లక్షలు కురిపించే కొత్త రకం వ్యవసాయం!
సాగు భూమి తగ్గిపోతోంది. రేపటి తరాలకు కడుపు నిండా స్వచ్ఛమైన ఆహారం దొరకాలంటే, పాత పద్ధతులకు ఆధునిక సాంకేతికతను జోడించక తప్పదు. హైడ్రోపోనిక్స్ను మించిన మరో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏరోపోనిక్స్.

కాలం మారుతోంది. వ్యవసాయం తన రూపును క్రమంగా మార్చుకుంటోంది. ఒకప్పుడు దుక్కి దున్నితేనే పంట.. కానీ ఇప్పుడు ఆ మట్టితోనే పనిలేదు. నాగేలి పట్టాల్సిన అవసరమే లేదు. ఎకరాల కొద్దీ పొలం అక్కర్లేదు. నీటి వృథా లేదు. కలుపు తీసే పనే లేదు.. అయినా కూడా పచ్చని పంటలు పండుతున్నాయి. రాబోయే తరాలకు అన్నం పెట్టే ఆశాకిరణంగా మారుతున్న ఈ అత్యాధునిక వ్యవసాయమే.. సాయిల్ లెస్ ఫార్మింగ్ . ఏంటి? మట్టి లేకుండా మొక్క ఎలా పెరుగుతుంది? గాలిలో వేర్లు ఉంటే పంట ఎలా పండుతుంది?
ఎల్ నినో వంటి పరిస్థితులు రైతును కుంగదీస్తున్న ఈ తరుణంలో తక్కువ నీటితో, చీడపీడల బెడద లేకుండా లాభదాయకమైన దిగుబడి అందించే అద్భుతమైన టెక్నాలజీ ఇది.
సైన్స్ ప్రకారం చూస్తే... ఒక మొక్క పెరగడానికి కావాల్సింది సూర్యరశ్మి, గాలి, నీరు, పోషకాలు. భూమిలో ఉన్న మట్టి మొక్కకు ఒక ఆధారాన్ని మాత్రమే ఇస్తుంది తప్ప, మట్టిలో ఉండే పోషకాలను, నీటినే వేర్లు పీల్చుకుంటాయి. అదే పోషకాలను, నీటిని మనం నేరుగా మొక్క వేర్లకు అందిస్తే? మట్టితో పనేముంది? సరిగ్గా ఈ కాన్సెప్ట్ మీద పుట్టిందే హైడ్రోపోనిక్స్. ఈ విధానంలో పీవీసీ పైపుల ద్వారా నిరంతరం నీరు ప్రవహించేలా చేస్తారు. ఆ పైపుల మీద రంధ్రాలు చేసి, చిన్న కప్పుల్లో కోకోపిట్ లాంటివి ఉంచి మొక్కలను పెంచుతారు. ఆ మొక్కల వేర్లు నేరుగా నీటిలోకి వెళ్తాయి. మొక్క పెరగడానికి కావాల్సిన నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ లాంటి పోషకాలను ద్రవరూపంలో ఆ నీటిలోనే కలుపుతారు. ఇంకేముంది.. మట్టిలో పండేదానికంటే రెండు మూడు రెట్లు వేగంగా, ఏపుగా పంట పండుతుంది.
హైడ్రోపోనిక్స్ను మించిన మరో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏరోపోనిక్స్. ఇందులో అయితే నీరు ప్రవహించాల్సిన అవసరం కూడా లేదు. మొక్కల వేర్లు గాలిలోనే వేలాడుతుంటాయి. ఒక చిన్న మోటార్ సాయంతో, పోషకాలతో కూడిన నీటిని ఒక మంచు తుంపరలాగా
సెకన్ల వ్యవధిలో వేర్ల మీద స్ప్రే చేస్తారు. దీనివల్ల వేర్లకు పుష్కలంగా ఆక్సిజన్ అందుతుంది, పంట దిగుబడి ఆకాశాన్ని తాకుతుంది. మరోవైపు ఆక్వాపోనిక్స్.. ఇదొక టూ ఇన్ వన్ వ్యవసాయం. కింద చేపల పెంపకం, పైన కూరగాయల పెంపకం. చేపల వ్యర్థాలతో కూడిన నీటిలో అమ్మోనియా, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆ నీటినే పైనున్న మొక్కలకు పంపుతారు. మొక్కల వేర్లు ఆ పోషకాలను పీల్చుకుని, నీటిని శుద్ధి చేసి మళ్లీ కింద ఉన్న చేపల ట్యాంకులోకి పంపుతాయి. అంటే అటు చేపలు, ఇటు కూరగాయలు... రెండూ ఒకేసారి పండుతాయన్నమాట!
