అమెరికా వదిలి వెళ్లిపోండి…3 వారాల డెడ్ లైన్.. IBM నిర్ణయం వలన ఎఫెక్ట్ అయ్యేది వీరే..!

ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగుల లే ఆఫ్స్ కొనసాగుతున్న సమయంలో, ప్రముఖ టెక్ దిగ్గజం ఐబీఎం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఒక లక్షా 50వేల కు పైగా ఉద్యోగులు ఉన్న తన కన్సల్టింగ్ విభాగంలో మెజారిటీ ఉద్యోగులకు అమెరికా వర్క్ వీసా, గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్ నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా ఎఫెక్ట్ అయ్యే ఉద్యోగులు ఉద్యోగం మానేయడం లేదా డిసెంబర్ 31 నాటికి మరో దేశానికి బదిలీ కావాలని సూచించింది. ఐబీఎం నిర్ణయంతో అమెరికా టెక్ రంగంలో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ ఉద్యోగుల్లో అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. వేరే దేశానికి ట్రాన్స్‌ఫర్‌పై వెళ్లలేని వారికి డిసెంబర్ 31 చివరి పనిదినంగా పరిగణించి, వీరికి మూడు నెలల వేతన పరిహారం అందించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ నిర్ణయం ద్వారా ఎంత మంది ప్రభావితమవుతున్నారనే దానిపై ఐబీఎం ఇంకా స్పష్టతనివ్వలేదు.
ఒకప్పుడు తన అవసరం కోసం నైపుణ్యం ఉన్నవారు కావాలని అమెరికాయే స్వయంగా పిలిచింది. చదువు, ప్రతిభ, కష్టపడే తత్వం ఉంటే అక్కడ బంగారు భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చింది. దానిపై నమ్మకంతోనే మనవాళ్లు అక్కడికి వెళ్లారు. అక్కడే ఇళ్లు కొనుక్కున్నారు, పగలు రాత్రి తేడా లేకుండా ఉద్యోగాలు చేశారు, క్రమం తప్పకుండా పన్నులు కట్టారు, అమెరికా కంపెనీలకు కోట్లాది డాలర్ల లాభాలు తెచ్చిపెట్టారు. అక్కడే వారికి పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు అమెరికాలోనే పెరిగారు. వారికి అమెరికానే సొంత దేశం. తెలుగు మాట్లాడటం కన్నా ఇంగ్లీష్‌లోనే సులభంగా మాట్లాడే పిల్లలు వాళ్లు. అక్కడే వాళ్ల స్నేహితులు, అక్కడే వాళ్ల స్కూలు, అదే వాళ్ల మొత్తం ప్రపంచం. ఇప్పుడు ఒక్కసారిగా మీరు దేశం వదిలి వెళ్లిపోవాలి అంటే వారి పరిస్థితి ఏమిటి?
భారతదేశంలో 1125 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని ఐబీఎం చెబుతోంది. కానీ అమెరికాలో వచ్చే జీతానికి, భారతదేశంలో ఇచ్చే జీతానికి దాదాపు 80 శాతం వరకు తేడా ఉంటుందని ఉద్యోగులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి అమెరికాలో తీసుకున్న భారీ ఇంటి లోన్లు, కారు లోన్లు, పిల్లల చదువు ఖర్చులు.. ఇవన్నీ ఏమవుతాయి? ఒక్కసారిగా జీతం 80 శాతం పడిపోతే ఆ కుటుంబం ఎలా నడుస్తుంది? అలాగని వెళ్లకపోతే ఉద్యోగం పోతుంది. ఉద్యోగం పోతే వీసా పోతుంది. వీసా పోతే అమెరికాలో ఒక్క రోజు కూడా ఉండలేరు. పది, పదిహేనేళ్ల పాటు కష్టపడి నిర్మించుకున్న ఒక కుటుంబ జీవితం గురించి కేవలం మూడు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటే ఆ పరిస్థితి ఎంత దారుణం. ఇదంతా చట్టవిరుద్ధంగా సరిహద్దులు దాటి వెళ్లిన వలసదారుల గురించి కాదు.. అలాగే అమెరికాలో ఉన్న భారతీయులందరినీ తరిమేస్తున్నారని కూడా దీని అర్థం కాదు. ఇది చట్టబద్ధంగా హెచ్-వన్ బీ వీసా తీసుకుని, అక్కడి రూల్స్ కు లోబడి పన్నులు కట్టి, ఏ నేరమూ చేయకుండా గౌరవంగా బతికిన నిపుణులు ఎదుర్కొంటున్న పరిస్థితి. వారిని కూడా ఇలా రోడ్డున పడేస్తే.. ఇక ఏ వ్యవస్థను నమ్మాలి. నిజానికి మనం గత చరిత్రను ఒక్కసారి గుర్తుచేసుకుంటేనే, ఈరోజు జరుగుతున్నది ఎంత పెద్ద అన్యాయమో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వందల ఏళ్లుగా భారతీయులు ప్రపంచం నలుమూలలకు వలస వెళ్లారు. ఆయా దేశాల అభివృద్ధి అవసరం కోసం, అక్కడి ప్రభుత్వాలే మనవాళ్లను పిలిచి తీసుకువెళ్లాయి. 1834 నుంచి మారిషస్‌కు భారతీయుల వలస మొదలైంది. బ్రిటిష్ వారు చెరకు తోటల్లో పని చేయడానికి బీహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి వేలాది మందిని తీసుకువెళ్లారు. ఎంతోమంది తెలుగు వారు అక్కడికి వెళ్లారు. మొదట్లో కూలీలుగా వెళ్లినా, తర్వాత అక్కడే స్థిరపడ్డారు. ఈరోజు మారిషస్ జనాభాలో 68 శాతం మంది భారత సంతతి వారే. మారిషస్‌ను వారు తమ మాతృభూమిగా భావిస్తారు. మారిషస్ ప్రభుత్వం వారిని ఎప్పుడూ వెళ్లిపొండి అని చెప్పలేదు.
