
పూర్వం దక్షిణ దేశంలో గోకర్ణం అనే క్షేత్రం ఉండేది. దానినే ‘భూకైలాసము’గా పిలుస్తారు. నారద మునీంద్రుడు ఒకసారి గోకర్ణం వెళ్తూ, మార్గమధ్యలో ఒక సంపెంగ చెట్టును చూశాడు. అది బాగా విరగబూసి ఉంది. ఆ చెట్టు దగ్గర ఒక బ్రాహ్మణుడు చేత్తో గిన్నె పట్టుకుని నుంచున్నాడు. అది చూసిన నారదుడు ఆ విప్రుని దగ్గరకు వెళ్ళి.. ‘నీవెవరవు?. ఇక్కడ ఏం చేస్తున్నావు?’ అని అన్నాడు. దానికి ఆ విప్రుడు ‘నేనొక బాటసారిని. దారిలో అలసిపోయి ఈ చెట్టు నీడన నిలుచున్నాను’ అని బదులిచ్చాడు. తర్వాత నారదుడు గోకర్ణం వెళ్లి, మహాబలేశ్వరుని సేవించి తిరిగి వస్తుండగా.. ఆ బ్రాహ్మణుడు మళ్లీ అదే చెట్టు దగ్గర కనిపించాడు.
దీంతో.. నారదుడు సంపంగి చెట్టుతో
‘ఓ వృక్ష రాజమా! ఆ బ్రాహ్మణుడెవరు? అతడెక్కడికి వెళ్తున్నాడు’ అని అడిగాడు. ఇంతకుముందే నారదుడు తనను గురించి ఏమడిగినా తెలియదని చెప్పమన్నాడు బాటసారి. అందువల్ల సంపంగి చెట్టు ‘నాకు తెలియదు’ అంది. నారదుడు అందుకు ఊరుకోలేదు. మరలా తిరిగి మహాబలేశ్వరుడి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ నూటఎనిమిది సంపంగిపూలతో స్వామి అర్చన కావించబడి ఉన్నాడు. ఎదురుగా ఒక బ్రాహ్మణుడు ధ్యానం చేసుకుంటున్నాడు. నారదుడు ఆ బ్రాహ్మణుడ్ని పిలిచి ఈ పూలతో స్వామిని ఎవరు ఆర్చించారు? అని అడిగాడు.
ఈ పూలను ఒక దుష్ట బ్రాహ్మణుడు శివునికి అర్పించాడు. సంపెంగ పూలతో శివుని అర్చించినందుకు ఫలితంగా ఈ దేశపు రాజు అతడికి దాసుడయ్యాడు. దీంతో ఆ కపటి విశేష ధనాన్ని ఆర్జించి కూడా ప్రజలను ఇంకా పీడిస్తున్నాడు’ అని చెప్పాడు.
అప్పుడు నారదుడు మహాబలేశ్వరునితో
‘దేవదేవా! ఆ కపట బ్రాహ్మణుని నీవు కరుణించావు. అందువల్లే అతడు ఇటువంటి పనులు చేస్తున్నాడు, ఇటువంటి వాడ్ని శిక్షించమని అంటాడు. బదులుగా శివా.. నారదతో, నా భక్తులు ఎన్ని తప్పులు చేసినా నేను ఉపేక్షిస్తాను. అందుచేత నువ్వే ఆ సంగతి చూడు అనడంతో.. నారదుడు ఈశ్వరుని దగ్గర సెలవు తీసుకుని సంపంగి చెట్టు దగ్గరకు పోయి ‘ఓ తరురాజమా! నిజం చెప్పు ఆ బ్రాహ్మణుడెవరు? ఎందుకు నీ పూలు తీసుకువెళ్తున్నాడు?’ అని అడిగాడు. ‘నాకు తెలియదన్నది సంపంగి చెట్టు’
అప్పుడు నారదుడు “ఓ సంపంగి చెట్టా! నీ పూలంటే ఈశ్వరుడికి చాలా మక్కువ. కానీ నువ్వు విప్రుని గురుంచి తెలిసి కూడా తెలియదని అబద్దం చెప్పావు. అందుచేత నీ పూలు శివపూజకు ఇంక పనికిరావు’ అని శాపం పెట్టాడు. అంతలో ఆ బ్రాహ్మణుడు చెట్టు దగ్గరకు వచ్చాడు. నారదుడు ఆ కపట బ్రాహ్మణుని చూసి ‘ధనాశతో ప్రజలను పీడిస్తున్నావు. నిన్ను క్షమించరాదు. నువ్వు రాక్షసుడిగా జన్మించు’ అన్నాడు.
అందుకు ఆ బ్రాహ్మణుడు మహర్షి కాళ్ల వేళ్లా పడి తనను క్షమించమని బతిమిలాడాడు. అప్పుడు నారదుడు కనికరించి నువ్వు ‘విరాధుడు’ అనే రాక్షసుడుగా పుట్టు, త్రేతాయుగంలో శ్రీరాముడు నిన్ను సంహరించగానే నీకు శాప విమోచనం కలుగుతుంది’ అన్నాడు.
ఆ రకంగా సంపంగి పువ్వు పూజకు పనికిరాకుండా పోయింది. ఇదీ సంపంగి పువ్వు వృత్తాంతం.