భారత్-ఇజ్రాయెల్ ను చూసి భయపడుతున్న పాక్ ..అసలు విషయం బయటపెట్టిన ఇరాన్ టాప్ సెక్యూరిటీ ఆఫీసర్

మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల మధ్య అక్టోబర్ 26న ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో.. ఇరాన్, పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలకు చెందిన భద్రతా ప్రతినిధులు ఒక కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి పాకిస్థాన్ తరుఫున ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, టర్కీ తరఫున వాళ్ల ఇంటెలిజెన్స్ చీఫ్ ఇబ్రహీం కలిన్, సౌదీ అరేబియా తరఫున రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్, ఇక ఇరాన్ తరఫున టాప్ భద్రతా అధికారి మొహ్సేన్ రెజాయీ హాజరయ్యారు. ప్రాంతీయ భద్రత, ఇజ్రాయెల్ ముప్పు ఈ మీటింగ్ ప్రధాన అజెండా. అయితే ఇక్కడే ఒక ఊహించని ట్విస్ట్ ఎదురైంది.
అక్టోబర్ 31న ఇరాన్ ప్రభుత్వ టీవీకి ఇచ్చిన ఒక లైవ్ ఇంటర్వ్యూలో మొహ్సేన్ రెజాయీ ఈ సీక్రెట్ సమావేశం గురించి మాట్లాడుతూ పాకిస్థాన్ బాగోతాన్ని లీక్ చేశారు. పాకిస్థాన్, టర్కీ, సౌదీలు ఇజ్రాయెల్ ముప్పుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయని చెబుతూనే.. ముస్లింలకు, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా హిందువులు, యూదుల మధ్య ఏర్పడుతున్న బలమైన సైనిక సంబంధాల గురించి అసిమ్ మునీర్ మీటింగ్ లో పదే పదే ప్రస్తావించారు. ఆ కూటమి మన ఇస్లామిక్ ప్రపంచానికి అతిపెద్ద ముప్పుగా మారుతుందని మునీర్ హెచ్చరించారు అని రెజాయీ బాంబ్ పేల్చారు. ఈ లీక్ తో పాకిస్థాన్ డిఫెన్స్ వర్గాల్లో కలకలం మొదలైంది.
భారత్-ఇజ్రాయెల్ మధ్య సైనిక, రక్షణ, టెక్నాలజీ రంగాల్లో విడదీయరాని భాగస్వామ్యం ఉంది. ముఖ్యంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా ఇరు దేశాలు తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్లాయి. 2025 మే నెలలో ఉగ్రవాదుల ఏరివేత కోసం పాకిస్థాన్ భూభాగంపై భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్ దాడులకు ఇజ్రాయెల్ బహిరంగంగా తన పూర్తి మద్దతు ప్రకటించింది. అంటే ఉగ్రవాదుల మీద ఇండియా ఎటాక్ చేస్తే ఇజ్రాయెల్ అండగా నిలబడుతోంది. అదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒక సంచలన ప్రతిపాదన చేశారు. రాడికల్ షియా, సున్నీ ఉగ్రవాద కూటములను ఈ భూమ్మీద లేకుండా చేయడానికి.. భారత్, ఇజ్రాయెల్, గ్రీస్, సైప్రస్ తదితర దేశాలతో కలిపి హెక్సాగన్ ఆఫ్ అలయెన్సెస్ అనే ఒక పవర్ ఫుల్ గ్లోబల్ కూటమిని ఏర్పాటు చేయాలని ప్రస్తావించారు. ఈ హెక్సాగన్ ప్లాన్, ఆపరేషన్ సిందూర్ దెబ్బలన్నీ చూశాకే పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కు వణుకు పుట్టి.. టెహ్రాన్ మీటింగ్ లో హిందూ-యూదుల కూటమి అంటూ పాత మతం కార్డును బయటికి తీశారు. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ బహిరంగంగానే భారత్, హిందూ వ్యతిరేకతను కనబరుస్తుంటారన్నది తెలిసిందే. హిందువులు, ముస్లింలు మతం, ఆచారాలు, సంప్రదాయాలు, ఆలోచనలు, లక్ష్యాల పరంగా రెండు పూర్తి భిన్నమైన సమూహాలు. వారు ఎప్పటికీ కలిసి ఉండలేరు అని మునీర్ గతంలో తన సైనికుల ముందు పలుమార్లు వ్యాఖ్యానించారు. ఇదే విద్వేషాన్ని 2025 ఏప్రిల్‌లో కాశ్మీర్ లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి కొద్ది రోజుల ముందు కూడా ఆయన ప్రస్తావించడం గమనార్హం. జమ్మూ కాశ్మీర్ పాకిస్థాన్ జీవనాడిగా మునీర్ అభివర్ణించిన కొన్ని రోజులకే, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గామ్ లో దారుణమైన దాడికి తెగబడ్డారు. ఒకవైపు ఉగ్రవాదాన్ని ఇండియాపైకి ఉసిగొల్పుతూ, తీరా ఇండియా-ఇజ్రాయెల్ కలిసి ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతుంటే భరించలేకపోతున్నారు. అందుకే తన ఉగ్రవాద అజెండాకు మతం రంగు పులిమి ఇస్లామిక్ దేశాల సానుభూతి పొందేందుకు మునీర్ టెహ్రాన్ వేదికగా ఈ హిందూ-యూదుల కుట్రలకు తెరతీశారు.ఒకప్పుడు అరబ్ దేశాలు, మిడిల్ ఈస్ట్ దేశాలు కూడా కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్ కే సపోర్ట్ చేసేవి. కానీ ప్రపంచ రాజకీయాలు ఇప్పుడు అలా లేవు. భారత్ ఆర్థికంగా, సైనికంగా ప్రపంచంలోనే ఒక సూపర్ పవర్ గా బలపడిన తర్వాత.. సౌదీ అరేబియా, యూఏఈ లాంటి బడా ఇస్లామిక్ దేశాలు కూడా పాకిస్థాన్ ను దూరం పెట్టి ఇండియాతో స్నేహం చేస్తున్నాయి. దానికి తోడు టెక్నాలజీలో, ఇంటెలిజెన్స్ లో ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న ఇజ్రాయెల్ లాంటి పవర్ ఫుల్ మిత్రదేశం ఇండియాకు అండగా నిలబడటంతో, మునీర్ కు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి హిందూ-యూదు కూటమి అంటూ తన అక్కసును వెళ్లగక్కుతున్నారు.


