49 ఏళ్లుగా ఆగని ప్రయాణం.. విశ్వంలో మరో చరిత్ర సృష్టించనున్న వాయేజర్-1..!

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సృష్టించిన వాయేజర్-1 వ్యోమనౌక చరిత్ర సృష్టించింది. 49 ఏళ్లుగా, రాత్రి పగలు అనే తేడా లేకుండా సెకనుకు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూనే ఉంది. మన సౌర కుటుంబాన్ని దాటేసి, ఏ గ్రహాలూ లేని అనంతమైన చీకటి సముద్రంలోకి ఎప్పుడో ప్రవేశించిన ఈ వ్యోమనౌక.. ఇప్పుడు మరో చారిత్రక మైలురాయిని చేరుకోబోతోంది. నవంబర్ 18న వాయేజర్-1.. భూమి నుంచి ఏకంగా ఒక లైట్-డే దూరానికి చేరుకుని కొత్త చరిత్ర సృష్టించబోతోంది. అంటే, కాంతి ఒక రోజంతా ప్రయాణిస్తే ఎంత దూరం వెళుతుందో.. వాయేజర్-1 ఇప్పుడు అంత దూరానికి వెళ్లిపోయింది. కిలోమీటర్లలో చెప్పాలంటే అక్షరాలా 2590 కోట్ల కిలోమీటర్లు.
1977 సెప్టెంబర్ 5న నాసా వాయేజర్-1 ను అంతరిక్షంలోకి ప్రయోగించింది. దీని ముఖ్య ఉద్దేశం సౌర కుటుంబంలోని బృహస్పతి, శని గ్రహాలను దగ్గరగా అధ్యయనం చేయడం. అనుకున్నట్లుగానే ఇది ఆ గ్రహాల గుండా ప్రయాణించి, భూమికి అద్భుతమైన ఫొటోలను పంపింది. శని గ్రహ వలయాలు, బృహస్పతి ఉపగ్రహాలైన టైటాన్, అయో లాంటి వాటికి సంబంధించిన ఎన్నో రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ పని పూర్తయిన తర్వాత దీని పని అయిపోయింది అనుకున్నారు అందరూ. కానీ వాయేజర్-1 టార్గెట్ అది కాదు. గంటకు 60 వేల 773 కిలోమీటర్ల కళ్లు చెదిరే వేగంతో, అది సౌర వ్యవస్థ అంచుల వైపు దూసుకెళ్లింది. అలా దశాబ్దాల పాటు ప్రయాణించి, 2012 ఆగస్టులో మన సూర్యుడి ప్రభావం ముగిసే సరిహద్దును దాటేసింది. అలా నక్షత్రాల మధ్య ఉండే ఇంటర్స్టెల్లార్ స్పేస్‌లోకి అడుగుపెట్టిన మొదటి మానవ నిర్మిత వస్తువుగా రికార్డు సృష్టించింది. దాదాపు 16.1 బిలియన్ మైళ్లు అంటే v2,590 కోట్ల కిలో మీటర్ల దూరంలో ఉంటూ, ఇప్పటికీ అక్కడి వాతావరణం గురించి మనకు డేటాను పంపుతూనే ఉంది.అయితే 2590 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న వాయేజర్-1 తో కమ్యూనికేట్ చేయడం సాధారణ విషయం కాదు. భూమి మీదున్న నాసా డీప్ స్పేస్ నెట్వర్క్ కేంద్రాల నుంచి ఒక సిగ్నల్ లేదా ఒక కమాండ్‌ను పంపితే.. ఆ సిగ్నల్ లైట్ స్పీడ్ తో ట్రావెల్ చేసినా వాయేజర్-1 కు చేరుకోవడానికి అక్షరాలా 24 గంటల సమయం పడుతుంది. సిగ్నల్‌ను అది రిసీవ్ చేసుకుని, దానికి ఒక రిప్లై పంపితే.. ఆ రిప్లై మళ్లీ మన భూమిని చేరుకోవడానికి మరో 24 గంటలు పడుతుంది. అంటే నాసా శాస్త్రవేత్తలు ఒక చిన్న మెసేజ్ పంపి, దాని రిజల్ట్ ఏంటో చూడాలంటే ఏకంగా 48 గంటలు ఎదురుచూడాలి. ఇంత దూరం నుంచి అది పంపే సిగ్నల్ ఒక చిన్న బల్బు వెలుగులో కోటి వంతు కంటే తక్కువ శక్తిని కలిగి ఉంటుంది. అయినా సరే మన భూమి మీదున్న 70 మీటర్ల భారీ రేడియో డిష్‌లు ఆ చిన్న సమాచారాన్ని కూడా స్పష్టంగా పసిగట్టి డీకోడ్ చేస్తున్నాయి.
