డిసెంబరు నెలలో సాగు చేయాల్సిన పంటలేవి?ఎటువంటి కూరగాయల సాగు రైతులకు లాభం?

డిసెంబర్ నెలలో కూరగాయల సాగు అనగానే ముందుగా గుర్తొచ్చేది కాలీఫ్లవర్ . ఈ చలికాలం కాలీఫ్లవర్ సాగుకు అత్యంత అనుకూలమైన వాతావరణం. దీనికి పెట్టుబడి కూడా చాలా తక్కువే, ఎకరానికి కేవలం 50 వేల నుంచి 60 వేలు మాత్రమే ఖర్చవుతుంది. టమాటా లాగా రైతులకు స్టేకింగ్, మల్చింగ్ షీట్ల లాంటి అదనపు ఖర్చులు ఇందులో ఉండవు. కొత్తగా వ్యవసాయం చేసేవారు కాలీఫ్లవర్ సాగును చేపట్టడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. క్యాబేజీ కూడా కాలీఫ్లవర్ లాగానే మంచి ఆదాయాన్ని ఇస్తుంది. ఇక తక్కువ రోజుల్లోనే చేతికి డబ్బులు రావాలంటే ఆకుకూరలే బెస్ట్. కొత్తిమీర, పాలకూర వంటి ఆకుకూరలు విత్తిన 20 నుంచి 25 రోజుల్లోనే రైతుకు ఆదాయాన్ని అందిస్తాయి. అయితే ఒకేసారి ఎకరం మొత్తం కాకుండా, ఒక 10 నుంచి 20 గుంటల్లో దశలవారీగా సాగు చేసుకుంటే ప్రతిరోజూ మార్కెట్కు తీసుకెళ్లి మంచి లాభాలు పొందవచ్చు.
ఇక నెల లేదా రెండు నెలల గ్యాప్లో చేతికి వచ్చే పంటలు ముల్లంగి, బీట్రూట్, క్యారెట్. ఈ పంటలకు పెట్టుబడి చాలా తక్కువ. ఇవి తక్కువ సమయంలోనే బంపర్ దిగుబడిని ఇస్తాయి. ముల్లంగి అయితే 30 నుంచి 40 రోజుల్లో, బీట్రూట్ 60 రోజుల్లో, క్యారెట్ 80 నుంచి 90 రోజుల్లో మార్కెట్కు రెడీ అవుతాయి. ఇసుక పొలాలు లేదా ఎర్ర రేగడి నేలలు వీటికి అత్యంత అనుకూలం.
అలాగే రైతులు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న టెక్నాలజీ గ్రాఫ్టింగ్ ను వాడుకోవడం ఎంతో ముఖ్యం. గ్రాఫ్టింగ్ వంకాయను సాగు చేయడం వల్ల ఏకంగా రెండు సంవత్సరాల వరకు దిగుబడి పొందవచ్చు. దీనికి భూమిలో వచ్చే వ్యాధులను తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. నారు లభ్యత తక్కువగా ఉంటుంది కాబట్టి, నర్సరీల్లో ముందే ఆర్డర్ చేసుకోవడం మంచిది. గ్రాఫ్టింగ్ టమాటాను సాగు చేయడం వల్ల దిగుబడి పెరిగి, వ్యాధుల నిరోధకత పెరుగుతుంది. సాహో, బాహో లాంటి రకాలతో చలికాలంలో టమాటా సాగు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు పచ్చిమిర్చి సాగు చేస్తే.. సమ్మర్ వచ్చేసరికి ముడత, వైరస్ రోగాలను తట్టుకుని జూన్, జూలైల్లో అదిరిపోయే ధరలు తెచ్చిపెడుతుంది.



