పాడి రైతుకు అండగా…ప్రత్యేక బ్రీడింగ్ పాలసీ..తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతున్న లక్షలాది మంది రైతులకు ఒక అద్భుతమైన గుడ్ న్యూస్. కేవలం పంటలు పండిస్తేనే కాదు, ఇంట్లో రెండు పాడి పశువులు ఉంటే ఆ రైతు కుటుంబానికి ఆర్థికంగా ఎంతో కొండంత అండ ఉంటుంది. అయితే, సరైన బ్రీడ్ లేకపోవడం వల్ల పాల దిగుబడి తక్కువ రావడం, అలాగే పశువుల రక్షణ లేకపోవడం పాడి రైతులను ఎప్పుడూ వేధించే ప్రధాన సమస్యలు. కానీ, ఇకపై ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో పశుసంపద నాణ్యతను పెంచడం, పాల ఉత్పత్తిని విస్తరించడం, గో సంరక్షణకు ప్రాధాన్యమివ్వడం లక్ష్యంగా తెలంగాణ లైవ్‌స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ పలు కీలక తీర్మానాలు చేసింది. తాజాగా జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ప్రత్యేక బ్రీడింగ్ పాలసీని రూపొందించింది.దీనితో పాటే గో ప్రొటెక్షన్ కమిషన్ ఏర్పాటు, గోవును తెలంగాణ సాంస్కృతిక జంతువుగా గుర్తించడం వంటి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పశుగణ సంపద నాణ్యతను మెరుగుపరిచేందుకు శాస్త్రీయ విధానాలతో కూడిన ప్రత్యేక బ్రీడింగ్ పాలసీని రూపొందించి అమలు చేయాలని ఈ సమావేశం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పశుసంపద అభివృద్ధికి ప్రత్యేక విధానం లేకపోవడంతో ఈ దిశగా చర్యలు తీసుకోవాలని తీర్మానించింది. మన దగ్గర ఉన్న దేశవాళీ ఆవులు, గేదెలు రోజుకు 3 నుంచి 5 లీటర్ల పాలు మాత్రమే ఇస్తుంటాయి. అదే ముర్రా , జెర్సీ, సాహివాల్ లాంటి మేలు జాతి పశువులు అయితే రోజుకు 15 నుంచి 20 లీటర్ల పాలు ఇస్తాయి.పాడి రైతుల ఆదాయం పెరగాలంటే కచ్చితంగా వాళ్ల దగ్గర ఎక్కువ పాలు ఇచ్చే మేలు జాతి పశువులు ఉండాలి. దీనికోసమే ప్రభుత్వం ఈ ప్రత్యేక బ్రీడింగ్ పాలసీని తీసుకొస్తోంది. ఈ పాలసీ కింద గ్రామాల్లో ఉన్న పశువుల ఆసుపత్రుల ద్వారా అత్యుత్తమ జాతికి చెందిన వీర్యాన్ని ఉపయోగించి కృత్రిమ గర్భధారణ చేయిస్తారు. దీనివల్ల పుట్టే దూడలు మేలు జాతి లక్షణాలతో పుడతాయి. అంతేకాకుండా, రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండే మన స్థానిక దేశవాళీ బ్రీడ్స్‌ను కూడా అంతరించిపోకుండా కాపాడేందుకు ఈ పాలసీలో ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నారు. రైతులకు మంచి పశుగ్రాసం అందించడం, వెటర్నరీ సేవలను మరింత చేరువ చేయడం ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం. ఈ విధానం పూర్తిస్థాయిలో అమలైతే తెలంగాణలో పాల ఉత్పత్తి రెట్టింపు అవ్వడమే కాకుండా, రైతుల ఆదాయం కూడా భారీగా పెరుగుతుంది.



