మొజ్తబా ఖమేనీ ఎక్కడ? ఇరాన్ క్లారిటీ ఇదే!

మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు మొదలై ఎనిమిది నెలలు గడుస్తున్నా..పరిస్థితులు ఏమాత్రం సద్దుమణగడం లేదు. ప్రతిరోజూ దాడులు, ప్రతిదాడులతో ఈ ప్రాంతం అట్టుడుకుతోంది. అయితే యుద్ధం సంగతి పక్కనపెడితే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యంత హాట్ టాపిక్‌గా మారిన అంశం.. ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యం. ఆయన అసలు ప్రాణాలతో ఉన్నారా? అమెరికా దళాలు చేసిన దాడుల్లో మరణించారా? అంటూ సోషల్ మీడియాలో, అంతర్జాతీయ మీడియాల్లో పెద్ద ఎత్తున పుకార్లు చెలరేగాయి. గత కొంతకాలంగా మోజ్తాబా ఖమేనీ బహిరంగంగా ఎక్కడా కనిపించకపోవడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది.ఈ తీవ్రమైన ఉత్కంఠ నడుమ, మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఇరాన్‌కు చెందిన సీనియర్ దౌత్యవేత్త అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ సంచలన విషయాలను వెల్లడించారు.
దాదాపు ఎనిమిది నెలల క్రితం ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా వైమానిక దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ దాడిలోనే ఫిబ్రవరి 28న అప్పటి సుప్రీం లీడర్, మొజ్తబా తండ్రి అయిన అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఈ దాడిలో మొజ్తబా కూడా తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వచ్చాయి. తండ్రి మరణానంతరం అత్యున్నత నేతగా బాధ్యతలు చేపట్టినప్పటికీ, ఆయన ఒక్కసారి కూడా బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. కేవలం రాతపూర్వక ప్రకటనల ద్వారానే తన మెసేజ్ ను పంపిస్తున్నారు. జులైలో జరిగిన తండ్రి అంత్యక్రియలకు కూడా ఆయన గైర్హాజరు కావడం, ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనలకు, భద్రతాపరమైన భయాలకు దారితీసింది. దీంతో మొజ్తబా ఖమేనీ ఎక్కడ? బతికే ఉన్నాడా?అనే పుకార్లు వ్యాపించాయి. యుద్ధ సమయంలో శత్రు దేశం నాయకుడిపై తప్పుడు వార్తలు పుట్టించడం అనేది ఒక సైకలాజికల్ వార్ఫేర్. మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై కూడా సరిగ్గా ఇలాంటి వార్తలే స్ప్రెడ్ అయ్యాయి. ఆయన ఆరోగ్యం క్షీణించిందని, కొందరైతే ఏకంగా అమెరికా దాడుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారని ప్రచారం చేశారు. ఈ ప్రచారానికి చెక్ పెడుతూ ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి, అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యం చాలా బాగుంది. ఆయన ఎంతో చురుగ్గా పనిచేస్తున్నారు. ఆయనపై వస్తున్న వార్తలన్నీ పూర్తిగా నిరాధారమైనవి అని ఆయన స్పష్టం చేశారు. మొజ్తబా ఖమేనీని నేరుగా కలిసిన తన స్నేహితులు, సన్నిహితులు కూడా ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారని, దేశ భద్రతకు సంబంధించిన విధులను అత్యంత పకడ్బందీగా, చక్కగా నిర్వహిస్తున్నారని తనకు హామీ ఇచ్చారని ఇలాహీ వెల్లడించారు. భద్రతాపరమైన ముప్పు పొంచి ఉండటం వల్లే సుప్రీం లీడర్ కదలికలను అత్యంత రహస్యంగా ఉంచామని దౌత్యవేత్త స్పష్టం చేశారు. మోజ్తాబా ఖమేనీ విధులకు దూరంగా ఉన్నారన్న వాదనలను కొట్టిపారేస్తూ.. దౌత్యవేత్త ఇలాహీ ఒక కీలక విషయాన్ని బయటపెట్టారు. గత వారమే సుప్రీం లీడర్ మోజ్తాబా, ఇరాన్ అధ్యక్షుడితో ఏకంగా ఏడు గంటల పాటు సుదీర్ఘ సమావేశం నిర్వహించారని తెలిపారు. అలాగే ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ కూడా మోజ్తాబా ఖమేనీని కలిసి పలు కీలక అంశాలపై చర్చించారని, రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత స్థాయి సమావేశాలు జరగనున్నాయని స్పష్టం చేశారు. ఇక అత్యంత వివాదాస్పదమైన మరో అంశం.. తన తండ్రి అలీ ఖమేనీ అంత్యక్రియలకు మోజ్తాబా హాజరు కాలేదనే ప్రచారం. దీనిపై స్పందించిన ఇలాహీ.. ఆ వార్తలను పూర్తిగా ఖండించారు. అంత్యక్రియల సమయంలో నేను ఇరాన్‌లోనే ఉన్నాను. ఆయన ఇద్దరు సోదరులను కలిశాను. మొజ్తబా ఖమేనీ కూడా అక్కడే ఉన్నారు. కేవలం భద్రతాపరమైన పరిస్థితులు, ప్రోటోకాల్స్ దృష్ట్యా ఆయన మీడియా ముందుకు రాలేదు. అందుకే ఎవరూ ఆయనను బహిరంగంగా చూడలేకపోయారు తప్పితే, అంత్యక్రియల్లో పాల్గొనలేదనడం ముమ్మాటికీ అవాస్తవం అని ఆయన క్లారిటీ ఇచ్చారు.



