పాక్ దగ్గర ఉన్న అణుబాంబులు సురక్షితమేనా?..ఐఏఈఏ ఏం చెప్పింది?

నిత్యం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతున్నా బుద్ది మార్చుకోని దేశం పాకిస్థాన్. ఇలాంటి ఒక అస్థిరమైన దేశం దగ్గర అత్యంత ప్రమాదకరమైన అణ్వాయుధాలు ఉంటే ప్రపంచ దేశాలకు ప్రమాదం. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కూడా పాకిస్థాన్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశం.. ఎందుకంటే వాళ్ల దగ్గర ఎలాంటి పటిష్టమైన భద్రత లేని అణ్వాయుధాలు ఉన్నాయి అని ఓపెన్‌గానే కామెంట్ చేశారు. ఒకవేళ దేశంలో అల్లర్లు జరిగి, సైన్యం చేతుల్లో నుంచి ఆ అణుబాంబులు ఉగ్రవాదుల చేతికి వెళితే.. ఈ ప్రపంచం ఏమైపోతుందో అన్న భయం అగ్రరాజ్యాలను సైతం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ భయాలన్నింటినీ పటాపంచలు చేస్తూ ఒక సంచలన రిపోర్ట్ బయటకు వచ్చింది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకు చెందిన నిపుణుల బృందం ఒక సంచలన రిపోర్టును బయటపెట్టింది.
ఇంటర్నేషనల్ ఫిజికల్ ప్రొటెక్షన్ అడ్వైజరీ సర్వీస్..ఇది ప్రపంచవ్యాప్తంగా అణు పదార్థాలు, అణు కేంద్రాలు ఎంత భద్రంగా ఉన్నాయో అంచనా వేసి, వాటిని ఉగ్రవాదులు లేదా దొంగలు ఎత్తుకెళ్లకుండా దేశాలు తీసుకుంటున్న చర్యలను పరిశీలిస్తుంది. చరిత్రలో తొలిసారిగా.. ఐపీపీఏఎస్ కు చెందిన ఒక ఏడుగురు సభ్యుల నిపుణుల బృందం పాకిస్థాన్‌లో ఏకంగా 12 రోజుల పాటు పర్యటించింది. ఈ 12 రోజుల పాటు వాళ్లు పాకిస్థాన్ అణు భద్రతా ఫ్రేమ్‌వర్క్‌ను జల్లెడ పట్టారు. ఈ బృందానికి మొరొకో ఏజెన్సీ ఫర్ న్యూక్లియర్ అండ్ రేడియోలాజికల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మాజీ డైరెక్టర్ జనరల్ ఖమ్మర్ రాబిట్ నేతృత్వం వహించారు. ఈ టీమ్‌లో చైనా, రొమేనియా, రష్యా, స్లొవేకియా లాంటి దేశాలకు చెందిన టాప్ న్యూక్లియర్ ఎక్స్‌పర్ట్స్‌తో పాటు.. ఐఏఈఏకు చెందిన ఇద్దరు స్టాఫ్ మెంబర్లు కూడా ఉన్నారు. వీరంతా కలిసి పాకిస్థాన్‌లోని న్యూక్లియర్ మెటీరియల్ దాచిన ప్రదేశాలు, అణ్వాయుధ కేంద్రాలు, వాటి చుట్టూ ఉన్న ఫిజికల్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, మిలిటరీ ప్రొటోకాల్స్ పనితీరును అత్యంత నిశితంగా గమనించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే పాక్ సైన్యం దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తుందనే విధానాలను కూడా వారు అంచనా వేశారు.
ఈ 12 రోజుల సుదీర్ఘ పరిశీలన తర్వాత ఐఏఈఏ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇది విన్నాక ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అంతా ఊపిరి పీల్చుకుంది. పాకిస్థాన్ తమ అణ్వాయుధ కేంద్రాలను, న్యూక్లియర్ మెటీరియల్‌ను కాపాడుకోవడానికి అనుసరిస్తున్న భద్రతా ప్రమాణాలు చాలా అద్భుతంగా ఉన్నాయని ఈ నిపుణుల బృందం వెల్లడించింది. పాక్ అణు భద్రతా పాలనా విధానం రోజురోజుకూ మెరుగవుతోందని, ఆ దేశం కేవలం అణ్వాయుధాలు తయారు చేసుకోవడమే కాకుండా.. వాటి భద్రతపై కూడా ఎప్పటికప్పుడు సెల్ఫ్-రివ్యూ నిర్వహించుకుంటోందని ఐఏఈఏ కితాబు ఇచ్చింది. అంతేకాకుండా, భవిష్యత్తులో కూడా ఈ సెక్యూరిటీని మైంటైన్ చేయడానికి, కొత్త సాంకేతికతను నేర్చుకోవడానికి పాక్ ఒక కెపాసిటీ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఏర్పాటు చేసుకుని తీవ్రంగా కృషి చేస్తోందని పేర్కొంది.
దీనిపై ఐఏఈఏ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అధిపతి అయిన కరీన్ హెర్వియో మాట్లాడుతూ..పాకిస్తాన్లో జరిగిన ఈ మొదటి ఐపీపీఏఎస్ మిషన్ విజయవంతంగా పూర్తయింది. దేశంలో ఇప్పటికే స్థిరంగా ఉన్న అణు భద్రతా వ్యవస్థను, కార్యాచరణ అంశాలను మరింత బలోపేతం చేయడంలో పాకిస్థాన్‌కు ఉన్న నిబద్ధతను ఈ మిషన్ చాటిచెబుతోంది అని స్పష్టం చేశారు. అయితే భవిష్యత్తు కోసం కొన్ని చిన్న చిన్న సిఫారసులను కూడా ఈ బృందం పాక్ ప్రభుత్వానికి అందజేసింది.
ఇప్పుడు పాకిస్థాన్ ఉన్న పరిస్థితుల్లో ఈ రిపోర్ట్ రావడం ఆ దేశానికి ఒక పెద్ద దౌత్యపరమైన బూస్ట్ అని చెప్పాలి. అయితే ఐఏఈఏ ఇచ్చిన ఈ క్లీన్ చిట్ ద్వారా.. పాకిస్థాన్ సైన్యం ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది. దేశంలో రాజకీయాలు, ఎకానమీ ఎంత దారుణంగా ఉన్నా సరే.. మా దేశ భద్రత, ముఖ్యంగా అణు ఆయుధాల కంట్రోల్ విషయంలో మేము ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదని పాక్ ఆర్మీ ప్రపంచానికి ప్రూవ్ చేసుకుంది. ఇది పాకిస్థాన్‌కు గ్లోబల్ ప్లాట్‌ఫామ్ మీద తమ ఇమేజ్ను డ్యామేజ్ కాకుండా కాపాడుకోవడానికి చాలా పెద్ద అస్త్రంగా పనికొస్తుంది. మొత్తానికి, పాకిస్థాన్ అణు కేంద్రాలు బయటి వ్యక్తుల నుంచి, ఉగ్రవాదుల నుంచి సేఫ్‌గానే ఉన్నాయని తేలిపోయింది.



