ప్రజా ఆస్తుల ధ్వంసం…వికృత మనస్తత్వానికి నిదర్శనం
కామెంట్లు (0)

తిరుపతి జిల్లా, పుల్లంపేట మండల పరిధిలోని అనంతసముద్రం, పాపక్కగారిపల్లె గ్రామాల మధ్య పల్లెపండుగ కార్యక్రమం ద్వారా నిర్మించిన రోడ్డును ధ్వంసం చేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించేవారి పట్ల ఎంత కఠినంగా వ్యవహరించాలో ఇటువంటి ఘటనలు గుర్తుచేస్తున్నాయి. ప్రజల సౌకర్యం కోసం చేసే అభివృద్ధి పనులను అడ్డుకోవడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వికృత మనస్తత్వానికి నిదర్శనం. కేవలం వారి పార్టీ అధికారంలో లేదనో మరే కారణం చేతనో ఇలాంటి చర్యలకు పాల్పడడం దారుణం. అసలు ఇటువంటి ఘటనలను ఎలా చూడాలి. ప్రభుత్వ ఆస్తులంటే అవేదో ప్రభుత్వానికే పరిమితం కాదు కదా…ఉమ్మడి ఆస్తి కోటీశ్వరుడి దగ్గరనుండి రోజంతా కస్టపడి, చెమటోడ్చి శ్రమించిన పేదవాడి దగ్గర నుండి వసూలు చేసిన పన్ను నుండి వచ్చేదే. అలాంటి అందరికీ ఉపయోగకరమైన ఆస్థిని ధ్వంసం చేయడం నిజంగా హేయమనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా పరిగణించారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన వైసీపీ నేత సుబ్బారెడ్డిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ధ్వంసం, తదుపరి చర్యలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. వారం రోజుల క్రితం పల్లెపండుగ 3.0 ద్వారా రూ. 4.75 కోట్లతో నిర్మించిన రోడ్డును సుబ్బారెడ్డి అనే వ్యక్తి, వెంకటసుబ్బారెడ్డి అనే మరో వ్యక్తి సాయంతో 100 మీటర్ల మేర ట్రాక్టర్‌తో దున్నడం గురించి గ్రామస్థులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా బాధ్యులపై తీసుకోవాల్సిన చర్యలపై డిప్యూటీ సీఎం పవన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు సౌకర్యం కలిగించే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం క్షమించరాని నేరమని, పల్లెపండుగ రోడ్డు ధ్వంసం చేసిన వ్యక్తిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టాలని ఆదేశించారు.
ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, అభివృద్ధి పనుల అడ్డుకట్ట వంటి ఘటనలు సమాజంలో అత్యంత ఆందోళనకరమైన ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి. పౌరుల సౌకర్యార్థం, సమాజ పురోగతి కోసం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను లక్ష్యంగా చేసుకోవడం చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థలకే గొడ్డలిపెట్టుగా మారుతోందనే విమర్శలు ప్రజల నుండి వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి అసాంఘిక చర్యలను కేవలం ఒక సంఘటనగా కాకుండా, సమాజ ప్రశాంతతకు, భద్రతకు కలిగే తీవ్ర విఘాతంగా భావించాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిష్ఠాత్మక భవనాలు, రోడ్లు, రవాణా వ్యవస్థల నిర్మాణం వెనుక దేశంలోని ప్రతీ పౌరుడి శ్రమ దాగి ఉంది. నిరుపేద కూలీ కష్టపడి సంపాదించిన డబ్బు నుండి చెల్లించే పరోక్ష పన్నుల నుండి మొదలుకొని, కోటీశ్వరులు చెల్లించే ప్రత్యక్ష పన్నుల వరకు ప్రతీ రూపాయి ఈ నిర్మాణాల్లో భాగమవుతుంది. కాబట్టి ఉమ్మడి ఆస్తిని ధ్వంసం చేయడం అంటే ప్రతీ పౌరుడి కష్టాన్ని, వారి హక్కులను అవమానించడమే అవుతుందని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని ప్రజలు కోరుతున్నారు.
ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడే వారి పట్ల చట్టపరంగా అత్యంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆస్తులకు జరిగిన నష్టాన్ని బాధ్యులైన వ్యక్తులు లేదా సంస్థల నుండే రికవరీ చేసేలా కఠిన నిబంధనలు అమలు చేయాలి. అదే సమయంలో, ప్రజల్లో కూడా ప్రభుత్వ ఆస్తుల పట్ల బాధ్యతాయుతమైన వైఖరి, సొంత ఆస్తి అనే భావన పెంపొందేలా అవగాహన కల్పించాలి. ప్రజా సంక్షేమానికి విఘాతం కలిగించే ఇటువంటి వికృత చర్యలను సమాజంలో ప్రతీ ఒక్కరూ ఏకగ్రీవంగా ఖండించినప్పుడే అభివృద్ధి వేగవంతమవుతుంది.



