పంట నష్టాన్ని ఎలా లెక్కిస్తారు?..ఈ రూల్స్ మీకు తెలుసా ..?

ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే అకాల వర్షాలకు నీట మునిగినా, కరువు కాటకాలతో ఎండిపోయినా రైతన్న పడే ఆవేదన వర్ణనాతీతం. ఆ విపత్కర పరిస్థితుల్లో రైతును ఆదుకోవడానికి ప్రభుత్వం పంట నష్టపరిహారాన్ని , ఇన్పుట్ సబ్సిడీని ప్రకటిస్తుంది. అసలు పొలంలో జరిగిన నష్టాన్ని అధికారులు ఎలా లెక్కిస్తారు? ఎకరాకు ఎంత నష్టం జరిగిందనేది వాళ్లకు ఎలా తెలుస్తుంది? అందరికీ ఒకేలా పరిహారం ఎందుకు రాదు? పంట నష్టం పరిహారం రావాలంటే రైతులు ముందుగా ఏం చేయాలో తెలుసా.
ఒక ప్రాంతంలో భారీ వర్షాలు పడినా, వరదలు వచ్చినా, లేదా తీవ్రమైన కరువు ఏర్పడినా ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటిస్తుంది. అలా ప్రకటించిన వెంటనే, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ రంగంలోకి దిగుతుంది. ఈ టీమ్ లో ముఖ్యంగా ముగ్గురు అధికారులు ఉంటారు. ఒకరు గ్రామ రెవెన్యూ అధికారి, రెండో వ్యక్తి వ్యవసాయ విస్తరణ అధికారి , మూడో వ్యక్తి పంచాయతీ రాజ్ లేదా ఇరిగేషన్ శాఖకు చెందిన అధికారి. ఈ బృందం నేరుగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి నష్టపోయిన పంటలను పరిశీలిస్తుంది. అందులో ముఖ్యంగా రైతులు సీజన్ ప్రారంభంలో చేయించుకున్న ఈ-క్రాప్ బుకింగ్ లేదా పంట నమోదు. రైతులు ఏ సర్వే నంబర్ లో, ఎన్ని ఎకరాల్లో, ఏ పంట వేశారు అనేది ఆన్లైన్లో నమోదై ఉంటేనే పంట నష్టపరిహారం లెక్కలోకి వస్తుంది. అందుకే ప్రతి సీజన్ లో ఈ-క్రాప్ బుకింగ్ చేయించుకోవడం చాలా అవసరం. ఇక అధికారులు పొలం దగ్గరకు వెళ్లిన తర్వాత, పంట ఎంత మేర దెబ్బతింది అనేది కళ్లారా చూసి ఒక అంచనాకు వస్తారు. ఇక్కడ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక కఠినమైన రూల్ ఉంది. అదే 33 శాతం నియమం . అంటే, ఒక రైతుకు చెందిన పొలంలో కనీసం 33 శాతం అంటే మూడో వంతు కంటే ఎక్కువ పంట నష్టం జరిగితేనే , ఆ రైతును నష్టపరిహారానికి లేదా ఇన్పుట్ సబ్సిడీకి అర్హుడిగా గుర్తిస్తారు. అంతకంటే తక్కువ నష్టం జరిగితే ప్రభుత్వ పరిహారం వర్తించదు. అధికారులు పొలాన్ని పరిశీలించి, నష్ట తీవ్రతను బట్టి దానిని మూడు కేటగిరీలుగా విభజిస్తారు. 33 శాతం నుంచి 50 శాతం లోపు నష్టం. 50 శాతం నుంచి 75 శాతం లోపు నష్టం. 75 శాతం కంటే ఎక్కువ నష్టం. ఇలా కేటగిరీలుగా విభజించిన తర్వాత, ఏ పంటకు ఎకరాకు ఎంత పెట్టుబడి ఖర్చు అయిందనేది వ్యవసాయ శాఖ ప్రామాణికంగా తీసుకుంటుంది. ఉదాహరణకు, వరి పంటకు ఒక రేటు, పత్తికి మరో రేటు, మిరప లేదా ఉద్యానవన పంటలకు ఇంకో రేటు ఉంటుంది. ఈ లెక్కల ఆధారంగా ప్రతి రైతుకు ఎంత పరిహారం ఇవ్వాలో ఒక ప్రాథమిక నివేదికను తయారు చేస్తారు.
ఇంతకముందు మాదిరి కేవలం కాగితాలపై రాసుకుని వెళ్లడం ఇప్పుడు లేదు. ప్రస్తుతం పంట నష్టాన్ని కచ్చితంగా లెక్కించడానికి అధికారులు ఆధునిక టెక్నాలజీని వాడుతున్నారు. పొలంలోకి వెళ్లిన అధికారులు తమ మొబైల్ లేదా ట్యాబ్లో జియో ట్యాగింగ్ చేస్తారు. అంటే నష్టపోయిన పంట ఫొటోలను అక్కడికక్కడే జిపిఎస్ లొకేషన్ తో సహా యాప్ లో అప్లోడ్ చేస్తారు. దీనికి తోడు, భారీ స్థాయిలో వరదలు లేదా కరువు వచ్చినప్పుడు డ్రోన్లు , శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఏ ప్రాంతంలో ఎంత పంట దెబ్బతింది అనేది పైనుంచి మ్యాపింగ్ చేస్తారు. దీనివల్ల ఎవరూ తప్పుడు లెక్కలు చూపించడానికి, నష్టం జరగని పొలాలకు పరిహారం క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉండదు. ఈ డేటా మొత్తం నేరుగా స్టేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వెళుతుంది.క్షేత్రస్థాయిలో VRO , AEO లు తయారు చేసిన జాబితాను ముందుగా గ్రామ పంచాయతీలో ప్రదర్శిస్తారు. దీన్ని సోషల్ ఆడిట్ అంటారు. అంటే, ఎవరి పేరు అయినా మిస్ అయినా, లేదా తప్పుగా నమోదైనా రైతులు అక్కడే అభ్యంతరం చెప్పి సరిచేసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఫైనల్ జాబితాను తహశీల్దార్, మండల వ్యవసాయ అధికారి ఆమోదించి జిల్లా కలెక్టర్ కు పంపుతారు. కలెక్టర్ దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన తర్వాత, ప్రభుత్వం జాతీయ విపత్తు స్పందన నిధి , రాష్ట్ర విపత్తు స్పందన నిధి నిబంధనల ప్రకారం నష్టపరిహారాన్ని మంజూరు చేస్తుంది. ఆ నిధులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో నేరుగా ఆధార్ తో లింక్ అయిన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమవుతాయి.



