బ్యాడ్మింటన్‌లో భారత్ ఘన విజయం: టైటిల్ విజేతలుగా సింధు, లక్ష్యసేన్

భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్ లు హైలో ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో రాణించి టైటిల్స్ దక్కించుకున్నారు. దీనిపై క్రీడాభిమానులు నుండి ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్ లో సింధు 21-12, 21-14తో వరల్డ్ 25వ ర్యాంకు క్రీడాకారిణి డెన్మార్క్ కు చెందిన లీనె కైర్స్ఫెల్ట్ పై గెలిచి టైటిల్ సాధించింది. ఈ మధ్య ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన సింధు హైలో ఓపెన్ లో మాత్రం తన నిలకడైన ఆటతీరుతో టైటిల్ కైవసం చేసుకుంది. 39 నిమిషాల్లో ముగిసిన పైనల్ గేమ్ లో అత్యద్భుత ఆటతీరు కనబరిచింది. 31 సంవత్సరాల సింధుకు ఈ సీజన్లో ఇది రెండో టైటిల్. ఇక జులైలో ఆమె జపాన్ ఓపెన్ గెలిచిన విషయం తెలిసిందే. మరోవైపు లక్ష్యసేన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో అతడు 21-17, 21-10తో ఇండోనేషియా షట్లర్ జోనాథన్ క్రిస్టీ పై విజయం సాధించాడు. పోటాపోటీగా జరిగిన మొదటి గేమ్ లో పోరాడి గెలిచిన అతను రెండో గేమ్ లో చురుకైన ఆటతీరుతో ఆధిపత్యం కనబరిచాడు. ఇక ఈ ఏడాది ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ టైటిల్ ను కొద్దిలో కోల్పోయిన లక్ష్యసేన్ హైలోలో అద్భుతమైన ఆటతీరుతో టైటిల్ విజేతగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లోని మొదటి గేమ్‌లో ఇద్దరి మధ్య పాయింట్ల కోసం తీవ్ర పోరాటం జరిగింది. క్రిస్టీ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, లక్ష్యసేన్ సమయస్ఫూర్తితో ఆడి తొలి గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. ఇక రెండో గేమ్‌లో పూర్తిగా ఆధిపత్యం చెలాయించిన అతడు, చురుకైన డిఫెన్స్ మరియు ఖచ్చితమైన నెట్ ప్లేతో ప్రత్యర్థిపై పైచేయి సాధించి సునాయాసంగా విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఏ దశలోనూ ప్రత్యర్థికి ఆధిక్యం ఇవ్వకుండా మ్యాచ్‌ను తన వైపు తిప్పుకున్నాడు.ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్‌లో తుది మెట్టు వరకు వెళ్లి టైటిల్‌ను కొద్దిలో కోల్పోయిన లక్ష్యసేన్‌కు ఈ విజయం మంచి ఊరటనిచ్చింది. ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, తన లోపాలను సరిదిద్దుకున్న అతడు హైలో ఓపెన్‌లో ఛాంపియన్‌గా నిలిచి తన స్థాయి ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు.



