అయ్యబాబోయ్ వెయ్యి కోట్లే..! సూర్య ‘సీన్’ మరి అంత కలెక్ట్ చేస్తుందా?

తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ప్రేక్షకాదరణ ఉన్న నటులలో సూర్య కూడా ఒకరు. ఆయన రెండు దశాబ్దాలకు పైగా ఇక్కడ కూడా మంచి విజయాలు సాధించి మంచి మార్కెట్ ను సొంతం చేసుకున్నారు. ఇక ఈ ఏడాది కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఇప్పుడు దీపావళి కానుకగా నవంబర్ 6వ తేదీన సీన్ అనే సినిమాతో రానున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం దర్శకుడు జీతు మాధవన్. మలయాళంలో రోమాంచం, ఫహద్ ఫాసిల్ తో ఆవేశం వంటి సెన్సేషనల్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ జీతు మాధవన్, ఇప్పుడు సూర్యతో ఈ ప్రాజెక్ట్ చేస్తుండటంతో అంచనాలు స్కై రేంజ్ లో ఉన్నాయి. అంతేకాదు, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో క్యూట్ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటిస్తోంది. మలయాళ యువ నటుడు నస్లెన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రానికి సుషిన్ శ్యామ్ సంగీతం సమకూరుస్తున్నారు. అయితే ఇక్కడే కోలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఈ ఏడాది ఇప్పటికే 500 కోట్లు సాధించిన సూర్య.. ఈ సీన్ సినిమాతో కేవలం హ్యాట్రిక్ కొట్టడమే కాకుండా, వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిపోతాడని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. ఒకే క్యాలెండర్ ఇయర్ లో మూడు సినిమాలతో 1000 కోట్లు కొల్లగొట్టిన మొదటి కోలీవుడ్ హీరోగా సూర్య హిస్టరీ క్రియేట్ చేస్తారని సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.
అయితే ట్రేడ్ నిపుణులు మాత్రం ఇది అంత ఈజీ కాదు, ఈ సినిమాకు ఫ్యాన్స్ అనుకుంటున్నంత సీన్ లేదని తేల్చి చెబుతున్నారు. సూర్య 1000 కోట్ల మైలురాయిని అందుకోవాలంటే సీన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 500 కోట్లకు పైగా వసూలు చేయాలి. 500 కోట్లు అనేది పాన్ ఇండియా అప్పీల్ ఉన్న ఒక సోలో రిలీజ్ కు మాత్రమే సాధ్యం. సూర్య సీన్ సినిమా విడుదల కావడానికి సరిగ్గా ఒక్క రోజు ముందు.. అంటే నవంబర్ 5న బాలీవుడ్ నుంచి భారీ విజువల్ వండర్ రామాయణ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వందల కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై నార్త్ నుంచి సౌత్ వరకు దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. రామాయణ లాంటి ఒక పాన్ ఇండియా ఏపిక్ సినిమా థియేటర్లలో ఉన్నప్పుడు, అన్ని మల్టీప్లెక్స్ లు, సింగిల్ స్క్రీన్స్ దానికే కేటాయిస్తారు.