వాయేజర్-1 కేవలం అంతరిక్ష పరిశోధన కోసం వెళ్లిన ఒక యంత్రం మాత్రమే కాదు.. అది భూమికి సంబంధించిన ఒక టైమ్ క్యాప్సూల్. భవిష్యత్తులో ఈ వాయేజర్ ఏదైనా గ్రహాంతరవాసుల చేతికి చిక్కితే మన గురించిన సమాచారం వాళ్లకు తెలియాలన్న ఉద్దేశంతో ప్రఖ్యాత శాస్త్రవేత్త కార్ల్ సాగన్ నేతృత్వంలో ఒక గోల్డెన్ రికార్డ్ ను తయారు చేసి దీనికి అమర్చారు. ఈ బంగారు పూత పూసిన గ్రామఫోన్ రికార్డులో.. భూమిపై ఉండే పక్షుల అరుపులు, గాలి, వర్షం, సముద్రపు అలల శబ్దాలు రికార్డ్ చేశారు. అంతేకాకుండా మన దేశానికి చెందిన హిందీ, తెలుగు, బెంగాలీ లాంటి భాషలతో పాటు మొత్తం 55 ప్రపంచ భాషల్లో గ్రహాంతరవాసులకు శుభాకాంక్షలు చెబుతూ ఆడియోలను పొందుపరిచారు. మనుషుల డీఎన్ఏ నిర్మాణం, మన సౌర కుటుంబం ఎక్కడుంది అన్న మ్యాప్‌ను కూడా ఆ రికార్డు కవర్‌పై చెక్కారు. ఒకవేళ వాయేజర్ రేపు పనిచేయడం మానేసినా.. ఈ గోల్డెన్ రికార్డ్ మాత్రం కోట్లాది సంవత్సరాల పాటు విశ్వంలో భూమికి ఒక ప్రతినిధిగా మిగిలిపోతుంది.49 ఏళ్లుగా విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న వాయేజర్-1 ఇప్పుడు పూర్తి వృద్ధాప్యానికి చేరుకుంది. ఇందులో సోలార్ ప్యానెల్స్ ఉండవు, ఎందుకంటే సూర్యుడి వెలుతురు అక్కడికి చేరదు కాబట్టి. అందుకే ప్లుటోనియం ఆధారంగా పనిచేసే న్యూక్లియర్ బ్యాటరీలతో ఇది నడుస్తోంది. కానీ కాలం గడిచేకొద్దీ ఆ ప్లుటోనియం శక్తి తగ్గిపోతోంది. ప్రతి ఏడాది వాయేజర్ 4 వాట్ల పవర్‌ను కోల్పోతోంది. దీంతో ఈ వ్యోమనౌకను ఇంకొన్నేళ్ల పాటు బతికించుకోవడానికి నాసా శాస్త్రవేత్తలు చాలా సాహసాలు చేస్తున్నారు. దీనిలోని అత్యంత ముఖ్యమైన కమ్యూనికేషన్ పరికరాలు, థ్రస్టర్ల మనుగడ కోసం.. మిగతా సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ను, హీటర్లను ఒక్కొక్కటిగా శాశ్వతంగా స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. మైనస్ డిగ్రీల చలిలో హీటర్లు ఆఫ్ చేస్తే పరికరాలు గడ్డకట్టుకుపోతాయి అని తెలిసినా సరే, పవర్ ఆదా చేయడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల తలెత్తిన కొన్ని మెమరీ గ్లిచెస్, కమ్యూనికేషన్ ఎర్రర్లను కూడా నాసా ఇంజనీర్లు తమ అద్భుతమైన కోడింగ్ స్కిల్స్‌తో పరిష్కరించి వాయేజర్ ను కొనసాగిస్తున్నారు.1990లో వాయేజర్-1 మన భూమిని ఒక ఫొటో తీసింది. అందులో మన భూమి ఒక చిన్న పేల్ బ్లూ డాట్ లా కనిపించింది. ఆ ఫోటో ఈ అనంత విశ్వంలో మనం ఎంతో చెప్పకనే చెప్పింది. ఇక వాయేజర్-1 ముగింపు విషయానికొస్తే.. బహుశా 2030 నాటికి దీని బ్యాటరీ పూర్తిగా తన పనితీరును కోల్పోవచ్చు. నాసా తో సంబంధాలు తెగిపోవచ్చు. కానీ దీని భౌతిక ప్రయాణం మాత్రం ఆగదు.. గంటకు 60 వేల కిలోమీటర్ల వేగంతో అనంత విశ్వంలో ఒంటరిగా అలా పయనిస్తూనే ఉంటుంది.. మానవుడు సృష్టించిన ఈ వస్తువు. సైన్స్ చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని ఒక అద్భుతంలా మిగిలిపోతుంది.



