లేడీ సూపర్ స్టార్ నయనతార రేంజ్ అంటే ఇది కదా!

సినిమాను మన ప్రేక్షకులు ఎంతలా ఇష్టపడతారో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే థియేటర్ల ముందు పండుగ వాతావరణం నెలకొంటుంది. 50, 60 అడుగుల ఆకాశమంత భారీ కటౌట్లు పెట్టి, పూలమాలలు వేసి, పాలాభిషేకాలు చేయడం జరుగుతూ ఉంది. అయితే దశాబ్దాలుగా మనం ఇది హీరోల విషయంలోనే చూస్తూ ఉన్నాం. అయితే తొలిసారిగా హీరోలకు మాత్రమే పరిమితమైన ఆ 60 అడుగుల కటౌట్ కల్చర్ ను బద్దలు కొడుతూ.. ఒక హీరోయిన్ కోసం ఏకంగా 60 అడుగుల భారీ కటౌట్ వెలిసింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు, సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార. ఇండస్ట్రీలో ఎవరూ ఊహించని ఈ సీన్ చూసి తోటి హీరోయిన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. హీరోయిన్ రెజీనా ఈ కటౌట్ చూసి పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
ప్రస్తుతం ఆమె మెయిన్ రోల్ చేస్తున్న తాజా సినిమా మూకుత్తి అమ్మన్ 2. గతంలో వచ్చిన మూకుత్తి అమ్మన్ .. తెలుగులో అమ్మోరు తల్లి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా ఈ మూకుత్తి అమ్మన్ 2 అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగానే తమిళనాడులో నయనతారకు ఈ 60 అడుగుల భారీ కటౌట్ కట్టారు. ఈ కటౌట్ ఇప్పుడు అందరి దృష్టినీ విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇప్పటివరకు సౌత్ సినీ చరిత్రలో ఏ హీరోయిన్‌కు కూడా ఈ స్థాయిలో, ఇంత ఎత్తులో కటౌట్ పడకపోవడంతో నయన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సోషల్ మీడియాలో ఈ కటౌట్ ఫొటోలు, వీడియోలే ట్రెండ్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ ఎదుగుతుంటే మరో హీరోయిన్ ఓపెన్ గా సపోర్ట్ చేయడం, మెచ్చుకోవడం చాలా అరుదుగా చూస్తుంటాం. కానీ నయనతార కటౌట్ విషయంలో నటి రెజీనా స్పందించిన తీరు అందరి మనసులను గెలుచుకుంటోంది. ఈ 60 అడుగుల కటౌట్ ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ రెజీనా చాలా ఎమోషనల్‌గా రాసుకొచ్చింది. సౌత్ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ కోసం ఇంత పెద్ద కటౌట్ కట్టడం బహుశా చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు. నిజంగా ఇదొక సంచలనం, ఇదొక చరిత్ర. నయనతార పట్టుదలకు, కష్టానికి ఇది నిలువెత్తు నిదర్శనం అంటూ నయన్‌ను ఆమె మనస్ఫూర్తిగా అభినందించింది. నయనతార అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ అంటే ఆ మాత్రం ఉండాలని అంటూ కాలర్ ఎగరేస్తున్నారు. నిజంగా ఆమెకు ఉన్న మాస్ ఫాలోయింగ్ కి ఇలాంటి కటౌట్స్ ఎప్పుడో పడాల్సింది అని కామెంట్స్ చేస్తున్నారు. కానీ, నెటిజన్లలో మరో వర్గం మాత్రం భిన్నమైన వాదనను తెరపైకి తెస్తోంది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 60 అడుగుల కటౌట్‌ను నిజంగా అభిమానులు పెట్టారా? లేక సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికి ప్రొడక్షన్ యూనిట్ వాళ్లే కావాలని ప్రమోషనల్ స్టంట్ లో భాగంగా పెట్టించారా? అంటూ లాజికల్ గా ప్రశ్నిస్తున్నారు. గతంలో హీరోల సినిమాలకు కూడా పీఆర్ ఏజెన్సీలే డబ్బులు ఇచ్చి ఇలాంటి కటౌట్స్ కట్టించిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. అయితే ఆ కటౌట్ పెట్టింది ఫ్యాన్స్ అయినా, సినిమా యూనిట్ అయినా సరే.. ఒక హీరోయిన్ కోసం ఇంత పెద్ద కటౌట్ కట్టాలన్న ఆలోచన రావడమే గొప్ప విషయం. ఏదేమైనా హీరోల సెంట్రిక్‌గా సాగే మన సినిమా ఇండస్ట్రీలో, నయనతార ఈ 60 అడుగుల కటౌట్‌తో తన సోలో క్రేజ్ ఏంటో, తన మార్కెట్ స్టామినా ఏంటో మరోసారి బాక్సాఫీస్‌కు రుచి చూపించారని సినీ విశ్లేషకులు సైతం అంగీకరిస్తున్నారు.