1826 నుంచి సింగపూర్‌కు, 1786 నుంచి మలేషియాకు భారతీయులు వెళ్లారు. రైల్వేలు వేయడానికి, రబ్బరు తోటల్లో, పోర్టుల్లో, ఆఫీసుల్లో పని చేయడానికి తమిళులు, తెలుగువారు, మలయాళీలు, పంజాబీలను తీసుకెళ్లారు. ఈరోజు సింగపూర్ జనాభాలో 9 శాతం, మలేషియాలో 7 శాతం భారతీయులు ఉన్నారు. వారు అక్కడి గౌరవ పౌరులు, అక్కడి సంస్కృతిలో విడదీయలేని భాగమయ్యారు. ఆ ప్రభుత్వాలు వారిని ఎప్పుడూ బయటకు పంపలేదు. అక్కడ స్థిరపడిన కుటుంబాలకు భారత్ అంటే ఎంతో ప్రేమ ఉన్నా, చుట్టపు చూపుగా వచ్చి వెళతారు తప్ప.. అక్కడి జీవితాన్ని వదిలేసి ఇక్కడే ఉండిపోమంటే ఎలా సాధ్యమవుతుంది? అలాగే 1838లో గయానాకు, 1845లో ట్రినిడాడ్‌కు, 1860లో దక్షిణాఫ్రికాకు, 1879లో ఫిజీకి భారతీయులు వెళ్లారు. దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో ఈరోజు కూడా అతిపెద్ద భారతీయ సమాజం ఉంది. మహాత్మా గాంధీ తన మహోన్నత ఉద్యమాన్ని ప్రారంభించింది కూడా అక్కడే. ఫిజీకి భారతీయులు వెళ్లి 140 ఏళ్లు అయింది. అక్కడి రాజకీయాల్లో, వ్యాపారంలో, వ్యవసాయంలో వారు బలంగా నిలదొక్కుకున్నారు. 1840 నుంచి 1917 మధ్య బ్రిటిష్ వారు సుమారు 12 లక్షల మంది భారతీయులను ఐదేళ్ల ఒప్పంద కూలీలుగా ప్రపంచం అంతటా పంపారు. కానీ వారంతా అక్కడే ఉండిపోయారు, ఆ దేశాలే వారికి సొంత ఇళ్లయ్యాయి.
అలాగే 20వ శతాబ్దంలో కూడా 1960 తర్వాత గల్ఫ్ దేశాలకు, 1970 తర్వాత అమెరికా, కెనడా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాకు లక్షలాది మంది భారతీయులు డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, వ్యాపారులుగా వెళ్లారు. ఆ దేశాల ఆసుపత్రులు, టెక్ కంపెనీలు, విశ్వవిద్యాలయాలు భారతీయుల మేధస్సుతో, కష్టంతోనే నడిచాయి. ఈ సుదీర్ఘ 200 ఏళ్ల చరిత్రలో ఏ ఒక్క దేశమూ.. మీరు పది పదిహేనేళ్లు ఇక్కడ ఉండి, ఇక్కడే పిల్లలను కని, ఇక్కడే పన్నులు కట్టిన తర్వాత.. ఇప్పుడు ఒక్కసారిగా మూడు వారాల్లో దేశం వదిలి వెళ్లిపొండి అని అనలేదు. మారిషస్‌లో తెలుగు వారిని, సింగపూర్‌లో తమిళులను, మలేషియాలో, దక్షిణాఫ్రికాలో భారతీయులను ఎవరూ తరిమేయలేదు. వారంతా అక్కడే పౌరులయ్యారు, నాయకులయ్యారు, తమ భవిష్యత్తును నిర్మించుకున్నారు. కానీ నేడు అమెరికాలో జరుగుతున్న పరిణామాలు దీనికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఒక్కసారిగా మీ అవసరం తీరిపోయింది, మూడు వారాల్లో తేల్చుకోండి.. వెళ్లిపోండి లేదా ఉద్యోగం వదిలేయండి అనడం కేవలం ఒక పాలసీ మార్పు కాదు.. అది నమ్మకద్రోహం. వలస అంటే కేవలం ఒక ఉద్యోగం కాదు.. వలస అంటే ఒక జీవితం. ఒక తరం తన మాతృభూమిని వదిలి మరో భూమిని తనదిగా చేసుకోవడానికి పది పదిహేనేళ్లు పడుతుంది. ఆ తర్వాత హఠాత్తుగా వెనక్కి వెళ్లమంటే ఎక్కడికి వెళ్లాలి? పిల్లలకు ఆ కొత్త దేశం పరాయి దేశమైపోతుంది. చరిత్రలో వలస వెళ్లిన వారంతా స్థిరపడితే, నేడు టెక్నాలజీ పేరిట వలస వెళ్లిన వారిని అస్థిరపరచడం ఒక నయా వలసవాదంగా, మానవత్వం లోపించిన తీరుగా కనిపిస్తోంది. కాలాన్ని మనం వెనక్కి తిప్పలేము.. కానీ నిర్ణయాల్లో కనీస మానవత్వాన్ని మాత్రం కచ్చితంగా నిలబెట్టుకోవచ్చు.



