ముఖ్య కంటెంట్‌కు వెళ్లడానికి
Mega9 TVMega9 TV📰
బ్రేకింగ్ న్యూస్

శత్రు డ్రోన్లను సింహస్వప్నం…భారత అమ్ములపొదిలో మరో కీలక అస్త్రం భార్గవాస్త్ర..!

Mega9 TV Adminప్రచురణ: 28 నవంబర్, 2026 05:45 AMకి👁 03 నిమి చదవండి
షేర్ చేయండి:
శత్రు డ్రోన్లను సింహస్వప్నం…భారత అమ్ములపొదిలో మరో కీలక అస్త్రం భార్గవాస్త్ర..!
FONT SIZE

ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైన్యాలను సైతం ముప్పుతిప్పలు పెడుతున్న అతిపెద్ద సవాల్ యుద్దానికి వాడుతున్నడ్రోన్లు. తేనెటీగల గుంపులా ఆకాశం నుంచి ఒక్కసారిగా, పరస్పరం సమన్వయంతో వ్యవహరిస్తూ మూకదాడి చేసే శత్రు డ్రోన్లు ఆధునిక యుద్ధరంగంలో పెను ముప్పుగా మారాయి. తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ చిన్నపాటి డ్రోన్లు, గుంపులుగా వచ్చి భారీ రాడార్లను, సైనిక స్థావరాలను, కీలక మౌలిక సదుపాయాలను క్షణాల్లో ధ్వంసం చేయగలవు. ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగానికి ఇప్పుడిదొక పెద్ద సవాలుగా మారింది. సరిగ్గా ఇలాంటి కీలక సమయంలో.. శత్రు మూకడ్రోన్ల పాలిట సింహస్వప్నంగా నిలిచే ఒక అద్భుతమైన, శక్తివంతమైన అస్త్రాన్ని భారతదేశం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో సిద్ధం చేసింది. భారత్ కు చెందిన సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ భార్గవాస్త్ర డ్రోన్ విధ్వంసక వ్యవస్థను అభివృద్ధి చేసింది. డ్రోన్ దాడుల ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని బలోపేతం చేసుకునే దిశగా ఇదొక అత్యంత కీలకమైన ముందడుగు. భార్గవాస్త్ర లో ఉన్న మొదటి అతిపెద్ద ప్రత్యేకత దీని మొబిలిటీ, అంటే ఎక్కడికైనా సులభంగా తరలించగల సౌలభ్యం. అలాగే దీని రెండంచెల డ్రోన్ విధ్వంసక సామర్థ్యం. ఇందులో కేవలం ఒకే రకం ఆయుధం కాదు, రెండు వేర్వేరు స్థాయిల్లో శత్రువును దెబ్బతీసే శక్తివంతమైన ఆయుధాలు ఉంటాయి. అవే.. అన్‌గైడెడ్ రాకెట్లు , అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగల మైక్రో మిసైల్స్. శత్రువు ఒకేసారి గుంపులు గుంపులుగా మూకడ్రోన్లను ప్రయోగించినప్పుడు, ఒక్కో డ్రోన్‌ను వేరువేరుగా ఖరీదైన క్షిపణులతో కూల్చడం ఆచరణలో కష్టం. అలాంటి సందర్భాల్లో అన్‌గైడెడ్ రాకెట్లు శత్రు డ్రోన్ల సమూహాన్ని సమర్థవంతంగా చెదరగొట్టి ధ్వంసం చేయడానికి ఉపయోగపడతాయి. ఇక ఆ దాడి నుంచి తప్పించుకుని ముందుకు దూసుకొచ్చే అత్యంత ప్రమాదకరమైన, వేగవంతమైన డ్రోన్లను, కీలక లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించే మైక్రో మిసైల్స్ వేటాడి ఆకాశంలోనే పేల్చేస్తాయి. దీని సత్తా కేవలం సాధారణ చిన్న డ్రోన్లకే పరిమితం కాదు. ఏకకాలంలో అనేక లక్ష్యాలను ఒకేసారి ఛేదించగల అద్భుత సామర్థ్యం భార్గవాస్త్ర సొంతం. సాధారణ నిఘా డ్రోన్లతో పాటు, ఆయుధాలు ప్రయోగించగల మానవరహిత విమానాలు, అంటే ఆర్మడ్ యూఏవీలను, అలాగే లక్ష్యాన్ని వెతుక్కుంటూ వచ్చి నేరుగా ఢీకొట్టి పేలిపోయే అత్యంత ప్రమాదకరమైన లాయిటరింగ్ మ్యునిషన్లను కూడా భార్గవాస్త్ర అత్యంత సునాయాసంగా నేలకూల్చగలదు.

