తలపొగరు చూపిస్తే..ప్యాంట్ తడిపించేశాడు.. ఇది ఒక పవర్ ఫుల్ ఐపీఎస్ స్టోరీ ..!

అది 1971 డిసెంబర్ .. కేరళలోని తలస్సేరి ప్రాంతం భయంకరమైన మత ఘర్షణలతో ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఎప్పుడు ఎవరు ఎవరిని చంపుతారో తెలియని భయంకరమైన పరిస్థితి. ఇళ్లకు నిప్పులు పెడుతున్నారు, దొరికిన వారిని దొరికినట్లు నరుకుతున్నారు. సమీప ప్రాంతాల్లోని ప్రజలు భయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వీధుల్లోకి రాలేక, ఇళ్ళకు తాళాలు వేసుకుని సుదూర బంధువుల ఇళ్ళకు వెళ్ళిపోయారు. జనావాసాలు అన్నీ నిర్మానుష్యంగా స్మశానాన్ని తలపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఆ ప్రాంతంలో విజయన్ కొరాన్ అనే పేరుగల ఓ 26 ఏళ్ళ వయస్సున్న ఒక కరడుగట్టిన గూండా చెలరేగిపోతున్నాడు. రెండు జీపుల్లో ఫుల్లుగా తాగి, మదం పట్టిన ఏనుగుల్లా ఉన్న తన ముఠాను ఎక్కించుకుని ఆ ప్రాంతం అంతా తిరుగుతూ మైకులతో ప్రజలను మరింతగా రెచ్చగొడుతున్నాడు. ఈ క్రమంలో ఈ గ్యాంగ్ చేతిలో జనవరి 4, 1972న కుంజిరామన్ అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు.
ఈ హత్య జరగడానికి రెండు రోజుల ముందే.. ఆ తలస్సేరి ప్రాంతానికి అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా ఒక 26 ఏళ్ళ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ ఛార్జ్ తీసుకున్నారు. ఆయనే మన అజిత్ దోవల్. హత్య విషయం తెలియగానే ఆ ఆఫీసర్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని హంతకుల వేట మొదలుపెట్టారు. ఆ గూండాల ఆచూకీ తెలుసుకుని తన పోలీసు బ్రృందంతో వెళ్లి వాళ్లు ఉన్న ఫార్మ్హౌస్ పై మెరుపుదాడి చేశారు. కానీ ఇక్కడే ఒక ఊహించని సంఘటన జరిగింది. ఆ ముఠా నాయకుడైన విజయన్ కొరాన్ ఒక పోలీసు కానిస్టేబుల్ చేతికి చిక్కాడు. కానీ ఆ రౌడీ, కానిస్టేబుల్ ను బెదిరించడంతో అతను భయపడి వదిలివేశాడు. అది చూసిన అజిత్ దోవల్ కు చిర్రెత్తుకొచ్చింది. తానే స్వయంగా రంగంలోకి దిగారు. కానిస్టేబుల్ ను బెదిరించి పారిపోతున్న ఆ గూండా వెనకాలే యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ దోవల్ స్వయంగా పరుగెత్తారు. అలా అతని వెంట పరిగెత్తుతూ దగ్గరకు పోగానే చేతులతో పట్టుకోకుండా, వెనక నుంచి గాల్లోకి ఎగిరి కాలితో బలంగా ఒక్క తన్ను తన్నారు. ఆ దెబ్బకు విజయన్ కొరాన్ వేగంగా బోర్లా పడిపోయి ముఖం అంతా రోడ్డుకు గీసుకుపోయింది. ముఖం, చేతులు రక్తసిక్తమైనాయి. అతని లుంగీ పూర్తిగా ఊడిపోయింది. ఆ దెబ్బతో గూండాకు చుక్కలు కనిపించాయి. ఆ రౌడీని జీపులో ఎక్కించుకుని తలస్సేరి ప్రజలందరూ చూస్తుండగానే పోలీసు స్టేషన్కు తీసుకువచ్చాడు.



