రామాయణలో ఆ పాత్ర అనగానే సాయి పల్లవి స్పందన ఇదే..!

భారతీయ ఇతిహాసాల్లో అత్యంత పవిత్రమైన, ప్రతి భారతీయుడి హృదయానికి దగ్గరైన కథ రామాయణం. ఈ అద్భుత ఘట్టాన్ని వెండితెరపై ఎంతోమంది దర్శకులు ఎన్నో రకాలుగా ఆవిష్కరించారు. కానీ ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారీ దర్శకత్వంలో రాబోతున్న రామాయణ ప్రాజెక్ట్ మాత్రం ఇండియన్ సినిమా హిస్టరీలోనే భారీస్థాయిలో తెరకెక్కుతూ అంచనాలను పెంచేసింది. దంగల్ లాంటి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కావడంతో ఈ ప్రాజెక్ట్ పై అనౌన్స్మెంట్ రోజు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న షోలో పాల్గొన్న సాయి పల్లవి సీతమ్మ పాత్ర గురించి చెప్పిన కొన్ని ఎమోషనల్ విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
తన నటనతో, క్యారెక్టరైజేషన్ తో అభిమానుల గుండెల్లో మంచి స్థానం సంపాదించుకుంది. గ్లామర్ షోకు దూరంగా, కేవలం నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే సాయి పల్లవికి ఏకంగా సీతమ్మ పాత్ర చేసే అవకాశం రావడంపై కేబీసీ షోలో అమితాబ్ బచ్చన్ ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. ఈ ప్రతిష్టాత్మక సినిమాలో అవకాశం రావడం ఎలా అనిపించిందని అడిగిన ప్రశ్నకు సాయి పల్లవి చాలా వినమ్రంగా, భావోద్వేగంతో సమాధానమిచ్చారు. రామాయణలో సీతమ్మ పాత్రలో నటించడం తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన అనుభవమని సాయి పల్లవి చెప్పారు. సాధారణంగా నేను ఏ సినిమాలో నటించినా.. ఆ పాత్రకు నావంతుగా వంద శాతం న్యాయం చేయాలని, నేను సొంతంగా ఏం చేయగలనని మాత్రమే ఆలోచిస్తాను. కానీ సీతమ్మ పాత్ర విషయంలో మాత్రం నేను అలా చేయలేదు. ఆ పాత్రకు నేను ఏమి ఇవ్వగలను అన్న అహంకారం కాకుండా, సీతమ్మగా నటించడం వల్ల నేను వ్యక్తిగతంగా ఎంత జ్ఞానాన్ని సొంతం చేసుకోగలననే విషయాన్ని మాత్రమే చూశాను అని ఆమె వివరించారు. ఈ పాత్ర కోసం తాను ప్రత్యేకంగా ప్రిపేర్ కాలేదని, తనకు తెలిసిన కొన్ని అంశాలను, యాక్టింగ్ స్కిల్స్ ను కూడా పక్కనపెట్టి పూర్తిగా ఆ భగవంతుడికే భారం వేశానని చెప్పారు. సెట్స్ లోకి అడుగుపెట్టే ముందు, అమ్మా.. నాతో ఈ పాత్ర నువ్వే చేయించుకో అని ఆ సీతమ్మను ప్రార్థించి మరీ కెమెరా ముందుకు వెళ్లాను అని సాయి పల్లవి ఎంతో భక్తిభావంతో వెల్లడించారు. ఈ మాటలు విన్న బిగ్ బి అమితాబ్ బచ్చన్.. ఒక నటికి ఉండాల్సిన అసలైన లక్షణం ఇదేనంటూ ఆమెను ఎంతగానో ప్రశంసించారు.
ఇక ఈ రామాయణ ప్రాజెక్ట్ లో పాన్ ఇండియా నటీనటులను రంగంలోకి దించారు. శ్రీరాముడి పాత్ర కోసం రణ్బీర్ కపూర్, రావణాసురుడి పాత్ర లో కేజీఎఫ్ సిరీస్ తో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన రాకింగ్ స్టార్ యశ్ కనిపించనున్నారు. రామభక్తుడు హనుమంతుడి పాత్రలో బాలీవుడ్ యాక్షన్ స్టార్ సన్నీ డియోల్ నటిస్తున్నారు. లక్ష్మణుడి పాత్రలో రవి దూబే నటించనున్నారు. ఇలా ప్రతి క్యారెక్టర్ కు ఒక పర్ఫెక్ట్ యాక్టర్ ను సెలెక్ట్ చేసి, విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మేకర్స్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తొలి భాగం 2026 నవంబరు 5న దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా విడుదల కానుంది.



