భారతీయ పత్తికి తిరుగులేని బ్రాండ్ ఇమేజ్..రైతులకు అందనున్న అంతర్జాతీయ స్థాయి ప్రీమియం ధర

భారత్ ప్రపంచ పత్తి ఉత్పత్తిలో ఎప్పటినుంచో అగ్రగామిగా ఉంటోంది. ఇక్కడ పండే పత్తికి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన డిమాండ్ ఉంది. కానీ, దశాబ్దాలుగా మనకు ఒక అతిపెద్ద లోటు ఎక్కడో పుట్టిన ఈజిప్షియన్ కాటన్ కు, అమెరికాలో పండే సుపీమా కాటన్ కు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్న బ్రాండ్ ఇమేజ్, వాళ్ల పత్తికి దొరికే ప్రీమియం ధర.. మన భారతీయ పత్తికి ఎప్పుడూ దక్కలేదు. మన రైతులు ఎంత కష్టపడి నాణ్యమైన పత్తి పండించినా, దానికి ఒక గ్లోబల్ గుర్తింపు లేకపోవడం వల్ల దళారుల చేతిలో మోసపోతూ సాధారణ ధరకే అమ్ముకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ దుస్థితి మారబోతోంది. ఈ సమస్యను శాశ్వతంగా అధిగమించి, భారతీయ పత్తికి అంతర్జాతీయ స్థాయిలో తిరుగులేని బ్రాండ్ ఇమేజ్ను కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక విప్లవానికి శ్రీకారం చుట్టింది. అదే కస్తూరి కాటన్ భారత్.
కస్తూరి కాటన్ అనేది మన రైతులు పండించిన పత్తికి, దాని అద్భుతమైన నాణ్యతను బట్టి కేంద్ర ప్రభుత్వం , అంతర్జాతీయ సంస్థలు కలిసి ఇచ్చే ఒక ప్రీమియం బ్రాండ్, సర్టిఫికేషన్. మరి ఈ సర్టిఫికేషన్ మన పత్తికి రావాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి. సాధారణంగా రైతులు పండించే పొడవైన పింజ కలిగిన పత్తి .. అంటే సుమారు 28 మిల్లీమీటర్ల నుంచి 30 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉన్న నాణ్యమైన పత్తి మాత్రమే ఈ కస్తూరి కాటన్ సర్టిఫికేషన్ కు ఎంపికవుతుంది. రైతులు పత్తిని ఏరే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పత్తిలో ఆకులు, చెత్తాచెదారం, మట్టి లేకుండా స్వచ్ఛంగా, తెల్లగా మెరిసిపోయేలా ఉండాలి. పత్తిలో తేమ శాతం చాలా తక్కువగా ఉండాలి, ఇక వ్యర్థాలు చూసుకుంటే 1.5 శాతం నుంచి 2 శాతం లోపు మాత్రమే ఉండాలి. ఇలాంటి అత్యంత స్వచ్ఛమైన పత్తిని రైతులు మార్కెట్ కి తీసుకొచ్చినప్పుడు, అది జిన్నింగ్ మిల్లులకు చేరిన తర్వాత, NABL గుర్తింపు పొందిన అత్యున్నత స్థాయి ల్యాబ్స్ లో కఠినమైన పరీక్షలు నిర్వహిస్తారు. ఈ టెస్టుల్లో పాస్ అయితేనే ఆ పత్తి బేళ్లకు కస్తూరి కాటన్ భారత్ సర్టిఫికేషన్‌ను ఇస్తారు. ఇలాంటి కస్తూరి కాటన్ తో తయారు చేసిన వస్త్రాలకు విపరీతమైన మృదుత్వం, ఎక్కువ కాలం మన్నిక, సహజమైన కాంతి, అధిక బలం చేకూరుతాయి.



