ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం…మునగకు మహర్దశ
రాష్ట్రవ్యాప్తంగా 19 మునగ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు..ఎఫ్పీఓల ఆధ్వర్యంలో మునగ పౌడర్ తయారీ..దళారీల బెడద తప్పించేలా ప్రభుత్వ ప్లాన్..అంతర్జాతీయ మార్కెట్లో మునగాకుకు భారీ డిమాండ్

మునక్కాయలతో రకరకాల వంటకాలు, సాంబార్ చేసుకుని తింటుంటాం. కానీ నిజానికి మునక్కాయల కంటే మునగ ఆకుల్లోనే అద్భుతమైన పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. వందల ఏళ్లుగా ఆయుర్వేదంలో మునగాకును ఒక దివ్యౌషధంగా వాడుతున్నారు. సుమారు 300కు పైగా రోగాలను నయం చేసే శక్తి ఒక్క మునగాకులో ఉందంటే అతిశయోక్తి కాదు. మనకు పెరట్లో దొరికే ఈ మునగాకును నేటి ఆధునిక కాలంలో అంతర్జాతీయంగా ఒక సూపర్ ఫుడ్ గా గుర్తిస్తున్నారు. అమెరికా, యూరప్ లాంటి దేశాల్లో మునగాకు పొడికి విపరీతమైన డిమాండ్ ఉంది. కానీ మన రాష్ట్రంలో ఈ డిమాండ్ కు తగ్గట్టుగా రైతులు లాభాలు పొందలేకపోతున్నారు. కేవలం మునగ ఆకుల విక్రయానికే పరిమితమై, దళారీల చేతిలో నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని మార్చి, మునగ రైతులకు మహర్దశ తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 19 మునగ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. మునగ పండించే రైతులు కేవలం ఉత్పాదకులుగానే మిగిలిపోకూడదు.. వారిని ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ రంగాల్లో కూడా భాగస్వాములను చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీని ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ఏపీ సర్కార్ భారీ కసరత్తు చేపట్టింది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 19 మునగ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టు వివరాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారికంగా వెల్లడించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో ఈ యూనిట్లను నెలకొల్పుతున్నట్లు ఆయన తెలిపారు. అంటే రైతులు పండించిన మునగాకును బయట దళారులకు తక్కువ ధరకు అమ్ముకోకుండా.. నేరుగా ఈ FPO ల ద్వారా ప్రాసెసింగ్ యూనిట్లకు తీసుకువచ్చి, ఆకులను శుభ్రం చేసి, ఆరబెట్టి, పొడిగా మార్చి, ప్యాకింగ్ చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా అటు రైతులకు మెరుగైన మద్దతు ధర లభించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు స్థానికంగానే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఏదైనా కొత్త పథకం ప్రవేశపెట్టినప్పుడు అది గ్రౌండ్ లెవెల్ లో ఎంతవరకు సక్సెస్ అవుతుందన్న అనుమానాలు ఉంటాయి. అయితే మునగ ప్రాసెసింగ్ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన పైలట్ ప్రాజెక్టులు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన కొన్ని మునగ ప్రాసెసింగ్ యూనిట్లు విజయవంతంగా నడుస్తున్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యంగా తిరుపతి జిల్లాలోని యర్రావారిపాలెం, కడప జిల్లాలోని వీరబల్లి యూనిట్లు అత్యుత్తమ ఫలితాలు ఇస్తున్నాయి. వీటిలో యర్రావారిపాలెం ప్లాంట్ లో ఉపయోగిస్తున్న టెక్నాలజీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక్కడ అత్యాధునిక సాంకేతికతతో కూడిన మెషినరీని ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ ద్వారా రోజుకు ఏకంగా 250 కిలోల నాణ్యమైన మునగపొడి ఉత్పత్తి అవుతోంది. ఎక్కడో మారుమూల గ్రామాల్లో పండే మునగాకు, ఈరోజు అత్యున్నత ప్రమాణాలతో ప్రాసెస్ చేయబడి ప్యాకెట్ల రూపంలో మార్కెట్లోకి వస్తోంది.
తయారు చేసిన ప్రొడక్ట్ ను సరైన పద్ధతిలో మార్కెటింగ్ చేసినప్పుడే రైతుకు అసలైన లాభం దక్కుతుంది. అందుకే ఏపీ ప్రభుత్వం దళారులకు చెక్ పెడుతూ.. నేరుగా ఆన్లైన్ మార్కెట్పై కన్నేసింది. మునగ ఆకుల్లో ఉన్న పోషక విలువల కారణంగా దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా మునగ ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఉంది. జిమ్ కు వెళ్లేవారు, డైట్ ఫాలో అయ్యేవారు మునగాకు పొడిని క్రమం తప్పకుండా వాడుతున్నారు. ఈ డిమాండ్ ను క్యాష్ చేసుకునేందుకు, మన రాష్ట్ర మునగ ఉత్పత్తులను అంతర్జాతీయ బ్రాండ్లుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం దేశీయ, అంతర్జాతీయ మార్కెటింగ్ ఛానళ్లను అనుసంధానిస్తున్నారు. ప్రాసెసింగ్ యూనిట్లలో తయారైన మునగపొడిని.. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ వేదికల ద్వారా నేరుగా వినియోగదారులకు విక్రయించేలా ప్లాన్ చేశారు. దీనివల్ల రైతులకు దళారీల బెడద పూర్తిగా తప్పుతుందని, నేరుగా మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని వ్యవసాయ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ ఫుడ్ గా పేరున్న మొరింగ పౌడర్ ను మన రైతులే స్వయంగా అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించే రోజు రావడం రాష్ట్ర వ్యవసాయ రంగానికి శుభసూచకం. ప్రభుత్వ మద్దతు, సాంకేతికత తోడైతే మన రైతులు ప్రపంచ స్థాయికి ఎదగగలరని ఈ ప్రాజెక్ట్ నిరూపిస్తోంది.


