పశుగ్రాసం కొరతకు సరైన పరిష్కారం...90% తక్కువ నీటితో హైడ్రో ఫోనిక్స్

మన గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం తర్వాత రైతులకు అత్యంత స్థిరమైన ఆదాయాన్ని ఇస్తున్న రంగం పాడి పరిశ్రమ. అయితే ఈ రంగంలో అతిపెద్ద సమస్య పశుగ్రాసం కొరత. పోషకాల కోసం బయట మార్కెట్లో దాణా కొందామంటే రేట్లు మండిపోతుంటాయి. పాలు అమ్మి వచ్చిన డబ్బులు ఆ దాణా కొనుగోళ్లకే సరిపోవడంతో రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. మరి ఈ పశుగ్రాసం కొరతకు పర్మినెంట్ సొల్యూషన్ లేదా? అంటే.. టెక్నాలజీ ఒక అద్భుతమైన పరిష్కారాన్ని చూపించింది. అదే హైడ్రోపోనిక్ పశుగ్రాసం.
హైడ్రోపోనిక్స్..అంటే మట్టి లేకుండా కేవలం నీరు, గాలిలోని తేమను ఉపయోగించి మొక్కలను పెంచే అత్యంత ఆధునిక సాగు విధానం. పశువులకు అత్యంత ఇష్టమైన, పుష్కలమైన ప్రోటీన్లు ఉండే మొక్కజొన్న, గోధుమ , బార్లీ లాంటి గింజలను ఈ విధానంలో పశుగ్రాసంగా పెంచుతారు. సాధారణంగా ఒక ఎకరం భూమిలో గడ్డి పెంచాలంటే దున్నడం, ఎరువులు వేయడం, కలుపు తీయడం, నీళ్లు పెట్టడం.. ఇలా నెలల సమయం, వేల రూపాయల ఖర్చు పడుతుంది. కానీ ఈ హైడ్రోపోనిక్ విధానంలో.. మీ ఇంటి వెనుక ఉన్న ఒక చిన్న షెడ్డు లేదా గదిలో ర్యాక్ లను ఏర్పాటు చేసుకుని, వాటిపై ప్లాస్టిక్ ట్రేలను ఉంచుతారు. ఆ ట్రేలలో విత్తనాలు చల్లితే, కేవలం 7 నుంచి 8 రోజుల్లో 8 అంగుళాల ఎత్తులో పచ్చటి పశుగ్రాసం పెరిగిపోతుంది. ఒక కిలో మొక్కజొన్న విత్తనాలను ఈ ట్రేలో వేస్తే.. ఏడవ రోజుకి అది 8 నుంచి 10 కిలోల పచ్చటి మొలకల గడ్డిగా మారుతుంది. బయట మార్కెట్లో దాణా కొనాల్సిన అవసరం లేకుండా, ఇంట్లోనే అత్యంత తక్కువ ఖర్చుతో హై-ప్రోటీన్ ఫుడ్ ను పశువులకు అందించవచ్చు.
ఈ టెక్నాలజీలో ఉన్న మరో సౌకర్యం నీరు. మామూలు పద్ధతిలో గడ్డి పెంచడానికి పట్టే నీటిలో, కేవలం 10 శాతం నీరు మాత్రమే ఈ హైడ్రోపోనిక్స్ కు సరిపోతుంది. అంటే 90 శాతం నీటిని మనం ఆదా చేయొచ్చు. పైపైన మైక్రో స్ప్రింక్లర్స్ లేదా ఫాగర్స్ ద్వారా ఒక స్ప్రే లాగా మాత్రమే నీటిని అందిస్తారు. దీనికి తోడు భూమి లేదు కాబట్టి ఎరువులు వేయాల్సిన పనిలేదు, పురుగుమందులు కొట్టాల్సిన పనిలేదు. ఇది వంద శాతం ఆర్గానిక్ అండ్ సేంద్రియ పశుగ్రాసం.



