గంటల తరబడి కూర్చుంటున్నారా? రోజూ ఈ చిన్న పనులు చేస్తే ఆరోగ్యానికి మేలు!

ఆధునిక జీవనశైలిలో శారీరక శ్రమ తగ్గుతోంది. చాలా మంది ఎక్కువ సమయం కుర్చీలో కూర్చుని పని చేస్తున్నారు. ఆఫీసులలో కంప్యూటర్ ముందు గంటల తరబడి పనిచేసేవారు, ఇంటి నుంచే ఉద్యోగాలు చేసేవారు, ఎక్కువసేపు ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ఉపయోగించేవారు ఈ అలవాటు వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. శారీరక శ్రమ తగ్గడం వల్ల బరువు పెరగడం, నడుము నొప్పులు, కండరాల బిగుతు వంటి సమస్యలు తలెత్తవచ్చు. అంతేకాకుండా, శారీరక చురుకుదనం లేకపోవడం, అధిక కేలరీల ఆహారం తీసుకోవడం వంటి అంశాలు ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని కూడా పెంచవచ్చు.ఎక్కువసేపు కూర్చోవడం వల్ల లివర్ పై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం. కాలేయ కణాల్లో అధికంగా కొవ్వు పేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్గా పేర్కొంటారు. శరీరంలో అధిక కొవ్వు, ఇన్సులిన్ నిరోధకత, మధుమేహం, అధిక బరువు, వ్యాయామం లేకపోవడం వంటి అంశాలు ఈ సమస్యకు కారణమవ్వవచ్చు. కూర్చుని పనిచేసే ప్రతి ఒక్కరికీ ఫ్యాటీ లివర్ వస్తుందని చెప్పలేం. అయితే, రోజువారీ శారీరక శ్రమను పెంచుకోవడం, ఆహారపు అలవాట్లను మెరుగుపరచుకోవడం ద్వారా ఈ సమస్య వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
అలాగే ఎక్కువసేపు ఒకే పద్దతిలో కూర్చోవడం, సరైన కుర్చీ లేకపోవడం, ఇతరత్రా కారణాలతో నడుము, మెడ, భుజాల వద్ద అసౌకర్యంగా అనిపించవచ్చు. కుర్చీలో కూర్చునేటప్పుడు వెన్నుకు సరైన ఆధారం ఉండేలా చూసుకోవాలి. పాదాలు నేలకు ఆనాలి, మోకాళ్లు సుమారు 90 డిగ్రీల కోణంలో ఉండేలా కూర్చోవాలి. కంప్యూటర్ స్క్రీన్‌ను కళ్లకు అనుకూలమైన ఎత్తులో ఉంచడం వల్ల మెడను పదేపదే ముందుకు వంచాల్సిన అవసరం ఉండదు.
ఇక గంటల తరబడి ఒకేచోట కూర్చోవడం కంటే, ప్రతి 30 నిమిషాలకు ఒకసారి లేచి రెండు నుంచి ఐదు నిమిషాల పాటు నడవడం మంచి అలవాటు. పని మధ్యలో ఫోన్ మాట్లాడేటప్పుడు నిలబడి మాట్లాడవచ్చు. చిన్న పనుల కోసం స్వయంగా లేచి వెళ్లవచ్చు. వీలైతే మెట్లు ఎక్కడం, ఆఫీసులో కొద్దిసేపు నడవడం వంటి చిన్న మార్పులను రోజువారీ పనుల్లో భాగం చేసుకోవాలి. ఈ చిన్న విరామాలు రోజంతా కూర్చునే సమయాన్ని తగ్గిస్తాయి.
ఆరోగ్యంగా ఉండేందుకు జిమ్‌కు వెళ్లడం తప్పనిసరి కాదు. అయితే కుదిరినంత వరకు శరీరాన్ని యాక్టివ్ గా ఉంచడానికి ప్రయతించాలి. వేగంగా నడవడం, సైక్లింగ్, స్విమ్మింగ్, డ్యాన్స్ ఇలా మీకు అనుకూలంగా ఉన్న దానిని చేస్తూ ఉండాలి. పెద్దలు వారానికి కనీసం 150 నుంచి 300 నిమిషాల మధ్యస్థ తీవ్రత కలిగిన శారీరక కార్యకలాపాలు చేయాలని సాధారణ ఆరోగ్య మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. దీనితో పాటు వారానికి కనీసం రెండు రోజులు కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు చేయడం మంచిది. అయితే, ఇప్పటికే నడుము నొప్పులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే, తగిన వ్యాయామాలను వైద్య నిపుణుల సలహాతో ఎంచుకోవాలి.
ఆహారపు అలవాట్లలో మార్పులు కూడా అవసరం. బరువును నియంత్రించుకోవాలంటే కచ్చితంగా కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా నూనెలో వేయించిన పదార్థాలు, అధిక చక్కెర ఉన్న పానీయాలు, స్వీట్లు, అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తరచుగా తీసుకోవడం తగ్గించాలి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలు, తగిన మోతాదులో ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని రోజువారీ భోజనంలో భాగం చేసుకోవడం అవసరానికి తగినంత నీరు తాగాలి. ఆల్కహాల్ తీసుకోవడం కాలేయ ఆరోగ్యానికి హానికరం కావచ్చు కాబట్టి దానికి దూరంగా ఉండటం మంచిది. బరువు అధికంగా ఉన్నవారు వైద్యుల సలహాతో క్రమంగా తగ్గించుకోవడం కూడా ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
ఇక శరీరానికి రోజుకు సరిపడా నిద్రపోవడం, పని వేళలను క్రమబద్ధీకరించుకోవడం, మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగం. రాత్రివేళల్లో ఎక్కువసేపు మేల్కొని ఉండటం, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కలిసినప్పుడు బరువు నియంత్రణ కష్టమవుతుంది. అందువల్ల ఒక్క అలవాటుపైనే కాకుండా మొత్తం జీవనశైలిపై దృష్టి పెట్టాలి. రోజులో కొద్దిసేపు నెమ్మదిగా శ్వాస తీసుకోవడం, చిన్న నడకకు వెళ్లడం లేదా కళ్లకు విశ్రాంతి ఇవ్వడం ప్రయోజనంగా ఉంటుంది. రోజంతా కూర్చుని పనిచేయాల్సి వచ్చినా, చిన్న చిన్న మార్పులతో యాక్టివ్ లైఫ్ స్టైల్ ను అలవాటు చేసుకోవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పెద్ద మార్పుల కంటే ప్రతిరోజూ పాటించే మంచి అలవాట్లే కీలకం.

