గుజరాత్‌ను దాటి ప్రకృతి సేద్యంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్
ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ భేష్..ప్రకృతి వ్యవసాయంలో ఏపీ సాధిస్తున్న విజయాలకు జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు

అధిక పెట్టుబడులు, రసాయన ఎరువుల వాడకంతో వ్యవసాయం దండగ అని భావిస్తున్న రోజుల్లో.. ఏపీ రైతులు మాత్రం ప్రకృతి సేద్యం బాట పట్టి అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఒకప్పుడు ప్రకృతి వ్యవసాయం సాధ్యం కాదని చాలామంది విమర్శించినా, నేడు అదే విధానంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి చేరుకుంది. రాష్ట్రంలో ప్రకృతి సేద్యం పెంపు, పీఎండీఎస్ అమలు తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా అధికారులతో, రైతులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని గణనీయంగా తగ్గించి, దిగుబడులు పెంచుతున్న రైతులను సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఎల్ నినో లాంటి తీవ్రమైన కరువు పరిస్థితులను సైతం తట్టుకుని ఏపీ రైతులు ప్రకృతి సేద్యంలో ఏ విధంగా లాభాలు గడిస్తున్నారు? గుజరాత్‌ను మించిపోయి ఏపీ ఎలా అగ్రస్థానంలో నిలిచిందో చూద్దాం.
ప్రకృతి వ్యవసాయం విజయవంతం కాదని గతంలో కొందరు దుష్ప్రచారం చేశారు. కానీ చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌లో వెల్లడించిన గణాంకాలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. 2016లో కేవలం 40 వేల మంది రైతులతో ప్రారంభమైన ఈ ప్రకృతి సేద్యం.. నేడు ఏకంగా 17 లక్షల 73 వేల మంది రైతులకు చేరింది. భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
రసాయన ఎరువులు వాడటం వల్ల భూసారం క్షీణించడమే కాకుండా, సాగు ఖర్చులు విపరీతంగా పెరిగి రైతుకు భారంగా మారుతున్నాయి. అదే ప్రకృతి వ్యవసాయం పద్ధతులను పాటిస్తే రైతులకు 47 శాతం మేర నికర ఆదాయం పెరిగిందని క్షేత్రస్థాయి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా పత్తి పంటలో ఏకంగా 96 శాతం, కందుల సాగులో 87 శాతం మేర రైతులకు అదనపు నికర ఆదాయం సమకూరింది. పెట్టుబడి వ్యయం తగ్గి, రాబడి పెరగడంతో రైతులు ఇప్పుడు స్వచ్ఛందంగా ప్రకృతి సేద్యం వైపు అడుగులు వేస్తున్నారు. ప్రకృతి సేద్యం కేవలం ఖర్చు తగ్గించడానికే కాదు, కరువును జయించడానికి కూడా అద్భుతంగా పనిచేస్తోంది. ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న ఎల్ నినో కరువును తట్టుకునేలా ప్రకృతి సాగు ద్వారా భూతాపాన్ని తగ్గించే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు. భూమిపై గ్రీన్ కవర్ పెరిగితే, తేమను సుదీర్ఘకాలం కాపాడుకోవచ్చు. దీనివల్ల చిన్నపాటి వర్షం పడినా పంటలను సులభంగా కాపాడుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాయలసీమ లాంటి వర్షాభావ ప్రాంతాల్లో ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించేందుకు.. కేవలం అనంతపురం జిల్లాలోనే ఏకంగా 10 లక్షల పంట కుంటలు తవ్వించినట్లు సీఎం గుర్తుచేశారు. చెక్ డ్యామ్‌లు, ట్రెంచ్‌ల నిర్మాణం చేపట్టడంతో పాటు స్థానికంగా ఉన్న నీటి వనరుల బేసిన్లను అనుసంధానించడం ద్వారా భూగర్భ జలాలను పెంచుతున్నారు. వర్షాలు పడని ప్రాంతాల్లో ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహిస్తూ, ఏడాది పొడవునా రైతులకు ఆదాయం, పశుగ్రాసం లభించేలా ప్రణాళికలు అమలు చేస్తున్నారు.


