ఎల్ నినో ప్రభావం.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది

ఎల్ నినో ప్రస్తుతం వాతావరణంపై దీని ప్రభావాన్ని చూస్తూనే ఉన్నాం. అసలు ఇది ఎలా ఏర్పడుతుంది అంటే పసిఫిక్ మహాసముద్రం యొక్క ఉపరితల జలాలు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కడం వల్ల ఇది సంభవిస్తుంది. భారత్ వంటి ఉష్ణమండల దేశాలలో ఎల్ నినో ప్రధానంగా రుతుపవనాలను బలహీనపరుస్తుంది. దీని ఫలితంగా వర్షపాతం తగ్గడం కూడా చూశాం. అధిక ఉష్ణోగ్రతలు మరియు తీవ్రమైన వేడిగాలులు ప్రభావం చూపిస్తున్నాయి. వాతావరణంలో జరిగే ఈ ఆకస్మిక మార్పులు మానవ శరీరంపై మరియు జీవనశైలిపై నేరుగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అనేది చూద్దాం.
వేడి మరియు తేమ శాతంలో వ్యత్యాసాల వల్ల మనుషులలో డీహైడ్రేషన్ (నీటిశాతం తగ్గడం), హీట్ స్ట్రోక్ (వడదెబ్బ), శ్వాసకోశ సమస్యలు మరియు చర్మ వ్యాధులు పెరుగుతాయి. ఉష్ణోగ్రత విపరీతంగా పెరగడం వల్ల మానసిక ఒత్తిడి, నిద్రలేమి, తీవ్రమైన అలసట వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు దోమలు మరియు కలుషిత నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల (డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్) ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది.
ఎల్ నినో వల్ల ఉత్పన్నమయ్యే తీవ్రమైన వేడి ప్రభావం అందరిపై ఒకేలా ఉండదు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణులు, గుండె మరియు శ్వాసకోశ సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. వీటితో పాటు రోజంతా ఎండలో కష్టపడి పనిచేసే శ్రమజీవులు, శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు వేడి తీవ్రతకు త్వరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.
క్షేత్రస్థాయిలో, ఎండలో పనిచేసే కార్మికులు, డెలివరీ బాయ్స్, వ్యాపారులు వడదెబ్బ తగలకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే సమయంలో వీలైనంత వరకు విశ్రాంతి తీసుకోవడం మంచిది. ప్రతి అర్ధగంటకోసారి నీరు తాగడం, సూర్యరశ్మి నేరుగా పడకుండా పల్చటి కాటన్ దుస్తులు ధరించడం, తలకు టోపీ లేదా రుమాలు కట్టుకోవడం, మరియు ఉప్పు-చక్కెర మిశ్రమం లేదా ORS తాగడం ద్వారా డీహైడ్రేషన్ నుండి రక్షణ పొందవచ్చు. రోజంతా ఏసీ గదుల్లో పనిచేసే వారు కూడా ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది. ఏసీ ఉష్ణోగ్రతను ఎప్పుడూ 24°C నుండి 26°C మధ్య ఉండేలా చూసుకోవాలి. బయటి ఎండ నుండి రాగానే నేరుగా ఏసీ గదిలోకి వెళ్లడం లేదా ఏసీ నుండి వెంటనే తీవ్రమైన ఎండలోకి వెళ్లడం చేయకూడదు. అలాగే ఏసీలో ఉన్నప్పటికీ తగినంత నీరు తాగడం మరచిపోకూడదు.
