ఆరుతడి పంటలకు ప్రోత్సాహం…యాసంగి సాగుపై తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్లాన్
కామెంట్లు (0)

ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో వర్షాలు సరిగ్గా పడకపోవడంతో రైతులు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా , అనుకున్న సమయానికి విత్తనాలు వేయలేకపోయారు. దీనివల్ల దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం పరిస్థితే ఇలా ఉంటే, యాసంగి పరిస్థితి ఏంటి? భూమిలో తేమ లేదు, చెరువుల్లో, ప్రాజెక్టుల్లో సరిపడా నీళ్లు లేవు. సరిగ్గా ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన తెలంగాణ వ్యవసాయ శాఖ..యాసంగి సాగు కోసం ఒక పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.
నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని ప్రభుత్వం రైతులను కోరుతోంది. ముఖ్యంగా యాసంగిలో నూనెగింజ పంటలైన వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, పప్పుధాన్యాలైన శనగ, మినుము, పెసర, అలాగే కూరగాయల సాగును విస్తరించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ ఆరుతడి పంటల వల్ల నీటి వినియోగం భారీగా తగ్గుతుంది. అంతేకాదు, మార్కెట్లో ఈ పంటలకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి రైతులకు మంచి ఆదాయం కూడా వస్తుంది. రైతులు ఈ పంటల వైపు మళ్లాలంటే ముందుగా వాళ్లపై పెట్టుబడి భారం తగ్గించాలి. అందుకే, ఈ ఆరుతడి పంటలకు అవసరమైన విత్తనాలను రాయితీపై అందించడానికి ప్రభుత్వం ఏకంగా రూ. 224 కోట్లను అంచనా వేసింది. దీనికి తోడు ఉద్యాన పంటలను ప్రోత్సహించడానికి, విస్తరించడానికి మరో 296 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదిక పంపింది. అంటే మొత్తంగా రైతుల కోసం సుమారు 520 కోట్ల భారీ ప్యాకేజీని వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తోందన్నమాట. ఇది నిజంగా రైతులకు ఒక బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు.
ఆరుతడి పంటలు ఎలా వేయాలి, ఎల్ నినో ఎఫెక్ట్ నుంచి ఎలా తప్పించుకోవాలి అన్న విషయాలపై రైతులకు పూర్తి అవగాహన కల్పించేందుకు తెలంగాణ సర్కార్ భారీ ప్లాన్ వేసింది. గ్రామాల వారీగా రైతు మేళాలు, గ్రామసభలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఇక్కడ కేవలం వ్యవసాయ శాఖ అధికారులు మాత్రమే కాకుండా.. భూగర్భ జలాల శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలతో పాటు వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు అందరూ కలిసి ఒకే వేదికపైకి వస్తారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో వీరంతా తిరిగి రైతులకు తగిన సూచనలు అందిస్తారు. ఊళ్లో ఉన్న వాతావరణం, అక్కడ అందుబాటులో ఉన్న నీటి లభ్యత, నేల స్వభావాన్ని బట్టి.. ఏ పంట వేస్తే లాభం వస్తుందో అధికారులే స్వయంగా మార్గనిర్దేశం చేస్తారు. ఈ సలహాలు పాటించడం వల్ల పెట్టుబడి నష్టపోకుండా రైతులు సేఫ్ గా ఉండొచ్చు.
యాసంగిలో నీరు తక్కువగా ఉన్నప్పుడు పంటను కాపాడుకోవడం ఒక ఎత్తైతే, ఉన్న ఆ కొద్దిపాటి నీటిని ఎండకు ఆవిరైపోకుండా ఆపుకోవడం మరో ఎత్తు. దీనికోసం ఆధునిక పద్ధతులను వాడాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. ముఖ్యంగా మల్చింగ్ పద్ధతిని అనుసరించడం చాలా ముఖ్యం. పొలంలో చెత్త, ఎండు గడ్డి , ప్లాస్టిక్ షీట్లను వాడటం వల్ల భూమిలో తేమ చాలా రోజుల పాటు నిలిచి ఉంటుంది. దీనివల్ల రెండు నీటి తడుల మధ్య గ్యాప్ పెంచుకోవచ్చు. అలాగే ప్రతి పొలంలో వ్యవసాయ కుంటలను ఏర్పాటు చేసుకోవాలి. పడిన ప్రతి వర్షపు బొట్టును ఈ కుంటల్లో ఒడిసిపట్టి నిల్వ చేసుకోవడం ద్వారా, కరవు సమయంలో ఆ నీరు పంటలకు ప్రాణం పోస్తుంది. నేలలో తేమను కాపాడుకోవడం, బిందు సేద్యం ద్వారా అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకోవడం కారణంగా వాతావరణ ప్రతికూల ప్రభావాన్ని మనం సగానికి పైగా జయించవచ్చని నివేదిక స్పష్టం చేసింది.