నేడు శత్రు దేశాలు కమ్యూనికేషన్ లింక్‌లను విచ్ఛిన్నం చేసినా సొంతంగా పనిచేయగల స్వయంప్రతిపత్తి డ్రోన్లను తయారు చేస్తున్నాయి. వాటికి బయటి నుంచి సిగ్నల్స్ అవసరం ఉండదు కాబట్టి, జామింగ్ చేసే సాధారణ యాంటీ-డ్రోన్ వ్యవస్థల ముందు అవి ఆగవు.. నేరుగా తమ లక్ష్యాన్ని ఢీకొట్టేస్తాయి. సరిగ్గా ఈ లోపాన్ని పూర్తిగా అధిగమిస్తూ భార్గవాస్త్ర నేరుగా హార్డ్‌కిల్ విధానాన్ని అనుసరిస్తుంది. అంటే.. కమ్యూనికేషన్ సంకేతాలను, నేవిగేషన్ వ్యవస్థలను అడ్డుకోవడం లాంటి పరోక్ష విధానాలపై ఆధారపడకుండా, శత్రు డ్రోన్‌ను భౌతికంగా నేరుగా ఆకాశంలోనే కూల్చివేస్తుంది. భార్గవాస్త్రలో ఉండే శక్తివంతమైన రాడార్.. ఏకంగా పది కిలోమీటర్ల పరిధి వరకూ శత్రు డ్రోన్ల జాడను ముందుగానే గుర్తించగలదు. కేవలం రాడార్ మాత్రమే కాదు.. దానికి తోడుగా ఎలక్ట్రో-ఆప్టికల్ , ఇన్‌ఫ్రారెడ్ నిఘా వ్యవస్థను ఇందులో అమర్చారు. దీనివల్ల పగలు, రాత్రి తేడా లేకుండా, ప్రతికూల వాతావరణంలోనూ శత్రు డ్రోన్లను స్పష్టంగా చూడగలదు. వీటికి అదనంగా ప్యాసివ్ రేడియో ఫ్రీక్వెన్సీ సెన్సర్లు కూడా భార్గవాస్త్రలో భాగంగా ఉన్నాయి. ఈ అధునాతన పరిజ్ఞానాలన్నీ కలిసికట్టుగా పనిచేస్తూ.. కేవలం శత్రు డ్రోన్లను గుర్తించడమే కాదు, ఆకాశంలో వాటి కదలికలను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తాయి. అంతేకాకుండా, వస్తున్న వాటిలో ఏ డ్రోన్ వల్ల ఎంతటి ప్రమాదం ఉంది అన్న ముప్పు స్థాయినికూడా ఇవి అత్యంత వేగంగా వర్గీకరిస్తాయి.

ఇక ఈ మొత్తం వ్యవస్థను నడిపించే అసలు శక్తి దీని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్. ఇది అచ్చం ఒక మానవ మెదడులా వ్యవహరిస్తుంది. రాడార్, ఎలక్ట్రో-ఆప్టికల్ , ఇన్‌ఫ్రారెడ్ నిఘా వ్యవస్థ, ప్యాసివ్ రేడియో ఫ్రీక్వెన్సీ సెన్సర్లు.. ఇలా భిన్న సెన్సర్ల నుంచి వచ్చే అపారమైన సమాచారాన్ని ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ క్షణాల్లో విశ్లేషిస్తుంది. ఏది పక్షి, ఏది శత్రు డ్రోన్, ఏది అత్యంత ప్రమాదకరమైన మూకదాడి అన్నది కచ్చితంగా నిర్ధారిస్తుంది. ఆ వెంటనే, ఆ లక్ష్యాలను సమర్థవంతంగా నేలకూల్చడానికి అన్‌గైడెడ్ రాకెట్లను ప్రయోగించాలా లేక మైక్రో మిసైళ్లను వదలాలా అని నిర్ణయించి, శత్రువుకు ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా పని పూర్తి చేస్తుంది. పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో జరిగిన పరీక్షల్లో భార్గవాస్త్ర తన సత్తాను విజయవంతంగా నిరూపించుకుంది. ఇది భారత రక్షణ రంగానికి నిజంగా ఒక గర్వకారణం. భార్గవాస్ర’ ఇకపై మన గగనతలానికి తిరుగులేని రక్షణ కవచంగా, శత్రు మూకడ్రోన్ల పాలిట అసలు సిసలు సింహస్వప్నంగా నిలవనుంది.

కామెంట్లు (0)

మీ అభిప్రాయం రాయండి

అసభ్య/స్పామ్ కామెంట్లు తొలగించబడతాయి.

సంబంధిత వార్తలు