పాక్ సీక్రెట్ లీక్ ..దేశాన్ని వదిలి పారిపోతున్న అధికారులు!

దశాబ్దాలుగా తీవ్రవాదాన్ని పెంచిపోషిస్తూ ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి, రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్న దేశం. సామాన్య ప్రజలు పూట గడవక అల్లాడుతున్నారు, ద్రవ్యోల్బణం దూసుకుపోతోంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో దేశాన్ని కాపాడాల్సిన, సరైన మార్గంలో నడిపించాల్సిన ప్రభుత్వ ఉన్నతాధికారులే పారిపోయినట్లు విదేశాలకు జంప్ అవుతున్నారు. పాకిస్థాన్లో ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. సాక్షాత్తూ ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు పాక్ రాజకీయాల్లో, బ్యూరోక్రాట్ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పాకిస్థాన్లో ఉన్నత పదవుల్లో, ఐఏఎస్ స్థాయి పోస్టుల్లో ఉన్న బ్యూరోక్రాట్లు.. ఉద్యోగంలో ఉండగానే విదేశాల్లో శాశ్వత నివాసాలను ఏర్పాటు చేసుకుంటున్నారని ఆయన బట్టబయలు చేశారు.
పాకిస్థాన్ రాజకీయాల్లో ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, తాజాగా ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్ పాక్ బ్యూరోక్రసీని గుట్టురట్టు చేసింది. దేశంలో అత్యున్నత స్థాయి విధాన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వ ఉన్నతాధికారులు .. తమ విధుల పట్ల ఎలాంటి నిబద్ధత లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా పాకిస్థాన్ కు చెందిన పలువురు కీలక అధికారులు అమెరికా, బ్రిటన్, కెనడా తో పాటు పలు యూరప్ దేశాలకు వలస వెళ్లిపోవడానికి సీక్రెట్ గా ప్లాన్స్ చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పాకిస్థాన్ బ్యూరోక్రాట్లకు యూరప్ దేశమైన పోర్చుగల్ ఇటీవలి కాలంలో ఒక ముఖ్యమైన గమ్యస్థానంగా మారిపోయిందట. ఉద్యోగంలో ఉంటూనే, తమ కుటుంబాలను అక్కడికి తరలించి, పోర్చుగల్ పాస్ పోర్ట్ సంపాదించడానికి పాక్ అధికారులు నానా తంటాలు పడుతున్నారని రక్షణ మంత్రి చెప్పడం పరిస్థితి ఎలా ఉందో చెబుతోంది. ఒక దేశ భద్రత, ఆర్థిక విధానాలు, రహస్య సమాచారం అంతా చేతిలో ఉండే ఉన్నతాధికారులు.. ఇలా వేరే దేశాల పౌరసత్వం కోసం వెంపర్లాడటం దేశ భద్రతకే అతిపెద్ద ముప్పు. వీళ్లు తమ స్వార్థం కోసం దేశ రహస్యాలను సైతం విదేశీ గూఢచార సంస్థలకు అమ్మేసే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సొమ్మును దోచుకుని, ఆ బ్లాక్ మనీని విదేశాలకు తరలించి అక్కడ విలాసవంతమైన జీవితం గడపాలని ప్లాన్ చేసుకున్న ఈ బ్యూరోక్రాట్లకు ఒక దిమ్మతిరిగే షాక్ తగిలింది. విదేశాల్లో, ముఖ్యంగా పోర్చుగల్ , ఇతర యూరప్ దేశాల్లో శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసేందుకు అధికారులకు సహాయం చేస్తానని నమ్మించిన ఒక వ్యక్తి.. ఈ అధికారుల దగ్గర నుంచి భారీ స్థాయిలో, అంటే కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి చివరకు ముఖం చాటేసి పారిపోయినట్లు ఖవాజా ఆసిఫ్ తన పోస్ట్ లో వెల్లడించారు. అవినీతి అధికారుల దగ్గరే డబ్బులు కొట్టేసి ఆ మధ్యవర్తి ఎస్కేప్ అయ్యాడన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది.
అయితే, ఆ మోసం చేసిన వ్యక్తి ఎవరు? మోసపోయిన ఆ పాక్ ఉన్నతాధికారులు ఎవరు? దానికి సంబంధించిన ఆధారాలు ఏంటి? అన్న వివరాలను మాత్రం రక్షణ మంత్రి బహిరంగంగా వెల్లడించలేదు. కానీ ఈ ప్రకటనతో పాకిస్థాన్ పరిపాలనా యంత్రాంగం ఏ స్థాయిలో అవినీతి కూపంలో కూరుకుపోయిందో, దేశం పట్ల వాళ్లకు ఎంత ప్రేమ ఉందో ప్రపంచానికి మరోసారి అర్థమైంది. రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన ఈ వ్యాఖ్యలను కేవలం బ్యూరోక్రాట్ల అవినీతి కోణంలో మాత్రమే చూడలేం. దీని వెనుక పాకిస్థాన్ లో నడుస్తున్న అతిపెద్ద పవర్ గేమ్ దాగి ఉంది. పాకిస్థాన్ లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, అసలు రిమోట్ కంట్రోల్ మొత్తం మిలిటరీ చేతిలోనే ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. ప్రస్తుతం ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ప్రభావం విపరీతంగా పెరుగుతోంది. విధానపరమైన నిర్ణయాలు, విదేశాంగ వ్యవహారాలు, ఆర్థిక పెట్టుబడుల సమీకరణ.. ఇలా ప్రతి చిన్న విషయంలోనూ ఆర్మీ జోక్యం చేసుకుంటోంది. సివిల్ అధికారులకు, ప్రభుత్వానికి కనీస స్వేచ్ఛ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం, సైన్యం మధ్య సంబంధాలు మరోసారి అత్యంత ఉద్రిక్తంగా మారాయని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ఆర్మీ పెత్తనం భరించలేక, దేశ భవిష్యత్తుపై నమ్మకం కోల్పోయిన సివిల్ బ్యూరోక్రాట్లు ఇలా విదేశాలకు వలస వెళ్లిపోవడమే సేఫ్ అని భావిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



