యాసంగి రైతు భరోసా..రైతుల ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు పడతాయంటే..?

వ్యవసాయ పెట్టుబడి కోసం ఒకప్పుడు రైతుబంధు పేరుతో, ఇప్పుడు రైతు భరోసా పేరుతో తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోంది. వానాకాలం సీజన్ కు సంబంధించి అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో నిధులు ఎలాగోలా జమ చేశారు. అయితే యాసంగి పనులు మొదలైనా..ఇప్పటివరకు రైతు భరోసా నిధులపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదు. మరో తెలుగు రాష్ట్రమైన ఏపీలో రెండో విడత అన్నదాత సుఖీభవ నిధులను చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసింది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ 24వ విడత కింద 2 వేలు రైతుల ఖాతాల్లో వేసింది. దీంతో తెలంగాణ రైతులు రేవంత్ సర్కార్ ఎప్పుడు డబ్బులు వేస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.
తెలంగాణలో రైతు భరోసా పథకం కింద ప్రతి సంవత్సరం ఎకరాకు 12 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీజన్ కు 6 వేల చొప్పున వానాకాలం, యాసంగికి కలిపి ఈ సాయం అందుతుంది. అయితే ప్రస్తుతం యాసంగి సీజన్ నడుస్తున్నా నిధుల విడుదలకు సంబంధించి ప్రభుత్వం సైలెంట్ గా ఉండటంతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సచివాలయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. నవంబర్ లో కాకుండా డిసెంబర్, లేదా జనవరి మాసాల్లో ఈ యాసంగి రైతు భరోసా నిధులను విడుదల చేసే అవకాశం ఉందని కొందరు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో రైతు భరోసా పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే ప్రభుత్వ ఖజానా నుంచి దాదాపు 9,000 కోట్లు అవసరం అవుతాయి. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. దానికి తోడు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ.. రైతు భరోసా కింద ఎకరాకు ఏకంగా 15 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. కానీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఆ రేంజ్ లో నిధులు తీసుకురావడం అసాధ్యమని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారులు తేల్చి చెబుతున్నట్లు సమాచారం.



