దివంగత మాజీ ప్రధాని.. రాజీవ్ గాంధీ వర్థంతి నేడు..!

1984 అక్టోబర్ 31న పంజాబ్ ఉగ్రవాదులు ఇందిరాగాంధీని ఆమె స్వగృహంలోనే దారుణంగా హత్య చేశారు. ఆమె మరణాంతరం తిరిగి ప్రజాభిమానాన్ని పొందేందుకు శ్రీ రాజీవ్ గాంధీ 1984 నవంబర్ 27న పార్లమెంటుకు ఎన్నికలు జరిపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 415 సీట్లకు పైగా స్థానాలను సంపాదించి అఖండ విజయాన్ని అందుకుంది. అనంతరం రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాడు. మితభాషి, వాస్తవిక దృక్పథంతో ఆలోచించే స్వభావం, సంయమనంతో నిర్ణయాలు తీసుకునే నేర్పుగల వ్యక్తిగా భారతదేశ రాజకీయ చరిత్రలో సుస్థిరస్థానం సంపాదించాడు.

1944 ఆగస్టు 20న బొంబాయిలోని షిరోద్కర్ నర్సింగ్ హోమ్ లో ఇందిరాగాంధీ, ఫిరోజ్ గాంధీ దంపతులకు జన్మించాడు శ్రీ రాజీవ్ గాంధీ. మొదట రాజీవ్ రత్న అని నామకరణం చేశారు. రాజీవ్ అంటే తామరపువ్వు. తల్లిదండ్రుల పేర్లు కలిసి వచ్చేలా ఈయనకు పేరు పెట్టడం జరిగింది. తల్లి ఇందిర పెంపకంలో, తాతగారింట్లో ఎక్కువ కాలం గడిపాడు రాజీవ్… ప్రాథమిక విద్య ఇంటి దగ్గరే పూర్తైంది. బాల్యం నుంచి చిత్రలేఖనంలో ఆసక్తి ఎక్కువ. తర్వాత డెహరాడూన్ వెల్కమ్ స్కూల్లో చేరాడు. చదువులో ఎప్పుడు చురుగ్గా ఉండేవాడు. రాజీవ్ కు తన తాత జవహర్ లాల్ నెహ్రూ పోలికలు ఎక్కువ ఉండేవి. డూన్ స్కూల్లో విద్యాభ్యాసం ముగిశాక, ఇంగ్లడు వెళ్ళి అక్కడ ట్రినిటీ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు. అక్కడ ఉండగానే ఇటాలియన్ యువతి అయిన సోనియా మైనాతో స్నేహం, వివాహం జరిగాయి.

1980 నుంచి 1984 వరకు ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా ఉన్నారు. ప్రతిపక్షాలు స్పష్టించిన అరాచక పరిస్థితుల వల్ల దేశంలో ఎమర్జెన్సి ఏర్పడింది. అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓడిపోయి, జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 1980 జనవరిలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో జనతా ప్రభుత్యం ఓడిపోయి, తిరిగి ఇందిరాగాంధీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ఐ పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. 1980లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో… అమేథీ నియోజక వర్గం నుంచి రాజీవ్ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. దీంతో ప్రత్యక్షంగా రాజకీయాల్లో భాగమయ్యారు.1981 జూన్ 5న యువజన కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సభ్యునిగా ఎన్నికై, రెండేళ్లకు అంటే 1983 ఫిబ్రవరి 2న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. పార్టీ ప్రతినిధిగా ఆయన రాష్ట్ర పర్యటన చేశారు. అక్కడి నుంచి ప్రధాని అయ్యేంతవరకు కీలక పదవుల్లో సేవలు అందించారు.