
హార్వర్డ్ యూనివర్సిటీ, ట్రంప్ మధ్య వివాదం మరింత వేడెక్కింది. హార్వర్డ్ యూనివర్సిటీకి మరిన్ని నిబంధనలు విధించారు. అసలు హార్వర్డ్ యూనివర్సిటీ, ట్రంప్ మధ్య గొడవ ఏంటి..? వర్సిటీకి కొత్తగా విధించిన నిబంధనలు ఏంటి..? దీని వల్ల విదేశీ విద్యార్థులకు ఎలాంటి నష్టం కలగనుంది. ? ఇక భారతీయ విద్యార్థులు హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకోలేరా..?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి.. హార్వర్డ్ యూనివర్సిటీ మధ్య వివాదం తీవ్ర స్థాయికి చేరింది. యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు, యూదు వ్యతిరేకత కార్యకలాపాల, ట్రంప్ పరిపాలనలో విద్యా సంస్థలపై నియంత్రణ ప్రయత్నాల వల్ల ఈ గొడవ మరింత పెరిగింది. హార్వర్డ్‌లో యాంటీ-అమెరికన్, యూదు వ్యతిరేక భావజాలాన్ని విద్యార్థుల్లో నూరిపోస్తున్నారని ట్రంప్ టీమ్ ఆరోపిస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా యూనివర్సిటీలో జరిగిన ప్రదర్శనలను ట్రంప్ తప్పుబడుతున్నారు. దీంతో చర్యలకు దిగారు. హార్వర్డ్‌కు అందించే ఫెడరల్ నిధులను ట్రంప్ ప్రభుత్వం నిలిపివేసింది. ఈ నిధులు హార్వర్డ్ పరిశోధనా కార్యక్రమాలకు కీలకమైనవి. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఆరోగ్య రంగాలకు ఈ నిధులు ఎంతో ముఖ్యం.
వర్సిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని ట్రంప్ సర్కారు రద్దు చేసింది. దీంతో ఇక్కడ ప్రవేశాలు పొందిన భారతీయులు సహా విదేశీ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది. వీరంతా ఇప్పుడు వేరే యూనివర్సిటీకి బదిలీ కావాల్సిందే. లేదంటే అమెరికాలో చట్టపరమైన హోదాను కోల్పోయే ప్రమాదం ఉంది. తమ విద్యాసంస్థలో ప్రవేశం పొందిన అంతర్జాతీయ విద్యార్థులు వీసా పొందేందుకు అవసరమైన పత్రాల జారీకి స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ కింద విశ్వవిద్యాలయాలకు అనుమతి లభిస్తుంది. యూనివర్సిటీలు ఇచ్చిన సర్టిఫికేషన్‌తో విద్యార్థులు వీసాకు దరఖాస్తు చేసుకుంటారు. ప్రస్తుత ఏడాది ఈ యూనివర్సిటీలో 6,800 మంది విదేశీ విద్యార్థులు నమోదు చేసుకున్నారు. విశ్వవిద్యాలయంలోని మొత్తం విద్యార్థుల సంఖ్యలో 27శాతం మంది విదేశీయులు. వీరిలో ఎక్కువమంది గ్రాడ్యుయేట్ స్టూడెంట్సే ఉన్నారు. ఇక భారత్ నుంచి 788 మంది ఈ యూనివర్సిటీలో ప్రవేశం పొందారు. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం నిర్ణయంతో వీరందరి భవితవ్యం గందరగోళంలో పడింది. హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశాల రద్దు 2025-26 విద్యా సంవత్సరం నుంచి వర్తించనుంది. ఒకవేళ ప్రభుత్వం దీనిపై నిర్ణయం మార్చుకోకపోయినా, కోర్టు నుంచి ఊరట లభించకపోయినా.. ఈ ఏడాది విదేశీయులకు ఇచ్చిన ప్రవేశాలన్నీ రద్దయినట్లే. ఇప్పటికే ఈ సెమిస్టర్‌తో డిగ్రీలు పూర్తి చేసిన విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేట్‌గా బయటకు రావొచ్చు. కానీ, ఒకవేళ చదువు మధ్యలో ఉన్నవారైతే మాత్రం.. తప్పనిసరిగా మరో ఇనిస్టిట్యూట్‌కు మారాల్సి ఉంటుంది. లేదంటే చట్టబద్ధమైన హోదాను కోల్పోతారు.
