మేడ్ ఇన్ ఇండియా !బుల్లెట్ రైలు ఫస్ట్ లుక్స్...ఫీచర్స్, లగ్జరీ నెక్స్ట్ లెవెల్

భారతదేశ సుదీర్ఘ ఎదురుచూపులకు తెరదించుతూ కీలక ప్రాజెక్ట్ అయిన బుల్లెట్ రైలు కోసం రైల్వేశాఖ పగలూ రాత్రీ శ్రమిస్తోంది. దీన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా.. స్వదేశీ సాంకేతికతతో స్థానికంగానే అభివృద్ధి చేస్తుండటం అతిపెద్ద విశేషం. ఇందుకు సంబంధించిన పనులు కర్ణాటకలోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ కేంద్రంలో అత్యంత శరవేగంగా కొనసాగుతున్నాయి. అధునాతన ఇంజినీరింగ్ వ్యవస్థతో, మన స్వదేశీ నైపుణ్యంతో భారత్‌లోని వాతావరణ, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఈ బుల్లెట్ రైలును రూపొందిస్తున్నారు. తాజాగా ఈ BEML కేంద్రాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా పరిశీలించారు. ప్రతి ఫేజ్ ను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఈ బుల్లెట్ రైలును రూపొందించామని ఆయన స్పష్టం చేశారు. రైలు ఎంత స్పీడ్ గా వెళ్లినా ప్యాసింజర్లకు ఎలాంటి కుదుపులు, ప్రమాదాలు లేకుండా ఉండేందుకు అత్యంత కఠినమైన స్క్వీజ్ టెస్టు సైతం నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని టెస్టులు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుని, వచ్చే ఏడాది ముంబయి-అహ్మదాబాద్ మధ్య తొలి బుల్లెట్ రైలు ప్రారంభం కానుందని ఆయన గుడ్ న్యూస్ చెప్పారు. అసలు ఈ బుల్లెట్ రైలు స్పెసిఫికేషన్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ రైలు గరిష్ఠ పరీక్ష వేగం గంటకు 280 కిలోమీటర్లు ఉంటుంది. అయితే సాధారణ ప్రయాణ వేగం మాత్రం గంటకు 249 కిలోమీటర్లుగా ఫిక్స్ చేశారు. రైలు మొత్తం పొడవు 202 మీటర్లు ఉంటుంది. ఇందులో మొత్తం 8 కోచ్‌లు ఉంటాయి. భవిష్యత్తులో ప్రయాణికుల రద్దీ పెరిగితే, రెండు రైళ్లను కలిపి ఏకంగా 16 కోచ్‌ల రైలుగా మార్చేలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఏర్పాట్లు చేశారు. ఈ బుల్లెట్ రైలులో ఒకేసారి 557 మంది ప్రయాణించవచ్చు. అందులో ఏడు సాధారణ కోచ్‌లలో ఒక వరుసకు ఐదు సీట్లు ఉండగా.. బిజినెస్ క్లాస్ ప్రయాణికుల కోసం ఉండే మరో ఎగ్జిక్యూటివ్ కోచ్‌లో మాత్రం 2x2 సీటింగ్ ఉంటుంది. విశేషం ఏంటంటే.. ఈ రైలుకు రెండు వైపులా డ్రైవర్ క్యాబిన్ ఉంటుంది. మెయిన్ కంట్రోల్ సెంటర్ తో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ.. మిల్లీ సెకన్ల వ్యవధిలో సత్వర నిర్ణయాలు తీసుకునేలా దీనిలో ఇంటెలిజెంట్ ఆన్‌బోర్డు కంట్రోల్ సిస్టమ్ ను అమర్చారు. అంటే రైలు దాదాపు తనంతట తానే సిగ్నల్స్ ను క్యాచ్ చేస్తూ, సురక్షితంగా ప్రయాణిస్తుంది.



