ఆరుతడి పంటల్లో కింగ్…వరికి బెస్ట్ ఆప్షన్ మొక్కజొన్న

ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితులు, సాగునీటి కొరత నేపథ్యంలో ఎక్కువ మంది రైతులు వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి ఆరుతడి పంటల్లో తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని ఇచ్చే పంట మొక్కజొన్న. పశువుల దాణా తయారీ నుంచి, పౌల్ట్రీ ఫీడ్, ఇతర ఆహార ఉత్పత్తుల్లో మొక్కజొన్న వినియోగం భారీగా ఉండటంతో మార్కెట్లో దీనికి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. అయితే, చాలామంది రైతులు సరైన సాగు విధానం తెలియక ఆశించిన దిగుబడులు సాధించలేకపోతున్నారు. మరి మొక్కజొన్న సాగుకు ఎలాంటి నేలలు అనుకూలం విత్తే సమయం ఏది ఎకరాకు ఎన్ని విత్తనాలు వాడాలి ఎరువుల యాజమాన్యం ఎలా ఉండాలి అనే విషయాలు ఒకసారి చూసుకుంటే…మొక్కజొన్న పంటకు మురుగు నీరు పోయే వసతి గల ఎర్ర నేలలు, ఇసుక నేలలు, గరప నేలలు , నల్లరేగడి నేలలు బాగా అనుకూలం. అన్నింటికంటే లోతైన రేగడ భూముల్లో ఈ పంట అద్భుతమైన దిగుబడిని ఇస్తుంది. అయితే, పొలంలో నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా చూసుకోవాలి, నీరు నిలిస్తే మొక్కలు పసుపు రంగులోకి మారి చనిపోతాయి. ఇక విత్తే సమయం విషయానికొస్తే.. ఖరీఫ్ లో జూన్ మొదటి వారం నుంచి జూలై 15 లోపు విత్తుకోవాలి. యాసంగి సీజన్ కి వస్తే అక్టోబర్ నెల నుంచి నవంబర్ 15 వరకు విత్తుకోవడం ఉత్తమం. మన ప్రాంతానికి వాతావరణానికి అనుగుణంగా వ్యవసాయ శాఖ మూడు రకాల హైబ్రిడ్ వంగడాలను సిఫార్సు చేస్తోంది. ఇందులో డి.హెచ్.ఎమ్.103, డి.హెచ్.ఎమ్.105, బయో. 9681, పి.ఆర్ .ఒ.312 రకాలు దీర్ఘకాలిక రకాలు . వీటి పంట కాలం 100 - 120 రోజులు. డి.హెచ్.ఎమ్.107, కె.హెచ్.755 రకాలు మధ్య కాలిక రకాలు . వీటి పంటకాలం 85 - 90 రోజులు. డి.హెచ్.ఎమ్.109, డి.హెచ్.ఎమ్.1 రకాలు స్వల్పకాలిక రకాలు . వీటి పంట కాలం 75 - 85 రోజులు. నేలను రెండు మూడు సార్లు బాగా దున్నిన తర్వాత బోదెనాగలి సహాయంతో 75 సెంటీమీటర్ల దూరంలో బోదెలు వేసుకోవాలి. మొక్కకు, మొక్కకు మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు, బోదెసాళ్ళ కుడివైపున విత్తుకోవాలి. సాధారణ రకాలు వేస్తే హెక్టారుకు 18 కిలోలు, అదే హైబ్రిడ్ విత్తనాలు అయితే హెక్టారుకు 13 కిలోల విత్తనము సరిపోతుంది. ఒక హెక్టారుకు సుమారు 27,000 మొక్కల సాంద్రత ఉంటే సరైన దిగుబడి వస్తుంది. ఇక మొక్కజొన్నలో అంతర పంటలు వేయడం వల్ల రైతులకు అదనపు ఆదాయం వస్తుంది. స్వల్ప కాలిక పంటలైన పెసర, మినుము, కంది, సోయాచిక్కుడు, లేదా వేరుశనగలను మొక్కజొన్నతో కలిపి 2 ఇస్టు 1 నిష్పత్తిలో అంతర పంటలలుగా వేసుకోవచ్చు.



