భారత అమ్ములపొదిలో మరో అద్భుత అస్త్రం ‘ప్రళయ్’

గతంలో ఆయుధాల కోసం, టెక్నాలజీ కోసం విదేశాల వైపు చూసిన భారతదేశం.. ఇప్పుడు స్వదేశీ పరిజ్ఞానంతో ప్రపంచ దేశాలే ఆశ్చర్యపోయే స్థాయిలో అత్యంత ప్రమాదకరమైన అస్త్రాలను సొంతంగా తయారుచేసుకుంటోంది. తాజాగా మన డీఆర్డీఓ మరో అద్భుతమైన మిస్సైల్ ను అభివృద్ధి చేసింది. ఆ మిస్సైల్ పేరే ప్రళయ్.పేరుకు తగ్గట్లే శత్రువుల శిబిరాలపై ప్రళయం సృష్టించడానికి ఈ సర్ఫేస్-టు-సర్ఫేస్ క్షిపణి రెడీ అయింది. తాజాగా ఒడిశా తీరంలో డీఆర్డీఓ నిర్వహించిన ఈ ప్రళయ్ క్షిపణి పరీక్ష నూటికి నూరు శాతం విజయవంతం అయింది. ఈ షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రళయ్ ప్రయోగం ఒడిశా తీరం నుంచి గురువారం ఉదయం సరిగ్గా 11 గంటల 10 నిమిషాలకు జరిగింది. యూజర్ ఎవాల్యుయేషన్ ట్రయల్స్ లో భాగంగా నిర్వహించిన ఈ పరీక్ష అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. నిర్దేశిత టార్గెట్ ను ఈ మిస్సైల్ అత్యంత కచ్చితత్వంతో ఛేదించిందని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా ట్విట్టర్ వేదికగా డీఆర్డీఓ సైంటిస్టులకు, ఇండియన్ ఆర్మీకి ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ ప్రళయ్ మిస్సైల్ అనేది సాలిడ్-ప్రొపెల్లెంట్ తో పనిచేసే ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి. దీని పరిధి పేలోడ్ బరువును బట్టి 150 నుంచి 500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంటే ఏకంగా 1,000 కిలోల భారీ బరువున్న మందుగుండు సామగ్రిని మోసుకుంటూ 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు స్థావరాలను భూస్థాపితం చేయగలదు. అదే పేలోడ్ బరువును 500 కిలోలకు తగ్గిస్తే, దీని రేంజ్ ఏకంగా 500 కిలోమీటర్లకు పెరుగుతుంది. మన సరిహద్దుల్లో మోహరించి ఉన్న శత్రువుల బంకర్లు, ఆయుధ డిపోలు, లాంచ్ ప్యాడ్స్ ను తుడిచిపెట్టడానికి ఈ రేంజ్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇందులో ఉన్న క్వాసీ-బాలిస్టిక్ టెక్నాలజీ ప్రత్యేకమైనది. ఈ మిస్సైల్ క్వాసీ-బాలిస్టిక్ ట్రాజెక్టరీని ఫాలో అవుతుంది. అంటే గాల్లోకి వెళ్లాక ఒకే రూట్ లో కాకుండా, తన మార్గాన్ని మధ్యలోనే మార్చుకుని శత్రువులను కన్ఫ్యూజ్ చేస్తుంది. దీనివల్ల శత్రు దేశాల రాడార్లు గానీ, పాకిస్థాన్, చైనాల దగ్గర ఉన్న అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ గానీ ఈ మిస్సైల్ ను గాల్లోనే అడ్డుకోవడం దాదాపు అసాధ్యం. దానికి తోడు ఇందులో అడ్వాన్స్డ్ గైడెన్స్ , నావిగేషన్ సిస్టమ్స్ ఉండటం వల్ల, కచ్చితత్వంతో శత్రువుల గుండెకాయ లాంటి టార్గెట్స్ ను ఇది ముక్కలు చేయగలదు. యుద్ధ సమయంలో మిస్సైల్స్ ను ప్రయోగించడానికి ఫిక్స్డ్ లాంచ్ ప్యాడ్స్ ఉంటే, శత్రువులు వాటిని ఈజీగా అటాక్ చేస్తారు. అందుకే ఈ ప్రళయ్ క్షిపణిని మొబైల్ లాంచర్ ద్వారా ప్రయోగించేలా డీఆర్డీఓ డిజైన్ చేసింది. ఎక్కడి నుంచైనా దీని ద్వారా శత్రువులపై ఎటాక్ చేయొచ్చు. ఈ ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీ వల్ల చైనా సరిహద్దుల్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ , అలాగే పాకిస్థాన్ బోర్డర్ లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి దీన్ని చాలా సులభంగా డిప్లాయ్ చేయవచ్చు. ఇక ఇది సాలిడ్-ఫ్యూయల్ ప్రొపల్షన్ తో పనిచేస్తుంది కాబట్టి, లిక్విడ్ ఫ్యూయల్ లాగా యుద్ధానికి ముందు ఫ్యూయల్ నింపాల్సిన పనిలేదు. కమాండ్ ఇవ్వగానే కేవలం నిమిషాల వ్యవధిలోనే ఇది యాక్టివేట్ అయిపోయి దూసుకుపోతుంది. ఒకే మిస్సైల్ ద్వారా రకరకాల వార్ హెడ్స్ ని ప్రయోగించే సామర్థ్యం దీనికి ఉండటం ఇండియన్ ఆర్మీకి అతిపెద్ద అడ్వాంటేజ్. శత్రువుల కీలక స్థావరాలను అత్యంత వేగంగా నాశనం చేయడానికి ఈ ప్రళయ్ క్షిపణి ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో మన సైంటిస్టులు సాధిస్తున్న ఈ విజయాలు ప్రతి భారతీయుడికి గర్వకారణంగా నిలుస్తున్నాయి.



