ఎలాన్ మస్క్ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్..సైబర్ ట్రక్ కు ఏమైంది..?

మార్స్ మీద మనుషులను నివసించేలా చేయడం నుంచి, పెట్రోల్ కార్లకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ కార్లను ఒక రేంజ్ లో ప్రజలలోకి తీసుకెళ్లడం వరకు స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మార్క్ కృషి గురించి ప్రపంచమంతా తెలిసిందే. ఇక అలాంటి ఎలన్ మస్క్ అనూహ్యంగా, ఎవరూ ఊహించని విధంగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెక్సాస్ లోని ఆస్టిన్ ప్లాంట్ లో 2027 నాటికి సైబర్ ట్రక్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించి ప్రపంచ ఆటోమొబైల్ రంగాన్ని ఆశ్చర్యపోయేలా చేశాడు. ఆటోమొబైల్ ఇండస్ట్రీని శాసిస్తుంది అనుకున్న సైబర్ ట్రక్ జర్నీ ఇంత త్వరగా ముగిసిపోయింది. సైబర్ ట్రక్ ను లాంచ్ చేసినప్పుడు ఎలన్ మస్క్ అంచనాలు మామూలుగా లేవు. ఏడాదికి కనీసం రెండు లక్షల యాభై వేల సైబర్ ట్రక్కులను ఉత్పత్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు. కానీ తీరా మార్కెట్లోకి వచ్చాక సీన్ రివర్స్ అయింది. ప్రముఖ ఆటోమోటివ్ రీసెర్చ్ సంస్థ కెల్లీ బ్లూ బుక్ అంచనా ప్రకారం.. గత ఏడాది టెస్లా అమ్మింది కేవలం 20,237 యూనిట్లు మాత్రమే. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇవి సగం మాత్రమే. ఇక ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి అమ్మకాలు మరో 28 శాతం పడిపోయాయి.
అమ్మకాలు దారుణంగా పడిపోవడానికి ప్రధాన కారణం ధర కూడా. ఈ సైబర్ ట్రక్ ధర 40 వేల డాలర్ల కంటే తక్కువగానే ఉంటుందని చెప్పాడు. కానీ తీరా డెలివరీలు మొదలయ్యేసరికి దాని ధర రెట్టింపు అయింది. సుమారు 80 వేల నుంచి లక్ష డాలర్ల వరకు పెరిగిపోవడంతో, ప్రీ-బుకింగ్ చేసుకున్న వేలాది మంది కస్టమర్లు తమ బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. అసలు ఎలక్ట్రిక్ పికప్ ట్రక్కులకు అమెరికా మార్కెట్లో పెద్దగా డిమాండ్ లేదు, అలాంటి చోట ఒక కాంట్రవర్సియల్ వ్యక్తి, ఒక కాంట్రవర్సియల్ డిజైన్ తో కారును తీసుకురావడం మొదటి రోజే ఫెయిల్ అయిందని మాజీ టెస్లా ఎగ్జిక్యూటివ్ స్పెన్సర్ పెన్ సైతం విశ్లేషించారు. ఇక ధర పక్కనపెడితే, సైబర్ ట్రక్ డిజైన్ కూడా ఒక పెద్ద డిజాస్టర్ అని చాలామంది ఆటోమొబైల్ ఎక్స్పర్ట్స్ తేల్చేశారు. పదునైన అంచులు, ఎక్కడా కర్వ్స్ లేని స్టెయిన్లెస్-స్టీల్ బాడీ చూస్తే అదొక కారు లాగా లేదు, ఏదో బక్కెట్ ను బోర్లించినట్లు ఉందని విమర్శించారు. మస్క్ దృష్టిలో అది బ్లేడ్ రన్నర్ , ఏలియన్స్ సినిమాల్లో ఉండే ఒక ఫ్యూచరిస్టిక్ బ్యాటిల్ ట్యాంక్ లాగా అద్భుతంగా కనిపించొచ్చు, కానీ రోడ్డు మీద తిరిగే సాధారణ కస్టమర్ కు మాత్రం అది పెద్దగా నచ్చలేదనే చెప్పాలి. పోర్షే 911 కన్నా స్పీడ్ గా వెళుతుంది, ఫోర్డ్ F-150 కన్నా బెటర్ ట్రక్ అని మస్క్ ఎంతగానో ప్రమోట్ చేసుకున్నాడు. కానీ ప్రాక్టికల్ గా వాడేటప్పుడు ఎన్నో సమస్యలు వచ్చాయి. తుప్పు పడుతోందని, సాఫ్ట్ వేర్ గ్లిచ్ లు వస్తున్నాయని కంప్లైంట్స్ వచ్చాయి. అయితే ఈ ట్రక్ చుట్టూ ఉన్న కాంట్రవర్సీ వల్ల చరిత్రలో ఏ వాహనానికీ రాని స్థాయిలో దీనికి అటెన్షన్ లభించింది. కొందరు దీన్ని పిచ్చి అన్నప్పటికీ, మస్క్ సాహసానికి అద్దం పడుతోందని మరికొందరు ప్రశంసించారు.
ఇక సైబర్ ట్రక్ వైఫల్యానికి కేవలం డిజైన్, ధర మాత్రమే కాదు, ఎలన్ మస్క్ పొలిటికల్ ఇమేజ్ కూడా ఒక ప్రధాన కారణం అని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మస్క్ పదే పదే రైట్ వింగ్ నాయకులకు, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బహిరంగంగా మద్దతు తెలపడం చాలామంది పాత టెస్లా కస్టమర్లకు నచ్చలేదు. ఒక టెక్నాలజీ ఇన్నోవేటర్ స్థాయి నుంచి, తన బిలియన్ల కొద్దీ డాలర్లను రాజకీయ పలుకుబడి కోసం వాడుకునే ఒక కాంట్రవర్సియల్ వ్యక్తిగా మస్క్ మారడాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోయారు. దీని ఎఫెక్ట్ డైరెక్ట్ గా సైబర్ ట్రక్ ఓనర్స్ మీద పడింది.ఒకపక్క కస్టమర్ల నుంచి బ్యాక్ లాష్, మరోపక్క దారుణంగా పడిపోయిన సేల్స్.. ఇవన్నీ చూసి ఎలన్ మస్క్ సైబర్ ట్రక్ ను సైలెంట్ గా పక్కకు తప్పిస్తున్నాడు. అయితే ఈ గ్యాప్ లో టెస్లా భవిష్యత్తును డిసైడ్ చేయబోయే అటానమస్ వెహికల్స్, అనగా డ్రైవర్ లేకుండా నడిచే సైబర్ క్యాబ్ రోబోట్యాక్సీ ల ఉత్పత్తిపై ఫోకస్ పెంచడానికే సైబర్ ట్రక్ ఉత్పత్తిని నిలిపివేస్తున్నామని మస్క్ ఒక కవరింగ్ ఇచ్చుకున్నాడు. కారణం ఏదైనా ఒక సెన్సేషనల్ ప్రాజెక్ట్ అత్యంత దారుణంగా ఫెయిల్యూర్ ను మూటగట్టుకుని ముగిసిపోవడం ఆటోమొబైల్ రంగానికి ఒక పెద్ద గుణపాఠం.

