నల్గొండ, భువనగిరి ఎంపీలకు ‘ఎంట్రీ పాస్’ కష్టాలు!

నల్గొండ, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల్లో జూనియర్ ఎంపీలకు సీనియర్ మంత్రుల పెత్తనం పెద్ద తలనొప్పిగా మారిందా..!. తమ నియోజకవర్గాల్లో అడుగు పెట్టాలంటే అనుమతి తప్పనిసరిగా కావాల్సిందేనా? సీనియర్ల ప్రమేయం లేకుండా ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేకపోతున్నారా? జనం ఓట్లేసి గెలిపించినా..వారికే దూరమైపోతున్నామంటూ ఆవేదన చెందుతున్నారా? ఎక్కడ అ పార్లమెంట్ స్థానాలు? ఎవరా ఎంపీ లు లెట్స్ వాచ్ దిస్ ఇన్ ఆఫ్ ది రికార్డ్.

నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి… పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు హాజరవుతున్నా.. కాంగ్రెస్ పార్టీ క్యాడర్‌కు, ప్రజలకు మాత్రం దగ్గర కాలేకపోతున్నారన్న బాధ వారిని వేధిస్తోందట. క్యాడర్, ప్రజలు సైతం ఎంపీలు తమను పట్టించుకోవడం లేదని అసంతృప్తిగా ఉన్నారట .ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచిన ఈ ఇద్దరు ఎంపీలు, పార్లమెంట్‌కు పంపితే పూర్తిగా నిర్లక్ష్యంగా ఉంటున్నారనేది స్థానికుల అభిప్రాయం.అయితే, ఎంపీల సన్నిహితులు మాత్రం సీనియర్ మంత్రుల పెత్తనం వల్లనే వారు నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాకు చెందిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గతంలో ఎంపీలుగా పనిచేశారు. ఇప్పుడు రాష్ట్ర మంత్రులుగా కొనసాగుతున్నారు. వేదిక ఎక్కడైనా, సందర్భం ఏదైనా.. నల్గొండ, భువనగిరి ఎంపీలను తామే భారీ మెజారిటీతో గెలిపించామని గొప్పగా చెబుతున్నారు. సీనియర్ మంత్రుల ఈ వైఖరి జూనియర్ ఎంపీలకు ప్రతికూలంగా మారుతోందని వారి సన్నిహితులు వాపోతున్నారు. తమను తొక్కేస్తున్నారన్న బాధ ఎంపీల్లో ఉంటే.. కనీసం నియోజకవర్గ కేంద్రాల్లో క్యాంప్ ఆఫీసులు కూడా ఎందుకు పెట్టుకోలేకపోతున్నారన్నది స్థానికుల ప్రశ్న.

తామొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లుగా పరిస్థితి తయారైందని ఎంపీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. సీనియర్లను మెప్పించడానికి ఏడాదిగా ప్రయత్నిస్తున్నా ఫలితం లేదని, ఇలాగే ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు అంధకారమవుతుందని ఆందోళన చెందుతున్నారట. దీనికితోడు, ఎంపీలు ఎప్పుడూ బిజీగా ఉంటూ జాతీయ, రాష్ట్ర స్థాయి నేతల వెంట తిరుగుతున్నారని, నియోజకవర్గాల్లో కనిపించడం లేదని సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలు, క్యాడర్ ఎంపీలను కలవాలంటే ఎప్పుడు, ఎక్కడ, ఎలా?అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నియోజకవర్గ కేంద్రాల్లో క్యాంప్ ఆఫీసులు లేకపోవడంతో క్యాడర్‌కు ఇబ్బందులు తప్పడం లేదు. ఆపదలో మొక్కులు, ఆదుకోవడంలో తిప్పలు అన్నట్లుగా వారి తీరు ఉందని సొంత పార్టీ క్యాడర్ వాపోతోంది. గతంలో ఎంపీలుగా పనిచేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలకు దగ్గరగా ఉండేవారని కొందరు గుర్తు చేస్తున్నారు.ఈ పోలిక కూడా యువ ఎంపీలకు తల నొప్పి గా మారుతోంది.

() జిల్లాలో సీనియర్ మంత్రుల పెత్తనంతో జూనియర్ ఎంపీలు ఇబ్బందులు పడుతున్నారనేది స్పష్టంగా కనిపిస్తోంది.రాబోయే రోజుల్లోనైనా అ పార్లమెంట్ జిల్లా హెడ్ క్వార్టర్ లో ఎంపీ లు క్యాంపు ఆఫీస్ లు తెరుచుకుంటాయా? ప్రజలకు అందుబాటులో ఉంటారా?, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయో వేచి చూడాలి.