రేపే రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధులు..గుజరాత్ వేదికగా నగదు విడుదల చేయనున్న ప్రధాని మోదీ

దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ పథకం నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఎల్నినో పరిస్థితులు, అకాల వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అందించింది. పండుగకు ముందే అంటే రేపే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని నిర్ణయించింది. ఈసారి పీఎం కిసాన్ డబ్బులు అందరికీ రావడం లేదు. ఏకంగా 10 లక్షల మంది రైతుల పేర్లను కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారుల జాబితా నుండి అనర్హులను తొలగించింది.
పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏటా 6వేల రూపాయలను మూడు విడతల్లో విడతకు 2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం, 24వ విడత పీఎం కిసాన్ సాయాన్ని అక్టోబర్ 30వ తేదీన అంటే రేపు విడుదల చేయాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్లోని బనాస్ కాంఠాలో జరగనున్న భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ నిధులను బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి రిలీజ్ చేయనున్నారు. దీంతో అదే రోజున రైతుల బ్యాంక్ అకౌంట్లలో 2 వేల ఆర్ధిక సాయం పడనుంది. ఈ విడత నిధుల విడుదలలో ప్రధానంగా చర్చించుకోవాల్సిన అంశం.. భారీగా తగ్గిన లబ్ధిదారుల సంఖ్య. 23వ విడతలో దేశవ్యాప్తంగా 9 కోట్ల 44 లక్షల మంది రైతులకు ఈ సాయం అందించారు. కానీ, అక్టోబర్ 30న విడుదల కానున్న 24వ విడతలో కేవలం 9 కోట్ల 34 లక్షల మంది లబ్దిదారులకు మాత్రమే 18వేల 680 కోట్లు అందించనున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. అంటే గత విడతతో పోలిస్తే ఏకంగా 10 లక్షల మంది లబ్దిదారుల పేర్లను జాబితా నుంచి కేంద్రం తొలగించింది. కేంద్రం క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, అనర్హులను ఏరివేస్తూ వస్తోంది. ప్రధానంగా ఈ పేర్లను తొలగించడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్లు, ఆదాయపు పన్ను చెల్లించే వారు ఈ పథకానికి అనర్హులు, అయినా కొందరు తప్పుగా డబ్బులు తీసుకుంటున్నారు. అలాంటి వారిని గుర్తించి తొలగించారు. అలాగే, ఒకే కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ వేర్వేరుగా లబ్దిదారులుగా ఉండటం నిబంధనలకు విరుద్ధం. అలాంటి అకౌంట్లను కూడా బ్లాక్ చేశారు. ఇక వాలెంటరీ సరెండర్ ఆప్షన్ ద్వారా ఆర్థికంగా స్థిరపడిన మరికొంతమంది రైతులు స్వయంగా ఈ పథకాన్ని వదులుకుంటున్నారు.