చాలామంది సిటీ వాసులకు వ్యవసాయం చేయాలని, స్వచ్ఛమైన కూరగాయలు తినాలని ఆశ ఉంటుంది. కానీ స్థలం ఎక్కడుంది? ఆ సమస్యకు పరిష్కారమే వర్టికల్ ఫార్మింగ్ . అడ్డంగా ఎకరాల్లో సాగు చేసే బదులు, నిలువుగా అరలు అరలుగా సాగు చేయడం. మీ ఇంట్లో వంద గజాల డాబా ఉంటే చాలు.. అందులో నాలుగంతస్తుల ర్యాక్స్ వేస్తే, అది ఎకరం పొలంతో సమానం. మరీ అడ్వాన్స్డ్ దేశాల్లో అయితే, సూర్యరశ్మి కూడా అవసరం లేకుండా... ఇండోర్ లో ఆర్టిఫిషియల్ ఎల్ఈడీ లైట్ల కింద అద్భుతంగా పంటలు పండిస్తున్నారు. వాతావరణంతో సంబంధం లేదు.. బయట మైనస్ డిగ్రీల చలి ఉన్నా, 45 డిగ్రీల ఎండలు మండిపోతున్నా... ఏసీ గదుల్లో 365 రోజులూ ఎంచక్కా పచ్చని పంటలు పండించుకోవచ్చు.
ఈ అత్యాధునిక వ్యవసాయంలో లాభాలు ఎలా ఉంటాయంటే... మామూలు వ్యవసాయంతో పోలిస్తే 90 శాతం నీరు ఆదా అవుతుంది. కేవలం 10 శాతం నీటితోనే అద్భుతాలు చేయొచ్చు. కలుపు మొక్కల బెడద అస్సలు ఉండదు, రసాయనిక ఎరువులు, పురుగుల మందులు కొట్టాల్సిన పనే లేదు. కాబట్టి ఈ పంటలు వంద శాతం సురక్షితం. హైడ్రోపోనిక్స్ పద్ధతిలో సాధారణంగా లెట్యూస్ , చెర్రీ టమాటోలు, బ్రోకలీ, కలర్ క్యాప్సికం , స్ట్రాబెర్రీ లాంటి విదేశీ పంటలను ఎక్కువగా పండిస్తారు. మార్కెట్లో వీటికి భారీ డిమాండ్ ఉంది. స్టార్ హోటళ్లు, సూపర్ మార్కెట్లలో వీటికి విపరీతమైన ధర పలుకుతుంది. ప్రారంభంలో సెటప్ చేసుకోవడానికి పెట్టుబడి కాస్త ఎక్కువైనా.. ఒక్కసారి గ్రీన్ హౌస్, పైపుల సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటే, ఆ తర్వాత వచ్చే ఆదాయం లక్షల్లోనే ఉంటుంది. అందుకే చదువుకున్న యువత, సాఫ్ట్వేర్ ఉద్యోగులు సైతం ఉద్యోగాలు వదిలేసి మరీ ఈ సాయిల్ లెస్ ఫార్మింగ్ వైపు అడుగులు వేస్తున్నారు.
ప్రపంచ జనాభా నానాటికీ పెరిగిపోతోంది.. సాగు భూమి తగ్గిపోతోంది. రేపటి తరాలకు కడుపు నిండా స్వచ్ఛమైన ఆహారం దొరకాలంటే, పాత పద్ధతులకు ఆధునిక సాంకేతికతను జోడించక తప్పదు. సాయిల్ లెస్ ఫార్మింగ్ అనేది రాబోయే కాలానికి ఒక నమ్మకమైన ఆయుధం. వ్యవసాయం అంటే ఇకపై కష్టం కాదు.. ఇదొక స్మార్ట్ బిజినెస్! .


