ఎన్విడియా కొత్త బాస్ ఎవరు?..రేసులో మన ఇండియన్స్?

ప్రస్తుతం పరుగులు పెడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఆ సాంకేతికతకు ఎంతో కీలకమైన చిప్ తయారీలలో అగ్రగామి అయిన టెక్ దిగ్గజ సంస్థగా ఎన్విడియా పేరు తెలియని వారుండరు. అయితే ఇప్పుడు ఆ సంస్థ ఒక అతిపెద్ద నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒక అనుమానిత చైనా గూఢచారితో సంబంధాలు, అలాగే పలు వివాహేతర సంబంధాల ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. ఎన్విడియా సీఈఓ, వ్యవస్థాపకుడు అయిన జెన్సెన్ హువాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. సీఈఓ, ప్రెసిడెంట్ పదవులతో పాటు బోర్డు బాధ్యతల నుంచి కూడా తక్షణమే తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించడం టెక్ ప్రపంచంలో చర్చనీయంశంగా మారింది.
ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీలలో ఒకటైన ఎన్విడియాను నడిపించడానికి ఇప్పుడు కొత్త నాయకుడి కోసం అన్వేషణ మొదలైంది. ప్రస్తుతం చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కోలెట్ క్రెస్ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బోర్డు 11 మంది అగ్రశ్రేణి నాయకుల పేర్లను పరిశీలిస్తోంది. కొత్త సీఈఓ రేసులో ముందుగా వినిపిస్తున్న పేర్లు మన భారతీయులవే కావడం ఆసక్తికర అంశం. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నది మెమరీ చిప్ తయారీ సంస్థ మైక్రాన్ సీఈఓ సంజయ్ మెహ్రోత్రా. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించిన సంజయ్ కు చిప్ మేకింగ్ రంగంలో నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉంది. శాన్డిస్క్ సహ వ్యవస్థాపకుడిగా పనిచేసిన ఆయన.. ఏఐ సర్వర్లకు అవసరమైన హై-బ్యాండ్‌విడ్త్ మెమరీ చిప్‌ల తయారీతో మైక్రాన్ను 1 ట్రిలియన్ డాలర్ల కంపెనీగా మార్చారు. చిప్ రంగంలో ఆయనకున్న అనుభవం ఎన్విడియాకు బాగా కలిసొస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
రెండవ అభ్యర్థి సైబర్ సెక్యూరిటీ సంస్థ పాలో ఆల్టో నెట్వర్క్స్ సీఈఓ నికేష్ అరోరా . యూపీకే చెందిన ఈయన, గతంలో సాఫ్ట్‌బ్యాంక్ అధ్యక్షుడిగా, గూగుల్‌లో దశాబ్ద కాలం పాటు ఉన్నత పదవుల్లో పనిచేశారు. అయితే, ఆయనకు చిప్ తయారీ రంగంలో నేరుగా అనుభవం లేకపోవడం ఒక్కటే మైనస్ పాయింట్. ఇక మూడవ అభ్యర్థి కేరళకు చెందిన థామస్ కురియన్ . గూగుల్ క్లౌడ్ సీఈఓగా ఉన్న థామస్.. ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ , ఏఐ సేవలను పర్యవేక్షిస్తున్నారు. ఎన్విడియాకు ప్రధాన కస్టమర్లుగా ఉన్న క్లౌడ్ రంగాలపై ఆయనకు పూర్తి పట్టు ఉంది.అలాగే ఎన్విడియా బోర్డు ఇప్పుడు సంస్థ అంతర్గత అధికారుల పేర్లను కూడా సీరియస్‌గా పరిశీలిస్తోంది. ప్రస్తుతం సంస్థ తాత్కాలిక సీఈఓగా ఉన్న కోలెట్ క్రెస్ పేరు ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె 2013 నుండి ఎన్విడియా సీఎఫ్ఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో మైక్రోసాఫ్ట్, సిస్కో లాంటి దిగ్గజ సంస్థల్లో పనిచేసిన అనుభవం ఆమెకుంది. అంతర్గత రేసులో మరో బలమైన పేరు ఇయాన్ బక్ . ప్రస్తుతం ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 2004లో కంపెనీలో చేరారు. ఎన్విడియా కేవలం వీడియో గేమ్ చిప్‌ల సంస్థ నుండి ఒక గ్లోబల్ ఏఐ హార్డ్‌వేర్ దిగ్గజంగా మారడానికి కారణమైన సాఫ్ట్వేర్ ప్లాట్‌ఫారమ్ అభివృద్ధిలో ఇయాన్ బక్ పాత్ర కీలకం.

