలోని పూరీ ఎస్పీ వెల్లడించారు. పూరీకి చెందిన సదరు యూట్యూబర్ ఇటీవల పాకిస్థాన్‌లోని కర్తార్‌పుర్ సాహిబ్ గురుద్వారాను సందర్శించినట్లు ఆయన తెలిపారు. అసలు జ్యోతి మల్హోత్రా పూరీ సందర్శన వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ సమయంలో ఆమె ఎక్కడ ఉంది? ఎవరిని కాంటాక్టు అయ్యింది? ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు ఉన్నాయా? అనే విషయాలు తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పలు కేంద్ర దర్యాప్తు సంస్థలు, హరియాణా పోలీసులతో టచ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. మరోవైపు పోలీసులు శనివారం తన కుమార్తెను విచారించి కొంత సమాచారం సేకరించినట్లు పూరీ యూట్యూబర్ తండ్రి వెల్లడించారు. ఇద్దరూ యూట్యూబర్లు కావడంతోనే తన కుమార్తెకు జ్యోతి మల్హోత్రాతో పరిచయం ఏర్పడిందన్నారు. వారి మధ్య స్నేహం పెరగడంతో జ్యోతి మల్హోత్రా పూరీని సందర్శించిందని అంటున్నారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం గనక సరైన దర్యాప్తు జరగాలన్నారు. తమ అమ్మాయి మూడు నాలుగు నెలల క్రితం తీర్థయాత్రలో భాగంగా పాకిస్థాన్‌లోని కర్తార్‌పుర్ వెళ్లిందని… కానీ, మల్హోత్రాతో కాదు.. మరో ఫ్రెండ్‌తో కలిసి అక్కడికి వెళ్లిందన్నారు. మరోవైపు, ఈ అంశంపై పూరీ యూట్యూబర్ స్పందించారు. జ్యోతి మల్హోత్రా తనకు ఫ్రెండ్ మాత్రమేనని… ఆమెను యూట్యూబ్ ద్వారా కలిశానని అన్నారు. ఆమెపై ఆరోపణలు ఉన్న విషయం తనకు తెలియదన్నారు. ఆమె శత్రు దేశం పాక్ కోసం గూఢచర్యం చేస్తుందని తెలిస్తే.. తాను ఆమెతో కాంటాక్ట్‌లో ఉండేదాన్ని కాదని క్లారిటీ ఇచ్చింది..
మరోవైపు ఈ కేసు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లకు హెచ్చరికగా నిలుస్తుంది. ఇన్ఫ్లూయెన్సర్లు తమ కంటెంట్‌లో జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పంచుకోకుండా జాగ్రత్త వహించాలి. విదేశీ ప్రయాణాల సమయంలో అధికారులతో సంబంధాలు ఏర్పరచుకునేటప్పుడు, ముఖ్యంగా శత్రు దేశాలతో, గోప్యతను కాపాడుకోవాలి. ఎన్క్రిప్టెడ్ యాప్‌ల ద్వారా సమాచార బదిలీకి ముందు దాని చట్టబద్ధతను పరిశీలించాలి. జాతీయ భద్రతా చట్టాలు, ఆఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ గురించి అవగాహన పెంచుకోవాలి. ఈ కేసు సోషల్ మీడియా ద్వారా గూఢచర్యం, ప్రచారాన్ని నిరోధించడానికి భారత అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నాయని చూపిస్తుంది, ఇన్ఫ్లూయెన్సర్లు తమ ప్రభావాన్ని బాధ్యతాయుతంగా ఉపయోగించాలి.