అవి మాత్రమే సేఫ్… క్షిపణులతో హౌతీల మహా విధ్వంసం!
కామెంట్లు (0)

మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో పలు దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఇన్నాళ్లూ ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్, హిజ్బుల్లా వార్ వార్తల్లో నిలిస్తే తాజాగా ఇప్పుడు యెమెన్ వార్తల్లో నిలుస్తోంది. యెమెన్‌లో అంతర్యుద్ధం మరోసారి భయంకరంగా రాజుకుంది. ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఏళ్లుగా పోరాడుతున్న హౌతీ రెబల్స్ .. ఇప్పుడు ఏకంగా ఆ దేశ అత్యున్నత కేంద్రమైన ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నే టార్గెట్ చేసుకుని భీకర దాడికి దిగారు. ఏకంగా ఐదు క్షిపణులతో అధ్యక్ష భవనాన్ని టార్గెట్ చేసి మహా విధ్వంసం సృష్టించారు. దాడి జరిగిన సమయంలో ఆ ప్యాలెస్‌లో సాక్షాత్తూ యెమెన్ ప్రధానమంత్రి, ఆయన కేబినెట్ మంత్రులు అత్యవసర మీటింగ్‌లో ఉన్నారు. ఈ అటాక్‌తో యెమెన్ ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
యెమెన్ లోని ప్రధాన పోర్ట్ సిటీ అయిన ఏడెన్ . ఈ నగరంలోని క్రేటర్ డిస్ట్రిక్ట్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే భవనమే అల్ మాషిక్ ప్యాలెస్ . ప్రస్తుతం యెమెన్ సంకీర్ణ పరిపాలన అంతా ఈ ప్యాలెస్ నుంచే నడుస్తోంది.అందరూ తమ పనుల్లో బిజీగా ఉన్న సమయంలో.. ఆకాశం నుంచి భయంకరమైన శబ్దాలతో వరుసగా ఐదు క్షిపణులు దూసుకొచ్చి ఆ ప్యాలెస్ సమీపంలో పడ్డాయి. భారీ శబ్దాలతో కూడిన పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల ధాటికి అల్ మాషిక్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ పరిసర ప్రాంతాల నుండి నల్లటి పొగలు ఆకాశాన్ని ముంచెత్తాయి. కిలోమీటర్ల దూరంలో ఉన్న నివాసాలు సైతం భూకంపం వచ్చినట్లు కంపించిపోయాయని స్థానిక మీడియా చెబుతోంది. ఈ హఠాత్ పరిణామాలతో ఏడెన్ సిటీలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
అయితే, ఈ అటాక్ జరిగిన సమయంలో ఆ ప్యాలెస్‌లోనే యెమెన్ ప్రధానమంత్రి, ఆయన కేబినెట్ మంత్రులు ఒక కీలక భేటీలో ఉన్నారు. అదృష్టవశాత్తూ వాళ్లందరూ సురక్షితంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని యెమెన్ సమాచార శాఖ మంత్రి మహ్మద్ అమ్మర్ అల్ ఎర్యానీ అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ భీకర దాడిలో ప్యాలెస్ సెక్యూరిటీ సిబ్బందిలో నలుగురు మరణించగా, అధ్యక్షుడి భవనానికి భారీగా ఆస్తి నష్టం సంభవించింది. యెమెన్ ప్రభుత్వ ముఖ్య నేతలను అంతం చేయడానికే హౌతీలు ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని మొదట్లో అందరూ అనుమానించారు. కానీ సీన్ కట్ చేస్తే అసలు టార్గెట్ వేరే ఉందని తేలింది.
ఈ దాడి జరిగిన కొద్దిసేపటికే హౌతీ రెబల్స్ ఈ అటాక్‌కి తామే బాధ్యత వహిస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించుకున్నారు. అంతేకాదు, తాము యెమెన్ మంత్రులను చంపడానికి ఈ దాడి చేయలేదని, తమ అసలు టార్గెట్ వేరే ఉందని ఒక బాంబు పేల్చారు. ప్రస్తుతం యెమెన్‌లో ఉన్న ప్రభుత్వానికి సౌదీ అరేబియా పూర్తి స్థాయిలో మిలిటరీ, ఆర్థిక మద్దతు ఇస్తోంది. ఆ అల్ మాషిక్ ప్యాలెస్ ప్రాంగణంలోనే.. సౌదీ అరేబియా మిలిటరీ అధికారులు నిర్వహిస్తున్న ఒక సైనిక కార్యకలాపాల కేంద్రం, అలాగే వాళ్లకు సంబంధించిన భారీ ఆయుధ డిపోలు ఉన్నాయన్న పక్కా సమాచారంతోనే హౌతీలు ఈ క్షిపణి దాడి చేశారు.ఈ విషయాన్ని హౌతీ మిలిటరీ ప్రతినిధి యాహ్యా సరి స్వయంగా వెల్లడించారు.
సౌదీ అరేబియా సైనిక దళాలు యెమెన్‌లో ఎక్కడ ఉన్నా, వాళ్లను టార్గెట్ చేయడమే మా విధానం. అందులో భాగంగానే ఏడెన్‌లో ఉన్న సౌదీ స్థావరాలపై ఈ క్షిపణులతో దాడులు చేశాం అని హౌతీ మిలిటరీ ప్రతినిధి స్పష్టం చేశారు. దీన్నిబట్టి చూస్తే, యెమెన్ గడ్డ మీద సౌదీ అరేబియా ప్రాబల్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టడానికే హౌతీలు కంకణం కట్టుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. కేవలం ఈ ప్యాలెస్ దాడితో హౌతీలు ఆగిపోలేదు. దీని తర్వాత ఇంటర్నేషనల్ కమ్యూనిటీని ఉలిక్కిపడేలా చేసే ఒక భయంకరమైన వార్నింగ్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ విమానయాన సంస్థలకు హౌతీ తిరుగుబాటుదారులు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ జారీ చేశారు.
సౌదీ అరేబియా వైమానిక ప్రాంతంతో పాటు, అక్కడి ప్రధాన విమానాశ్రయాలు ఏవీ ఇకమీదట సురక్షితం కాదు. వాటిపై మా క్షిపణి దాడులు , డ్రోన్ దాడులు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి అని హెచ్చరించారు. అంటే ఏ ప్యాసింజర్ విమానం అయినా సరే సౌదీ అరేబియా మీదుగా వెళ్తే, దానిపై ఎప్పుడైనా మిస్సైల్ దాడి జరగొచ్చని ఇండైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చారు. ఈ హెచ్చరికలతో ప్రపంచ దేశాల ఎయిర్‌లైన్స్ అన్నీ అలర్ట్ అయ్యాయి. అయితే, ఇక్కడే హౌతీలు ఇంకో మాట చెప్పారు. ఇస్లామిక్ పవిత్ర స్థలాలైన మక్కా , మదీనా వైమానిక మార్గాలకు మాత్రం మా దాడుల నుండి పూర్తి మినహాయింపు ఇస్తున్నాం అని పేర్కొన్నారు. ఆ పవిత్ర స్థలాల వైపు వెళ్లే విమానాలకు ఎలాంటి ముప్పు ఉండదని, మిగతా సౌదీ అరేబియా భూభాగంపై మాత్రం తమ అటాక్స్ ఆగవని తేల్చి చెప్పారు.



