భారీ షాట్లతో విరుచుకుపడిన ఓపెనర్లు…అభిషేక్ శర్మ సూపర్ సెంచరీ…మూడో టీ 20లో కూడా భారత్ విజయం

భారత్ న్యూజిలాండ్ పర్యటనలో జైత్రయాత్ర కొనసాగిస్తోంది. 5 మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో మొదటి రెండు టీ 20లు గెలిచిన భారత్ తాజాగా నేడు వెల్లింగ్టన్ వేదికగా జరిగిన మూడో టీ 20లో కూడా విజయం సాధించి 3-0 ఆధిక్యంతో నిలవడమే కాకుండా సిరీస్ ను మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. భారత్ ఈ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ ఇచ్చిన టార్గెట్ 199 పరుగులను భారత్ 13.2 ఓవర్లలోనే చేసి సత్తా చాటింది. ముఖ్యంగా భారత స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ 113; 38 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్సర్లతో దుమ్ముదులిపేశాడు సెంచరీ తరువాత అతను చేసిన సెలబ్రేషన్ హైలెట్ గా నిలిచింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. డ్యారీ మిచెల్ 89 (52; 5x4, 5x6) హాఫ్ సెంచరీ సాధించి ఆ జట్టు నుండి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఫిన్ అలెన్ 40 (25; 5x6), బెవోన్ జాకోబ్స్ 39 నాటౌట్ (23; 4x4, 1x6) పరుగులు చేశారు. న్యూజిలాండ్ ఆ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించారు. భారత బౌలర్లలో అక్సర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్ దీప్ సింగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక టార్గెట్ ఛేజింగ్ లో భారత్ ఇన్నింగ్స్ ను మాములుగా మొదలుపెట్టలేదు. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మలు బాదుడే బాదుడు అన్నట్లు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. 5 ఓవర్లోనే 100 పరుగులు 6 ఓవర్లలో 118 పరుగులు ఇలా ఒక రేంజ్ లో న్యూజిలాండ్ బౌలర్లను ఉతికిఆరేశారు. వైభవ్ 45 (19; 4x4, 4x6) కూడా మెరుపులు మెరిపించాడు. ఇక అభిషేక్ శర్మ సంగతి చెప్పాల్సిన పనిలేదు. అవలీలగా భారీ షాట్లతో చెలరేగాడు. ఈక్రమంలో అభిషేక్ పలు రికార్డులు సాధించాడు.



