ఏపీ తీరం వైపు దూసుకొస్తున్న అర్నబ్ తుపాను..రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!

అర్నబ్ తుపాను ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది. గంటకు ఏకంగా 140 కిలోమీటర్ల వేగంతో ప్రచండమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలు కోస్తాంధ్ర ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఈ తుపాను ప్రభావం వ్యవసాయ రంగంపై, రైతులపై అత్యంత తీవ్రంగా పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
ఈ తుఫాను ప్రస్తుతం విశాఖపట్నానికి ఆగ్నేయ దిశలో సుమారు 650 కిలోమీటర్లు, కాకినాడకు 730 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 830 కిలోమీటర్లు, బాపట్లకు 910 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తుపాను పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ సహా తూర్పు, మధ్య భారతంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
వాతావరణ శాఖ తాజా శాటిలైట్ చిత్రాలు, రాడార్ నివేదికల ప్రకారం చూస్తే అర్నబ్ తుపాను అత్యంత వేగంగా తన రూపాన్ని మార్చుకుంటోంది. సోమవారం అర్ధరాత్రి సమయానికి ఇది ఒక తీవ్ర తుపానుగా బలపడుతుందని, ఆ తర్వాత సముద్రం మీద ఉన్న అనుకూల పరిస్థితుల దృష్ట్యా మంగళవారానికి ఇది అతి తీవ్ర తుపానుగా మారనుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ అర్నబ్ తుపాను రానున్న 28వ తేదీన, అంటే బుధవారం ఉదయం బాపట్ల , విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో భీకరమైన ఈదురుగాలులు వీస్తాయని, కోస్తా జిల్లాల్లో కుండపోత వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ తుపాను కారణంగా అత్యంత తీవ్రంగా నష్టపోయేది మన అన్నదాతలే. ఆరుగాలం కష్టపడి పండించిన పంట, సరిగ్గా చేతికొచ్చే సమయానికి ఇలా ప్రకృతి కన్నెర్రజేయడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే, ప్రకృతి విపత్తులను ఆపలేకపోయినా, సరైన జాగ్రత్తలు తీసుకుంటే నష్టాన్ని భారీగా తగ్గించుకోవచ్చు. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ రైతులకు కొన్ని కీలకమైన మార్గదర్శకాలను జారీ చేశాయి. ప్రస్తుతం చాలా చోట్ల వరి కోత దశలో ఉంది. కోతకు వచ్చిన వరి పంటను రైతులు వీలైనంత త్వరగా కోసేసి, సురక్షిత ప్రాంతాలకు లేదా ఎత్తైన ప్రదేశాల్లో కుప్పలుగా వేసుకోవాలని సూచించింది. వర్షం నీరు చేరకుండా కుప్పలపై తప్పనిసరిగా నాణ్యమైన టార్పాలిన్ కవర్లు కప్పి, గాలికి ఎగిరిపోకుండా బరువులు పెట్టాలని చెప్పింది. భారీ వర్షాల హెచ్చరిక ఉన్నప్పుడు ఎరువులు,పురుగుమందుల పిచికారీ నిలిపివేయాలి. విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలను తేమ చేరని సురక్షిత ప్రదేశంలో ఉంచాలి.నీటిని తోడే పంపులు, పైపులు, టార్పాలిన్లను సిద్ధంగా ఉంచుకోవాలి.తుఫాను సమయంలో పొలాల్లోకి వెళ్లకుండా, సురక్షిత ప్రదేశంలో ఉండాలి.
భారీ వర్షాల కారణంగా పొలాల్లో నీరు నిలిచిపోతే వేరు కుళ్లు తెగుళ్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి పొలాల్లో నీరు నిలవకుండా ముందుగానే డ్రైన్లు, కాలువల ద్వారా నీటిని బయటకు పోయేలా కాలువలు, బోదెలు ఏర్పాటు చేసుకోవాలి. 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే అరటి, బొప్పాయి వంటి తోటలు నిలువునా విరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రైతులు తక్షణమే ఆ చెట్లకు కర్రలతో, వెదురు బొంగులతో బలమైన ఆధారాలు ఏర్పాటు చేయాలి. రెండు మూడు చెట్లను కలిపి తాడుతో కట్టడం ద్వారా గాలి తీవ్రతను తట్టుకునేలా చేయవచ్చు. పంట నష్టం వాటిల్లితే ఫొటోలతో నమోదు చేసి, సంబంధిత గ్రామ వ్యవసాయ సహాయకులకు సమాచారం అందించాలి. పంటల్లో తెగుళ్లు, వ్యాధుల లక్షణాలు కనిపిస్తే వ్యవసాయ అధికారుల సలహా మేరకు నివారణ చర్యలు చేపట్టాలి.
కేవలం పంటలే కాకుండా పశుసంపదను కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. వర్షం, చలి తీవ్రతకు మూగజీవాలు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి పశువులు, గొర్రెలు, మేకలను ఆరుబయట కాకుండా సురక్షితమైన పాకలు లేదా షెల్టర్లలో ఉంచాలి. వాటికి కనీసం మూడు నాలుగు రోజులకు సరిపడా తగినంత ఎండు మేత, స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉంచుకోవాలి. తుఫాను నష్టాలపై కానీ , పంటల సంరక్షణకు సంబంధించి కానీ ఎలాంటి సందేహాలు ఉన్నా, తక్షణమే స్థానిక వ్యవసాయ అధికారులను, ఆర్బీకే సిబ్బందిని సంప్రదించి వారి సలహాలు తీసుకోవాలి.



