హార్ముజ్ జలసంధిలో మళ్లీ హై టెన్షన్..అమెరికా రాడార్‌ను పేల్చేసినట్లు ఐ.ఆర్.జీ.సీ ప్రకటన

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇజ్రాయెల్, హమాస్, హిజ్బుల్లా అంటూ మొదలైన వివాదం ఇప్పుడు ఏకంగా అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య డైరెక్ట్ వార్‌కు దారి తీసేలా కనిపిస్తోంది. బహ్రెయిన్ ద్వీపంలో ఉన్న అమెరికా ముందస్తు హెచ్చరికల రాడార్ వ్యవస్థను తాము ధ్వంసం చేశామని ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అధికారికంగా ప్రకటించింది. ఇది అమెరికాకు కేవలం ఒక చిన్న హెచ్చరిక మాత్రమేనని, తమ సరిహద్దులను ఉల్లంఘిస్తే గతంలో కంటే మరింత కఠినంగా బదులిస్తామని IRGC వార్నింగ్ ఇచ్చింది. అగ్రరాజ్యం అమెరికా చర్యలకు ఇరాన్ గంటల వ్యవధిలోనే రిటార్ట్ ఇచ్చింది. ఫార్స్ న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం.. మొదట ఇరాన్‌లోని సిరిక్ ప్రాంతంలో ఉన్న ఒక కీలకమైన టెలికమ్యూనికేషన్ టవర్‌పై అమెరికా వైమానిక దాడి చేసింది. తమ దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీస్తూ అమెరికా చేసిన ఈ దాడిని IRGC తీవ్రంగా పరిగణించింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఏరోస్పేస్ దళాలు వెంటనే రంగంలోకి దిగాయి. అమెరికా దాడి జరిగిన సుమారు గంటలోపే ఇరాన్ దళాలు రివర్స్ అటాక్ చేశాయి. బహ్రెయిన్ ద్వీపంలో వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన అమెరికా సైన్యానికి చెందిన ఎర్లీ వార్నింగ్ రాడార్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దళాలు దాడి చేశాయి. ఈ పవర్ ఫుల్ దాడిలో అమెరికా రాడార్ పూర్తిగా ధ్వంసమైనట్లు IRGC తన ప్రకటనలో స్పష్టం చేసింది. భవిష్యత్తులో అమెరికా వైమానిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, తమపై దాడులకు పాల్పడితే ఇలాంటి తీవ్ర పరిణామాలే ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించడమే ఈ ఆపరేషన్ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ఇరాన్ చెబుతోంది.


