హౌతీలకు దిమ్మతిరిగే షాక్..మళ్లీ మొదలైన ప్రాక్సీ వార్

మిడిల్ ఈస్ట్ మంటలు ఇంకా చల్లారేలా కనిపించడం లేదు. ఒకవైపు ఇజ్రాయెల్, హమాస్, హిజ్బుల్లా మధ్య భీకర పోరు సాగుతుండగానే.. మరోవైపు యెమెన్ కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు, సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ బలగాల మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. కొద్ది కాలంగా స్తబ్దుగా ఉన్న సౌదీ-యెమెన్ సరిహద్దుల్లో మళ్లీ బాంబుల మోత మోగుతోంది. తాజాగా సౌదీ అరేబియాలోని రెండు కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు అత్యంత ప్రమాదకరమైన బాలిస్టిక్ క్షిపణులను , డ్రోన్లను ప్రయోగించారు. ఈ అనూహ్య దాడితో అప్రమత్తమైన సౌదీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వాటిని గాల్లోనే అడ్డుకుని విజయవంతంగా ధ్వంసం చేశాయి. ఈ విషయాన్ని సౌదీ బలగాలే అధికారికంగా ప్రకటించాయి. మంగళవారం జరిగిన ఈ దాడి సౌదీ అరేబియాను ఉలిక్కిపడేలా చేసింది. సౌదీ మిలిటరీ తమ అత్యున్నత రాడార్ వ్యవస్థల ద్వారా ఈ క్షిపణులను, డ్రోన్లను గుర్తించి, అవి లక్ష్యాలను చేరుకోకముందే గాల్లోనే ఇంటర్సెప్ట్ చేసి పేల్చేశాయి. అనంతరం ఆయా ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ముప్పు తొలగిపోయిందని పౌర రక్షణ విభాగం అధికారికంగా ప్రకటించడంతో స్థానిక ప్రజలు, ప్రభుత్వం ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ ఈ బాలిస్టిక్ క్షిపణులు గనుక లక్ష్యాన్ని ఛేదించి ఉంటే సౌదీకి భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగుండేది. అసలు ఇప్పుడు హౌతీలు సడెన్ గా సౌదీపై ఎందుకు దాడులు తీవ్రం చేశారన్నది ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్. దీనికి ప్రధాన కారణం ఎర్ర సముద్రం పై ఆధిపత్య పోరు. గత నెలలో యెమెన్‌లోని ఎర్ర సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న కొన్ని వ్యూహాత్మక ప్రదేశాలను హౌతీలు బలవంతంగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడితో ఆగకుండా అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన బాబ్ అల్ మందెబ్ జలసంధి వైపు తమ దళాలతో ప్రయాణించారు. ఈ కదలికలను గమనించిన సౌదీ అరేబియా.. హౌతీల వ్యూహాన్ని దెబ్బకొట్టేందుకు వారి స్థావరాలపై వైమానిక దాడులను విపరీతంగా పెంచింది. ఈ దాడులకు ప్రతీకారంగానే ఇప్పుడు హౌతీలు సౌదీపై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారు.
ఈ బాబ్ అల్ మండేబ్ జలసంధి గ్లోబల్ ట్రేడ్ లో ఒక చోక్ పాయింట్. హార్మూజ్ జలసంధికి అవతలివైపు ఉన్న గల్ఫ్ చమురు ఉత్పత్తి దేశాలకు, యూరప్ , ఇతర ఆసియా దేశాలకు మధ్య జరిగే అంతర్జాతీయ సముద్ర రవాణాలో ఈ జలసంధి అత్యంత కీలకమైనది. ప్రపంచంలోని చమురు, సహజ వాయువు ఎగుమతుల్లో మెజారిటీ భాగం ఈ జలసంధి గుండానే ప్రయాణిస్తుంది. అలాంటి ప్రాంతాన్ని హౌతీలు తమ గుప్పిట్లోకి తీసుకుంటే.. ఏ క్షణమైనా వాణిజ్య నౌకలపై, ఆయిల్ ట్యాంకర్లపై దాడులు చేయగలరు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా ఆగిపోయి, ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతాయి. దీన్ని ముందే పసిగట్టిన సౌదీ సంకీర్ణ బలగాలు హౌతీలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ తాజా పరిణామాలతో యెమెన్ లో శాంతి కోసం ఐక్యరాజ్యసమితి పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. వాస్తవానికి 2022లో ఐక్యరాజ్యసమితి చొరవతో, వారి మధ్యవర్తిత్వంతో సౌదీ , హౌతీల మధ్య ఒక చారిత్రాత్మక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అంతకుముందు ఈ ఒప్పందంతో యెమెన్‌లో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలకు..యెమెన్ రాజధాని సనా ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న హౌతీలకు మధ్య దాడులు చాలా వరకు నిలిచిపోయాయి. యెమెన్ ప్రజలు కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇప్పుడు ఎర్ర సముద్రంలో హౌతీల విస్తరణ కాంక్ష, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో హౌతీలు రెచ్చిపోతుండటం తదితర కారణాలతో.. 2022లో కుదిరిన ఆ కాల్పుల విరమణ ఒప్పందం తాజా ఉద్రిక్తతలతో పూర్తిగా దెబ్బతింది.
ఈ ప్రాక్సీ వార్ లో హౌతీలకు వెనుక ఉండి నడిపిస్తోంది ఇరాన్ అని సౌదీ బలంగా నమ్ముతోంది. అందుకే ఈ యుద్ధం కేవలం యెమెన్-సౌదీలకే పరిమితం కాకుండా ప్రాంతీయ యుద్ధంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. ఈ దాడులు ఇలాగే కొనసాగితే సౌదీ చమురు మౌలిక సదుపాయాలకు, ప్రపంచ ఇంధన భద్రతకు పెను ప్రమాదం పొంచి ఉందని అంతర్జాతీయ రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.



