అంతరిక్షంలో పాక్ వ్యోమగామి కోసం 100కు పైగా హలాల్ వంటకాలు!

అంతరిక్షంలోకి తీసుకెళ్లే ఫుడ్ కు భిన్నంగా చైనా సహకారంతో అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి పాకిస్తానీ వ్యోమగామి మహ్మద్ జీషాన్ అలీ కోసం చైనా ఏకంగా వందకు పైగా హలాల్ వంటకాలతో ఒక ప్రత్యేక మెనూనే సిద్ధం చేసింది. అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి పాకిస్తానీగా 40 ఏళ్ల పైలట్ మహ్మద్ జీషాన్ అలీ చరిత్ర సృష్టించారు. తమ దేశం నుంచి తొలి వ్యోమగామి స్పేస్‌లోకి వెళ్లడంతో పాకిస్తాన్ ఈ ఘనతను పెద్ద ఎత్తున పండగలా జరుపుకుంటోంది. చైనాకు చెందిన షెన్‌జౌ-24 వ్యోమనౌకలో మహ్మద్ జీషాన్ అలీ చైనా నిర్మించిన తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణమయ్యారు. ఆ తియాంగాంగ్ స్పేస్ స్టేషన్లో ఇప్పటికే షెన్‌జౌ-23 మిషన్‌కు చెందిన మరో ముగ్గురు వ్యోమగాములు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు వారితో పాటు జీషాన్ అలీ కూడా చేరారు.
అయితే ఈ మిషన్‌లో అందరి దృష్టినీ విపరీతంగా ఆకర్షిస్తున్న ఆసక్తికరమైన అంశం.. జీషాన్ అలీ కోసం చైనా ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఫుడ్ మెనూ. మహ్మద్ జీషాన్ అలీ కోసం వందకు పైగా హలాల్ ఆహార పదార్థాలతో చైనా శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన మెనూను రూపొందించారు. ఆ మెనూలో బటర్ చికెన్, ల్యాంబ్ కోర్మా, బీఫ్ నిహారీ వంటి పాపులర్ వంటకాలు ఉండటం విశేషం. ఈ మెనూను ఏదో యాదృచ్ఛికంగా కాకుండా.. జీషాన్ అలీ ఆహార అభిరుచులు, ఆయన శరీరానికి అవసరమైన పోషక విలువలు, అలాగే పాకిస్తాన్ ఆహార సంస్కృతిని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే రూపొందించారు. ఈ ప్రత్యేక అంతరిక్ష ఆహారం తయారీ వెనుక ఉన్న జాగ్రత్తల గురించి చైనా ఆస్ట్రోనాట్ సెంటర్ పరిశోధకుడు చెన్ జున్లీ ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు. అంతరిక్షంలో పనిచేసే వ్యోమగాములకు అవసరమైన పూర్తి శక్తి, పోషకాలు అందేలా ఈ వంటకాలను ప్రత్యేకంగా రూపొందించామని ఆయన తెలిపారు. అంతేకాదు, భారరహిత స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా, ఈ ఆహారం తేలికగా ఉండి సులభంగా జీర్ణమయ్యేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఈ వంటకాల తయారీలో పూర్తిస్థాయిలో హలాల్ నిబంధనలను పాటించినట్లు చెన్ జున్లీ స్పష్టం చేశారు. ఇస్లామిక్ ఆహార నియమాలకు అనుగుణంగానే పదార్థాలను ఎంపిక చేయడంతో పాటు, వాటి వంట తయారీ విధానాలపైనా అత్యంత ప్రత్యేక దృష్టి సారించారు. సాధారణంగా అంతరిక్ష నౌకలు, స్పేస్ స్టేషన్లలో భూమిపై మాదిరిగా స్టవ్ వెలిగించి వంట చేయడం అస్సలు సాధ్యం కాదు. అందుకే ఈ వందకు పైగా వంటకాలన్నింటినీ ముందుగానే భూమిపై శాస్త్రీయ పద్ధతిలో సిద్ధం చేసి, ఎక్కువ కాలం తాజాగా ఉండేలా ప్రత్యేక ప్యాకింగ్ చేసి అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లారు. మొత్తం మీద చైనా , పాకిస్తాన్ అంతరిక్ష సహకారంలో భాగంగా తొలి పాక్ వ్యోమగామి మహ్మద్ జీషాన్ అలీ తియాంగాంగ్ స్టేషన్లో అడుగుపెట్టడం ఒకవైపు చర్చనీయాంశంగా మారగా.. ఆయన కోసం వందకు పైగా హలాల్ వంటకాలతో, బటర్ చికెన్, బీఫ్ నిహారీ, ల్యాంబ్ కోర్మా లాంటి స్పెషల్ మెనూని అంతరిక్షానికి పంపడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరమైన వార్తగా మారింది.



