భూమి సందేశంతో అనంత విశ్వంలోకి.. వయేజర్-1 సాధించిన అసాధారణ మైలురాయి!

దాదాపు 49 ఏళ్ల క్రితం భూమి నుంచి ప్రయోగించిన వయోజర్-1 అంతరిక్ష నౌక.. ఇప్పుడు విశ్వంలో మునుపెన్నడూ ఎవరూ చేరుకోని ఒక మహా మైలురాయిని చేరుకుంది. మనిషి తయారుచేసిన ఒక యంత్రం, భూమి నుంచి ఏకంగా ఒక కాంతి రోజు దూరాన్ని చేరుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. నవంబర్ 18న మధ్యాహ్నం 3 గంటల 46నిమిషాలకు ఈ అద్భుతమైన ఘనతను సాధించింది. మానవుడి చేత నిర్మితమైన విశ్వంలో అత్యంత దూరం ప్రయాణించిన స్పేస్ క్రాఫ్ట్‌గా ఇది చరిత్రలో నిలిచిపోయింది. వాయేజర్-1ను నాసా 1977 సెప్టెంబర్ 5న ప్రయోగించింది. దీన్ని ప్రయోగించిన 16 రోజులకు వయోజర్-2ను కూడా అంతరిక్షంలోకి పంపారు. సౌర కుటుంబంలో మనకు దూరంగా ఉన్న గురుడు, శని, యూరేనస్, నెప్ట్యూన్ లాంటి భారీ గ్రహాలను పరిశీలించడమే ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఇంధనం ఆదా చేయడానికి ఈ నౌకలు గ్రహాల గురుత్వాకర్షణ శక్తిని ఆసరాగా చేసుకుని స్లింగ్షాట్ పద్ధతిలో ముందుకు సాగాయి. దీనినే గ్రావిటేషనల్ అసిస్ట్ అంటారు. 1979లో గురుడుని, 1980లో శని గ్రహాన్ని అత్యంత సమీపంగా పరిశీలించిన వయోజర్-1.. ఆ గ్రహాల వలయాలు, వాటి ఉపగ్రహాలకు సంబంధించిన అద్భుతమైన ఫొటోలను భూమికి పంపింది. సోలార్ సిస్టమ్ లోని గ్రహాలన్నింటినీ దాటుకుని ముందుకు వెళ్లిన వయోజర్-1.. 2012లో ఒక చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించింది. అదే హీలియోపాజ్ ను దాటడం. సూర్యుడి నుంచి వెలువడే వేడి కణాలు, సౌర గాలులు, అయస్కాంత క్షేత్రాలతో ఏర్పడిన ఒక భారీ రక్షణ కవచం మన సూర్యమండలాన్ని కప్పి ఉంచుతుంది. ఆ కవచం వెలుపలి సరిహద్దునే హీలియోపాజ్ అంటారు. ఆ బార్డర్‌ను దాటేసిన వయోజర్.. పూర్తిగా సూర్యుడి ప్రభావం లేని, భయంకరమైన చీకటి , శీతల పరిస్థితులు ఉండే ఇంటర్స్టెల్లార్ స్పేస్ లోకి ప్రవేశించింది.
వయోజర్-1 నౌకను 1970లో తయారుచేశారు. ఆనాటి సాంకేతికతతో ఈరోజుటికీ అది వందల కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి సిగ్నల్స్ పంపిస్తోందంటే ఆ టెక్నాలజీ ఎంత పటిష్టమైనదో అర్థం చేసుకోవచ్చు. సూర్యుడి ప్రభావం దాటి వెళ్లిపోయిన దానికి సోలార్ ప్యానెల్స్ లేవు. దానికి బదులుగా థర్మోఎలక్ట్రిక్ జనరేటర్లు ఈ అంతరిక్ష నౌకకు విద్యుత్‌ను అందిస్తున్నాయి.



