చిరు లీక్స్.. మెగాస్టారా..మజాకా..!

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కాకా. ఈ సినిమాలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ చిరు కూతురు పాత్రలో నటిస్తోంది. తాజాగా ఇట్లు అర్జున సక్సెస్ మీట్‌కు హాజరైన చిరంజీవి.. అనస్వర యాక్టింగ్ టాలెంట్ గురించి మాట్లాడుతూనే ఆమె క్యారెక్టర్ కు సంబంధించిన ఒక లీకును బయటపెట్టారు. స్టేజిపై చిరు మాట్లాడుతూ.. కాకా సినిమాలో అనస్వర అద్భుతంగా నటించింది. ఇప్పుడు అనస్వర.. నువ్వేమైనా నీ పాత్ర గురించి ఇక్కడ మాట్లాడతావా? అంటే.. తను మాట్లాడదు.. మాట్లాడలేదు.. మాట్లాడడం ఆమెకు నచ్చదు. నేను చెప్పిన ఈ లైన్‌ను మీరు ఇంటికి వెళ్లాక బాగా గుర్తుచేసుకుని ఆలోచించండి. అప్పుడు ఈ సినిమాలో ఆమె పాత్ర అసలు విషయం ఏంటో మీకు అర్థమవుతుంది అని చెప్పి నవ్వేశారు. చిరు ఆ మాట అనగానే వేదికపై ఉన్న అనస్వర.. సర్ మీరు మూవీ సస్పెన్స్ లీక్ చేసేశారు అన్నట్లు ఎంతో క్యూట్ గా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. దీంతో ఈ చిత్రంలో ఆమె ఒక మూగ అమ్మాయి పాత్రలో నటిస్తుందంటూ ఎప్పటి నుంచో వస్తోన్న రూమర్స్ కు ఇప్పుడు బలం చేకూరింది. ఈ తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ సీన్స్ మూవీలో హైలైట్ కానున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న కాకా మూవీ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఇదే ఈవెంట్లో మెగాస్టార్ కేవలం తన సినిమా గురించి మాత్రమే కాదు.. యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల గురించి చేసిన ఫన్నీ కామెంట్స్ కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వెంకీ కుడుములలో మంచి కామెడీ సెన్స్ ఉంటుందని, అతని సినిమాలు, డైలాగ్ టైమింగ్ తనకు ఎంతో ఇష్టమని చిరంజీవి ప్రశంసించారు. కానీ ఆ తర్వాతే డైరెక్టర్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. సాధారణంగా నేను ఎవరినీ నాతో సినిమా చేస్తావా అని అడగను. కానీ, మొదటిసారి వెంకీని అడిగాను. మంచి కథతో వస్తాను సర్ అన్నాడు. అప్పటినుంచి నేను కూడా ఎంతో ఆశగా ఒక చకోర పక్షిలా ఎదురుచూస్తూనే ఉన్నాను. కానీ ఇప్పటి వరకూ నా దగ్గరకు రాలేదు. నాకు హ్యాండ్ ఇచ్చి, ఇప్పుడు ఈ ఇట్లు అర్జున సినిమాకు ఏకంగా నిర్మాతగా అవతారం ఎత్తాడు అని చిరు సరదాగా సెటైర్లు వేశారు.చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ కు వేదిక మీద ఉన్నవారంతా గట్టిగా నవ్వేశారు. అక్కడితో ఆగని చిరు వెంకీని డైరెక్ట్ గా అడిగేశారు.. ఇంతకీ నువ్వు కథ చెప్పడానికి నా దగ్గరకు వస్తావా.. లేదంటే నా ఇంటి తలుపులు శాశ్వతంగా మూసేయనా? అని ఫన్నీ వార్నింగ్ ఇచ్చారు. దీనికి వెంకీ కుడుముల కూడా స్పందిస్తూ మీరు ఇంటి తలుపులు మూసేసినా సరే సార్.. నేను ఎలాగోలా గోడ దూకి వచ్చి అయినా సరే మీకు కథ వినిపిస్తా అని వెంకీ బదులివ్వడంతో ఆ వేదిక మొత్తం నవ్వులతో మారుమోగిపోయింది. ఒక సీనియర్ స్టార్ హీరో అయి ఉండి కూడా, యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో, వాళ్లతో కలిసిపోయి ఇంత సరదాగా మాట్లాడటంలో మెగాస్టార్ కు ఎవరూ సాటిరారు. చిరు లీక్స్ ద్వారా ఇప్పుడు కాకా మూవీపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.



