అంచనాలు పెంచేస్తున్న మెగావర్స్…ఒకే వేదికపై ఆ ముగ్గురు సెల్ఫ్ మేడ్ స్టార్స్?

తెలుగు చిత్ర పరిశ్రమకు దశాబ్దాలుగా అగ్రస్థానంలో కొనసాగుతూ బాస్ గా మెగాస్టార్ చిరంజీవి ఏం చేసినా అదొక సెన్సేషన్. ఇక ఇప్పుడు తన కెరీర్లోనే ఒక సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. మొదటిసారిగా ఓటీటీ వేదికపై హోస్ట్‌గా మారి, నెట్‌ఫ్లిక్స్ కోసం అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న మెగావర్స్ అనే ప్రతిష్టాత్మక సెలబ్రిటీ టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ షోలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ప్రభాస్, కమల్ హాసన్, సూర్య లాంటి దిగ్గజాలు పాల్గొనబోతున్నారన్న వార్త ఫ్యాన్స్‌కు అంచనాలు పెంచేస్తుంటే తాజాగా ఇప్పుడు ఈ మెగా లిస్ట్‌లో మరో ఇద్దరు క్రేజీ స్టార్ హీరోలు చేరినట్లు టాలీవుడ్ వర్గాల నుంచి బలమైన సమాచారం అందుతోంది. మాస్ మహారాజా రవితేజ, నేచురల్ స్టార్ నాని కలిసి మెగావర్స్ షోలో ప్రత్యేక అతిథులుగా పాల్గొనబోతున్నారట. నవంబర్ చివరి వారంలో చిరంజీవితో వీరిద్దరి స్పెషల్ ఎపిసోడ్ షూటింగ్ జరగనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఎపిసోడ్‌కు ఒక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి, స్వయంకృషితో అగ్రస్థానానికి ఎదిగిన రియల్ సెల్ఫ్ మేడ్ స్టార్ చిరంజీవి. ఆ తర్వాత ఆ స్థాయిలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా కష్టపడి, నేడు స్టార్ హీరోలుగా ఎదిగిన సెల్ఫ్ మేడ్ స్టార్స్ అంటే కచ్చితంగా రవితేజ, నాని పేర్లే వినిపిస్తాయి. ఇప్పుడు ఈ ముగ్గురు సెల్ఫ్ మేడ్ స్టార్స్ ఒకే వేదికపై కనిపించనున్నారని తెలియడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవికి రవితేజ, నాని ఇద్దరూ వీరాభిమానులే. రవితేజకు చిరంజీవి అంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో వాల్తేరు వీరయ్య లో మెగాస్టార్‌తో కలిసి రవితేజ స్క్రీన్ షేర్ చేసుకోగా, వీరిద్దరి కెమిస్ట్రీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. మరోవైపు, నేచురల్ స్టార్ నాని కూడా చిరంజీవి సినిమాలను చూస్తూ పెరిగి, ఆయనను ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీలో ఎదిగిన వ్యక్తే. తన అభిమాన హీరో ఎదురుగా కూర్చుని తన జర్నీని, అభిమానాన్ని పంచుకోవడం ఇటువంటివి అంచనాలు పెంచేస్తున్నాయి. బాస్‌తో రవితేజ మాస్ ఎనర్జీ, నాని నేచురల్ టైమింగ్ తోడైతే ఆ ఎపిసోడ్ నెట్‌ఫ్లిక్స్‌లో సరికొత్త వ్యూయర్షిప్ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం. ఒకవైపు యంగ్ స్టార్ హీరోలు, మరోవైపు దిగ్గజ నటీనటులతో టాలీవుడ్ మొత్తాన్ని మెగావర్స్ లోకి తీసుకొస్తున్న చిరంజీవి.. ఓటీటీ టాక్ షోల చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించడానికి సిద్ధమయ్యారు.



