ఫుడ్ చైన్‌ను మళ్లీ గాడిలో పెట్టేందుకు గుజరాత్ మాస్టర్ ప్లాన్.. అడవుల్లో ఎర్ర కోళ్లు!

అడవి ఈ భూమిపై ఎంతో కీలకమైన పర్యావరణ వ్యవస్థ. అక్కడ ఏ జంతువు జనాభా పెరిగినా, దాన్ని నియంత్రించి సమతుల్యం చేసేందుకు మరో జంతువు ఉంటుంది. ఈ ప్రక్రియనే మనం ఆహారపు గొలుసు అని ఫుడ్ చైన్ అని పిలుస్తాం. అయితే గత కొన్నేళ్లుగా అడవుల విస్తీర్ణం తగ్గడం, వేటగాళ్ల బారిన పడి అడవి పందులు, జింకలు, కోళ్లు లాంటి చిన్న జంతువులు అంతరించిపోవడంతో ఈ ఫుడ్ చైన్ దారుణంగా దెబ్బతింది. మరోవైపు అటవీ శాఖ తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యల వల్ల దేశవ్యాప్తంగా చిరుతల జనాభా భారీగా పెరుగుతోంది. గుజరాత్ అడవుల్లో కూడా ఇదే పరిస్థితి. చిరుతల సంఖ్య పెరుగుతోంది, కానీ వాటికి కావాల్సిన ఆహారం అడవిలో దొరకడం లేదు. దీంతో ఆకలికి తాళలేక ఆ క్రూర మృగాలు అడవి సరిహద్దులు దాటి పక్కనే ఉన్న ఊళ్లలోకి, జనావాసాల్లోకి వస్తున్నాయి. అక్కడ సులభంగా దొరికే కుక్కలను, మేకలను, చివరకు చిన్న పిల్లలను సైతం ఎత్తుకెళుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉండేలా క్రూర మృగాలు అడవికే పరిమితం అయ్యేలా గుజరాత్‌లోని దక్షిణ ప్రాంత అటవీ విభాగం ఒక సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. అవే ఎర్ర అడవి కోళ్ల ఉత్పత్తి కేంద్రాలు.
ఈ ప్రాజెక్టును దక్షిణ గుజరాత్ లో అటవీ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. దీనికోసం తాపీ జిల్లాలోని సదాద్గిల్ అటవీ ప్రాంతంలో ఉన్న గుడురుబాడీ గ్రామంలో ఒక భారీ కోళ్ల బ్రీడింగ్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సెంటర్లో అడవి కోళ్లను ప్రత్యేకంగా ఉత్పత్తి చేస్తున్నారు. ఈ అడవి కోళ్లు సాధారణ నాటు కోళ్ల కంటే చాలా చురుకుగా ఉంటాయి, అడవి వాతావరణాన్ని తట్టుకుని బతకగలవు. క్రూర జంతువులకు ఇవి అత్యంత సహజమైన ఆహారం. గత ఏడాది సూరత్ జిల్లాలోని మన్వీ తాలూకాలో, తాపీ జిల్లాలో ఇలాంటి బ్రీడింగ్ సెంటర్లను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. కోడి పిల్లలు పుట్టినప్పటి నుంచి వాటికి అత్యంత పౌష్టిక ఆహారంతో పాటు, అడవిలో రోగాల బారిన పడకుండా ముందస్తుగా వ్యాక్సిన్లు కూడా అందిస్తున్నారు. ముఖ్యంగా వాతావరణ మార్పులను తట్టుకునేలా నియంత్రిత ఉష్ణోగ్రతల మధ్య వాటిని పెంచుతున్నారు. వాటికి సహజ సిద్ధమైన గింజలు, కూరగాయలు, పురుగులను ఆహారంగా అందిస్తూ అడవికి అలవాటు పడేలా చేస్తున్నారు.