వృద్ధులలో వయస్సు రీత్యా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే సామర్థ్యం తగ్గుతుంది, కాబట్టి వారు వేడి వాతావరణంలో త్వరగా అలసిపోతారు. వృద్ధులు ఎక్కువగా ఇంట్లోనే చల్లని, గాలి వీచే ప్రాంతంలో ఉండాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా బిపి, షుగర్ స్థాయిలను పరిశీలించుకోవాలి. కాఫీ, టీలు ఎక్కువగా తాగడం తగ్గించి, కొబ్బరినీళ్లు, మజ్జిగ, లస్సీ వంటి సహజ పానీయాలను సేవించాలి. ఏవైనా మైకం లేదా కళ్ళు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇక చిన్న పిల్లలు ఎండ తీవ్రతను తట్టుకోలేరు మరియు డీహైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఎక్కువ. ఎండ వేళల్లో పిల్లలను బయట ఆటలకు పంపకూడదు. వారికి తేలికపాటి, వదులైన కాటన్ బట్టలు తొడగాలి. బడికి లేదా బయటకు వెళ్లేటప్పుడు వాటర్ బాటిల్ తప్పనిసరిగా ఇచ్చి పంపాలి. జంక్ ఫుడ్, నిల్వ ఉంచిన పదార్థాలు తినిపించకుండా, ఇంట్లో తయారుచేసిన తాజా ఆహారాన్ని మాత్రమే అందించాలి. నిమ్మరసం, పండ్ల రసాలు ఇవ్వడం ద్వారా వారిని ఉత్తేజంగా ఉంచవచ్చు.
ఎల్ నినో సమయంలో జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది, కాబట్టి జీర్ణమవడానికి తేలికగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. నీటిశాతం ఎక్కువగా ఉండే దోసకాయ, పుచ్చకాయ, సొరకాయ, టమోటాలు మరియు ఆకుకూరలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి. ఎక్కువగా కారం, నూనె, వేపుళ్లు ఉన్న ఆహార పదార్థాలను త్యజించాలి. మజ్జిగ, పెరుగు, సబ్జా గింజలు లేదా బాదం పిసిన్ కలిపిన నీటిని తాగడం వల్ల శరీరానికి తక్షణ చలువ లభిస్తుంది. కృత్రిమ రసాయనాలు, అధిక చక్కెరలు ఉండే కూల్ డ్రింక్స్ మరియు ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల తాత్కాలికంగా ఉపశమనం లభించినా సుదీర్ఘంగా శరీరానికి హాని చేస్తాయి. దీనికి బదులుగా ప్రకృతి సిద్ధంగా లభించే కొబ్బరినీళ్లు, చెరకు రసం, నిమ్మకాయ షర్బత్, గంజి నీరు మరియు బార్లీ నీటిని తాగడం శ్రేయస్కరం. ఇవి శరీరానికి కావలసిన ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లు (సోడియం, పొటాషియం) అందించి శక్తిని పునరుద్ధరిస్తాయి. ఇక వ్యాయామం మంచిదే అయితే అధిక వేడి ఉన్న సమయంలో తీవ్రమైన వ్యాయామాలు చేయడం వల్ల గుండెపై మరియు కండరాలపై అధిక ఒత్తిడి పడుతుంది. ప్రతిరోజూ 30 నుండి 45 నిమిషాల పాటు తేలికపాటి వ్యాయామాలు, యోగా, లేదా వాకింగ్ చేస్తే సరిపోతుంది. ఉదయం 6 నుండి 8 గంటల మధ్య లేదా సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత మాత్రమే వ్యాయామం చేయాలి. తీవ్రమైన ఎండ సమయంలో వ్యాయామాలు చేయడం, జిమ్లలో అధిక బరువులు ఎత్తడం వంటివి డీహైడ్రేషన్కు దారితీస్తాయి. సమగ్ర అవగాహన మరియు చిన్నపాటి జాగ్రత్తలతో ఎల్ నినోతో ఉత్పన్నమయ్యే సవాళ్లను అధిగమించవచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా మన ఆహారపు అలవాట్లు, రోజువారీ దినచర్యను మార్చుకోవడం అత్యంత ఆవశ్యకం. తగినంత నీరు తాగడం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం, శరీర సంకేతాలను గుర్తించి విశ్రాంతినివ్వడం ద్వారా ఎల్ నినో ప్రభావం నుండి మనల్ని మరియు మన కుటుంబాన్ని సురక్షితంగా కాపాడుకోవచ్చు.
