కోల్కతాలో తొక్కిసలాట అసలక్కడ ఏం జరిగింది?

దసరా నవరాత్రుల సందర్భంగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా నగరంలో జరిగే దుర్గా పూజ ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ప్రముఖ దుర్గా పూజ మండపమైన చోర్బగాన్ వద్ద ఊహించని రీతిలో జరిగిన తొక్కిసలాట అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. కోల్కతాలో ప్రతి ఏటా కొన్ని వందల సంఖ్యలో భారీ దుర్గా మండపాలు ఏర్పాటు చేస్తారు. ఇందులో కొన్ని పండల్లు అత్యంత ఆకర్షణీయంగా ఉండటంతో అక్కడికి భారీ సంఖ్యలో పోటెత్తుతారు. ప్రమాదం జరిగిన ఈ మండపం వద్ద కూడా సరిగ్గా ఇదే జరిగింది. సోషల్ మీడియాలో ఈ మండపం డిజైన్ వైరల్ కావడం, అందులోనూ శనివారం మహా సప్తమి కావడంతో ఊహించిన దానికంటే ఐదారు రెట్లు ఎక్కువ జనం అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో భారీ వర్షం మొదలైంది. బయటమండపంలోకి వెళ్లే దారి, బయటకు వచ్చే దారి రెండూ ఇరుకుగా ఉండటంతో లోపల ట్రాఫిక్ జామ్ అయిపోయింది. క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడిన జనం ఒక్కసారిగా సహనం కోల్పోయారు. అదే సమయంలో వీఐపీ గేటు తెరిచారన్న ప్రచారంతో.. వెనక ఉన్న జనం ఒక్కసారిగా ముందుకు తోసుకురావడం ప్రారంభించారు. ఈ భారీ జనసందోహం ఒత్తిడికి అక్కడున్న వెదురు బారికేడ్లు ఒక్కసారిగా విరిగిపోయాయి. దీంతో బ్యాలెన్స్ తప్పి ముందున్న వారు కింద పడిపోవడం, వారి మీదుగానే వెనక ఉన్న వేలాది మంది జనం నడుచుకుంటూ వెళ్లడంతో ఈ ఘోరమైన తొక్కిసలాట చోటుచేసుకుంది.
ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడిన ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న వివరాలు స్థానిక యంత్రాంగం వైఫల్యాన్ని కళ్లకు కడుతున్నాయి. మేము లోపలికి వెళ్లడానికి క్యూలో నిలబడి ఉన్నాం. వెనక నుంచి అకస్మాత్తుగా ఒక పెద్ద అల లాగా జనం మా మీదకు వచ్చి పడ్డారు. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే మేమంతా కింద పడిపోయాం అని ఒక మహిళ కన్నీరుమున్నీరయ్యారు. కింద పడిపోయిన వారిని తొక్కేసుకుంటూ జనం ముందుకు వెళ్లారని, ఆ సమయంలో పిల్లల, మహిళల ఆర్తనాదాలు మిన్నంటాయని సాక్షులు చెబుతున్నారు. ఊపిరి ఆడలేదు.. ఎవరైనా కాపాడండని అరుస్తున్నా వినిపించుకునే స్థితిలో ఎవరూ లేరు. ఎవరి ప్రాణాలు వాళ్లు కాపాడుకోవడానికే ప్రయత్నించారు. పోలీసుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో వారు కూడా ఆ జన ప్రవాహాన్ని ఏమాత్రం అడ్డుకోలేకపోయారుఅని అక్కడే ఉన్న ఒక వాలంటీర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒక వదంతులు , అధికారుల సమన్వయ లోపం వల్లే ఇంతటి ఘోరం జరిగిందని సాక్షులు స్పష్టం చేస్తున్నారు.
తొక్కిసలాట జరిగిన వెంటనే అప్రమత్తమైన కోల్కతా పోలీసులు అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కిందపడిపోయి ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లిన వారిని, తీవ్రంగా గాయపడిన వారిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. పిల్లలు, వృద్ధులే ఈ తొక్కిసలాటలో ఎక్కువగా గాయపడినట్లు వైద్యులు నిర్ధారించారు. మెడికల్ టీమ్స్ ఎమర్జెన్సీ వార్డుల్లో క్షతగాత్రులకు యుద్ధ ప్రాతిపదికన చికిత్స అందిస్తున్నాయి. ఈ ఘటనతో మండపం వద్ద పూజా కార్యక్రమాలను వెంటనే నిలిపివేసి, ఎంట్రీని పూర్తిగా క్లోజ్ చేశారు. వారం రోజుల క్రితమే క్రౌడ్ మేనేజ్మెంట్ పై పోలీసులు, పూజా కమిటీ నిర్వాహకులు ఎన్నో సమావేశాలు నిర్వహించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఆ ప్రణాళికలు పూర్తిగా విఫలమయ్యాయని ఈ ఘటన రుజువు చేసింది.
ఈ తొక్కిసలాట ఘటనపై పోలీసులు కీలక చర్యలకు ఉపక్రమించారు. ఈ దురదృష్టకర ఘటనలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రమేయం ఉన్న దుర్గా పూజ నిర్వాహకులతో సహా ఏడుగురిని అరెస్టు చేశారు. అంతే కాదు వీరిపై సుమోటోగా కసు నమోదు చేశారు .భారీ వర్షం తర్వాత జన సమూహాన్ని నియంత్రించడంలో మండపం నిర్వాహకులు విఫలమయ్యారని, తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయడం వంటివి భక్తుల్లో భయాందోళనలను రేకెత్తించాయని, దాని ఫలితంగానే తొక్కిసలాట జరిగిందని కోల్కతా పోలీసులు చెబుతున్నారు.. నిర్వాహకుల ఘోరమైన నిర్లక్ష్యానికి సంబంధించి తాము అన్ని ఆధారాలు సేకరించామని చెప్పారు. సీసీటీవీ కెమెరా ఫుటేజీని సేకరించి, స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేశామన్నారు. మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది . అలాగే తొక్కిసలాటలో చనిపోయిన వారి మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ముందస్తుగానే పటిష్టమైన చర్యలు తీసుకుంటే అమాయకుల ప్రాణాలు నిలబడతాయని గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.



