వార్ కు ఎండ్ కార్డు… అబుదాబి వేదికగా ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలు..రంగంలోకి అమెరికా!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా మరో కీలకమైన, చారిత్రాత్మక దౌత్య ప్రయత్నానికి సిద్ధమైంది. ఇరు దేశాల మధ్య శాంతి దిశగా చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు ఏకంగా అమెరికానే స్వయంగా మధ్యవర్తిత్వం వహించనున్నట్లు అఫీషియల్ గా ప్రకటించింది. అబుదాబి వేదికగా ఉక్రెయిన్, రష్యా ప్రతినిధుల మధ్య కీలకమైన శాంతి చర్చలు జరగబోతున్నాయి. గత మూడేళ్లుగా మండుతున్న యుద్ధ భూమిలో ఇప్పుడు శాంతి పవనాలు వీస్తున్నాయి. నవంబర్ 10, 11 తేదీల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో జరగనున్న శాంతి చర్చలకు అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తుందని అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ ట్విట్టర్ వేదికగా ప్రపంచానికి వెల్లడించారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా నాలుగు అంశాలపై ఫోకస్ చేయనున్నారు. యుద్ధానంతర భద్రతా ఏర్పాట్లు, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే చర్యలు, మానవతా సహాయం, శాంతి ఒప్పందం దిశగా తీసుకోవాల్సిన తదుపరి కచ్చితమైన నిర్ణయాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అజెండాలో భాగంగానే ఈ శాంతి సమావేశాలు అత్యంత వేగంగా జరుగుతున్నట్లు విట్ కాఫ్ వివరించారు.
దీనికి సమాంతరంగా అమెరికా, ఐరోపా దేశాలతోనూ పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తోంది. ఈ వారంలోనే బ్రస్సెల్స్ లో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, యూరోపియన్ యూనియన్, నాటో ప్రతినిధులతో అమెరికా ప్రత్యేకంగా చర్చలు జరపనుంది. ఒకవేళ యుద్ధం ముగిస్తే భవిష్యత్తులో ఉక్రెయిన్‌కు రష్యా నుంచి మళ్లీ ముప్పు రాకుండా ఎలాంటి భద్రతా హామీలు కల్పించాలి? తీవ్రంగా దెబ్బతిన్న ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థను మళ్లీ నిలబెట్టడానికి ఏ దేశం ఎంత ఫండ్ ఇవ్వాలి అన్న విషయాలపై నాటో దేశాలతో అమెరికా చర్చించబోతోంది. గతంలో కీవ్, ఓస్లో, సెయింట్ పీటర్స్బర్గ్లలో జరిగిన సంప్రదింపుల ద్వారా వచ్చిన పురోగతి ఆధారంగానే ఈ శాంతి ఒప్పందాన్ని ఫైనలైజ్ చేయాలని వాషింగ్టన్ భావిస్తోంది.అయితే దౌత్యపరంగా శాంతి చర్చలు ఎంత జరుగుతున్నా సరే, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు ఎక్కడా చక్కబడలేదు. అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ బాంబుల వర్షం కురిపించుకుంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రపంచానికి ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అబుదాబిలో శాంతి చర్చలు జరుగుతున్నాయన్న పేరుతో రష్యా ఒక భయంకరమైన దాడికి స్కెచ్ వేస్తోందని ఆయన నిఘా వర్గాల రిపోర్ట్ ను బయటపెట్టారు. అమెరికాలో ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రపంచం మొత్తం ఫోకస్ అమెరికా రాజకీయాలపైనే ఉంటుంది. సరిగ్గా ఇదే గ్యాప్ లో, అంతర్జాతీయ దృష్టి తమపై ఉండదు కాబట్టి, ఉక్రెయిన్ పై విరుచుకుపడాలని రష్యా ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా చలికాలం వస్తున్నందున ఉక్రెయిన్ లోని విద్యుత్ వ్యవస్థలు, ఇంధన కేంద్రాలు , రవాణా మార్గాలపై భారీ దాడులు జరిగితే సాధారణ ప్రజల జీవనం పూర్తిగా స్తంభించిపోతుందని జెలెన్ స్కీ ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా ఎత్తుగడలను నమ్మలేమని ఆయన పరోక్షంగా అమెరికాకు హింట్ ఇస్తున్నారు.