ట్రంప్ ప్రభుత్వం హార్వర్డ్‌పై ఆరు కఠినమైన నిబంధనలను విధించింది. వీటిని 72 గంటల్లో అమలు చేయాలని ఆదేశించింది. ఈ నిబంధనల ద్వారా విదేశీ విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు హార్వర్డ్‌కు ఓ అవకాశం కల్పించారు. నిబంధనల్లో మొదటిది.. గత ఐదేళ్లలో హార్వర్డ్‌లో చదువుతున్న విద్యార్థులు క్యాంపస్‌లో లేదా బయట జరిపిన చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన రికార్డులన్నీ సమర్పించాలి. గత ఐదేళ్లలో నాన్ ఇమిగ్రెంట్ విద్యార్థులు పాల్పడిన ప్రమాదకర లేదా హింసాత్మక చర్యలకు సంబంధించిన రికార్డులను ఇవ్వాలి. నాన్ ఇమిగ్రెంట్ విద్యార్థులు.. ఇతర విద్యార్థులు లేదా యూనివర్సిటీ సిబ్బందిని బెదిరిస్తే ఆ రికార్డులను సమర్పించాలి. వలసేతర విద్యార్థులు క్యాంపస్‌లో లేదా బయట ఇతర హక్కులను హరించిన ఘటనలు చోటుచేసుకుంటే ఆ వివరాలు అందించాలి. గత ఐదేళ్లలో హార్వర్డ్‌లో నమోదుచేసుకున్న వలసేతర విద్యార్థుల కాండెక్ట్ రికార్డులను ఇవ్వాలి. క్యాంపస్‌లో వలసేతర విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొంటే ఆ ఆడియో, వీడియో ఫుటేజ్‌లను ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు.
హార్వర్డ్ యూనివర్సిటీ, 1636లో స్థాపించబడినది. అమెరికాలోని అత్యంత పురాతన, ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ. హార్వర్డ్ లో 27% విదేశీ విద్యార్థులతో సహా 25,000 మంది విద్యార్థులు ఉన్నారు. దీని పూర్వ విద్యార్థులలో 8 మంది అమెరికా అధ్యక్షులు ఉండగా.. 188 మంది నోబెల్ బహుమతులు సాధించారు. అయితే ప్రస్తుతం ట్రంప్ నిర్ణయాలు, నిధుల నిలిపివేత హార్వర్డ్ యూనివర్సిటీకి తీవ్ర తలనొప్పిగా మారింది. ఫెడరల్ నిధుల నిలిపివేత్త వల్ల పరిశోధనా కార్యక్రమాలు, ల్యాబ్‌ల నిర్వహణ, ఫ్యాకల్టీ జీతాలకు ఇబ్బందులు ఏర్పడతాయి. విదేశీ విద్యార్థులు చెల్లించే ట్యూషన్ ఫీజులు యూనివర్సిటీ ఆదాయంలో కీలకమైనవి. ఇప్పుడు విదేశీ విద్యార్థుల అడ్మిషన్స్ రద్దు చేయుడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడతాయి. అంతేకాక హార్వర్డ్ కు ఉన్న అంతర్జాతీయ ఖ్యాతి, ప్రపంచ స్థాయి పరిశోధనా సామర్థ్యం తగ్గే ప్రమాదం ఉంది. ఎందుకంటే విదేశీ విద్యార్థులు, ఫ్యాకల్టీ దాని విజయానికి ముఖ్యమైనవారు. హార్వర్డ్‌లో ప్రస్తుతం సుమారు 788 మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. కొత్త నిబంధనలు వల్ల భారతీయ విద్యార్థుల భవితవ్యం చిక్కుల్లో పడింది. వీరు ఇతర యూనివర్సిటీలకు వెళ్లాల్సి ఉంటుంది. 2025 విద్యా సంవత్సరం పూర్తి చేసే విద్యార్థులు గ్రాడ్యుయేట్ కావచ్చు. కానీ ఇంకా చదువు పూర్తి కాని వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.