ట్రాన్స్జెండర్లు శబరిమల వెళ్లడంపై కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం కోట్లాది మంది హిందువుల పరమ పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ముఖ్యంగా శబరిమల ఆలయానికి కొన్ని వందల ఏళ్ల నాటి కఠినమైన ఆచారాలు, నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా రుతుక్రమ వయసులో ఉన్న మహిళలకు అక్కడ ప్రవేశం లేదన్న విషయంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది, ఆ వివాదం ఇంకా సుప్రీంకోర్టులో నడుస్తూనే ఉంది. ఇప్పుడు శబరిమల సన్నిధానంలో మరో సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లాలనుకునే ట్రాన్స్జెండర్ వ్యక్తుల ప్రవేశంపై ఇప్పుడు న్యాయస్థానాల్లో చర్చ జరుగుతోంది. లింగమార్పిడి చేయించుకున్న వారు, లేదా ట్రాన్స్జెండర్లు నేరుగా గుడిలోకి వెళ్లొచ్చా? అన్న దానిపై కేరళ ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వివాదానికి కేంద్రబిందువు తమిళనాడుకు చెందిన ట్రాన్స్జెండర్ మహిళ సత్యశ్రీ షర్మిలా రెహెమథాలి. అయ్యప్ప స్వామి భక్తురాలైన ఆమె నిర్ణీత ఆచారాలను పాటిస్తూ, మండల దీక్ష తీసుకుని శబరిమల యాత్ర చేపట్టేందుకు తనకు అనుమతి ఇవ్వాలని నేరుగా కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం.. సత్యశ్రీ షర్మిలా ఈ ఏడాది జనవరి 3న, అలాగే ఏప్రిల్ 15 తేదీల్లో శబరిమలను సందర్శించారు. అయితే, రీసెంట్గా ఆగస్టు 20న ఆమె మరోసారి దర్శనం కోసం సన్నిధానం వైపు వెళ్తుండగా పంబ గణపతి ఆలయం సమీపంలో ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ట్రాన్స్జెండర్ మహిళ కావడంతో, ఆలయ ఆచారాల ప్రకారం పైకి అనుమతించలేమని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో తీవ్ర నిరాశకు గురైన ఆమె.. దర్శనానికి అనుమతి కోరుతూ ఆగస్టు 26న కేరళ ప్రభుత్వ ఉన్నతాధికారులకు, ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుకు వినతిపత్రాలు సమర్పించారు. కానీ బోర్డు నుంచి సరైన స్పందన రాకపోవడంతో, తన ప్రాథమిక హక్కులను కాపాడాలంటూ ఆమె కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు.
హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో.. అసలు దేవస్వం బోర్డు వాదన ఏంటన్నది ఇక్కడ కీలకంగా మారింది. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ఎవరినైనా ఉద్దేశపూర్వకంగా ఆపుతుందా అంటే, లేదనే చెప్పాలి. వాళ్లకు కొన్ని కచ్చితమైన నిబంధనలు ఉన్నాయి. పిటిషనర్ సత్యశ్రీ షర్మిలా లింగ గుర్తింపును నిర్ధారించే అధికారం తమకు లేదని దేవస్వం బోర్డు కోర్టుకు విన్నవించింది. ఒక వ్యక్తి ట్రాన్స్జెండరా, పురుషుడా, లేక మహిళా అని కంటిచూపుతో నిర్ధారించడం సాధ్యం కాదని బోర్డు చెబుతోంది.అందుకే తమిళనాడు అధికారుల నుంచి లేదా సంబంధిత ప్రభుత్వ వైద్య సంస్థ నుంచి అధికారిక ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని బోర్డు ఆమెకు సూచించింది. అలా సర్టిఫికెట్ సమర్పించిన తర్వాతే దర్శనానికి అనుమతించే అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఒకవేళ ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేకుండా, సరైన నిర్ధారణ చేయకుండా ప్రవేశం కల్పిస్తే.. శబరిమల ఆలయ ఆచారాలు, వందల ఏళ్ల నాటి సంప్రదాయాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని దేవస్వం బోర్డు తన ఆందోళనను వ్యక్తపరిచింది. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు తీసుకున్న ఈ స్టాండ్కే కేరళ ప్రభుత్వం కూడా పూర్తి మద్దతు ప్రకటించింది. పిటిషనర్ దాఖలు చేసిన కేసుపై కేరళ ప్రభుత్వం హైకోర్టులో ఒక సుదీర్ఘమైన అఫిడవిట్ దాఖలు చేసింది. ఆలయంలోకి ప్రవేశించేముందు భక్తుల లింగ నిర్ధారణ పత్రాలు అడగడంలో దేవస్వం బోర్డు వైఖరి సరైనదేనని, ఆ వైఖరికే తాము మద్దతు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. శబరిమల అనేది కేవలం ఒక పర్యాటక ప్రదేశం కాదు, అదొక అత్యంత సున్నితమైన మతపరమైన పుణ్యక్షేత్రం. అక్కడ ఆచారాలకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. అందుకే తమిళనాడు ప్రభుత్వ అధికారుల నుంచి లేదా మెడికల్ బోర్డు నుంచి ధ్రువీకరణ పత్రాలు లేకుండా, కేవలం మౌఖిక అభ్యర్థనల ఆధారంగా ఒక కొత్త విధానాన్ని తీసుకురాలేమని కేరళ సర్కార్ కోర్టుకు తెలిపింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, లింగ నిర్ధారణ పత్రాలు సమర్పిస్తే అప్పుడు దేవస్వం బోర్డు దానిపై ఒక నిర్ణయం తీసుకుంటుందని, అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగుతుందని ఆ అఫిడవిట్లో ప్రభుత్వం పేర్కొంది. శబరిమల ప్రవేశ నియమాలు, మతపరమైన ఆచారాలకు సంబంధించిన అంశాలు ప్రస్తుతం సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం పరిధిలో ఉన్నాయని కేరళ ప్రభుత్వం హైకోర్టుకు గుర్తుచేసింది. గతంలో 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, దానిపై వచ్చిన రివ్యూ పిటిషన్లు అన్నీ ఇంకా సుప్రీంకోర్టులోనే పెండింగ్లో ఉన్నాయి. ఈ మతపరమైన ఆచారాలు, లింగ వివక్ష, ప్రవేశ నియమాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక తుది నిర్ణయం తీసుకునే వరకు.. శబరిమలలో ప్రస్తుతం ఉన్న సంప్రదాయాలనే కచ్చితంగా కొనసాగించాలని కేరళ సర్కార్ పేర్కొంది. సుప్రీంకోర్టులో అంత పెద్ద కేసు నడుస్తున్నప్పుడు, మధ్యలో హైకోర్టు స్థాయిలో కొత్త మార్పులు తీసుకురావడం చట్టపరంగా కరెక్ట్ కాదని ప్రభుత్వం వాదిస్తోంది. కాబట్టి పిటిషనర్ సత్యశ్రీ షర్మిలా కోరిన విధంగా వెంటనే అనుమతులు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఆమె పిటిషన్ను కొట్టివేయాలని కేరళ ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది.



