మార్వెల్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్..అమెరికా కంటే ముందే ఇండియాలో

ప్రపంచవ్యాప్తంగా అవెంజర్స్ సిరీస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ తర్వాత ఆ స్థాయి థ్రిల్ ను మిస్ అవుతున్న ఫ్యాన్స్ కు మార్వెల్ స్టూడియోస్ ఇప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇచ్చింది. రాబోయే మోస్ట్ అవేటెడ్ బ్లాక్ బస్టర్ అవెంజర్స్: డూమ్స్‌డే సినిమాను అమెరికా కంటే ముందే మన ఇండియాలో రిలీజ్ చేయనున్నట్లు వారు ప్రకటించారు.
భారతీయ బాక్సాఫీస్ స్టామినాను, ఇక్కడున్న కోట్లాది మంది మార్వెల్ ఫ్యాన్ బేస్ ను మార్వెల్ స్టూడియోస్ ఎంతలా గౌరవిస్తుందో చెప్పడానికి ఇదొక నిదర్శనం. అధికారిక ప్రకటన ప్రకారం, అవెంజర్స్: డూమ్స్‌డే సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 18న విడుదల కానుంది. కానీ, దానికి ఒక రోజు ముందుగా.. అంటే డిసెంబర్ 17నే భారతీయ థియేటర్లలో ఈ ఎపిక్ మూవీ సందడి చేయనుంది. మన దేశంలో హాలీవుడ్ సినిమాలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రాన్ని ఏకకాలంలో ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో అత్యంత భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. గతంలో అవెంజర్స్ ఎండ్ గేమ్ ఇండియాలో వందల కోట్లు కలెక్ట్ చేసి రికార్డులు బ్రేక్ చేసింది. ఇప్పుడు అదే మ్యాజిక్ ను రిపీట్ చేయడానికి మార్వెల్ ఈ ముందస్తు రిలీజ్ స్ట్రాటజీని వాడుతోంది. స్పెషల్ వీడియోలో రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్ ఇండియన్ ఫ్యాన్స్ ను ఉద్దేశించి మాట్లాడటం చూస్తుంటే, ఇండియాలో భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అవెంజర్స్ సిరీస్ లో కీలకమైన ఐరన్ మ్యాన్ పాత్రలో జీవించిన రాబర్డ్ డౌనీ జూనియర్ ఇప్పుడు ఏకంగా ఎంసీయూ లోనే అత్యంత శక్తివంతమైన, భయంకరమైన విలన్ డాక్టర్ డూమ్ పాత్రలో తిరిగి రావడం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ కు జోష్ ఇస్తోంది. హీరోగా చూసిన వ్యక్తిని అంతటి క్రూరమైన విలన్ గా ఎలా చూపిస్తారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. దీనికి తోడు మన ఒరిజినల్ కెప్టెన్ అమెరికా స్టీవ్ రోజర్స్ పాత్రలో క్రిస్ ఎవాన్స్ కూడా తిరిగి వస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇలాంటి ఒక క్లిష్టమైన ప్రాజెక్ట్ ను డీల్ చేయాలంటే సాధారణ డైరెక్టర్ల వల్ల కాదు. అందుకే మార్వెల్ సంస్థ తమ బ్రహ్మాస్త్రాలైన ఆంథోనీ రుస్సో, జో రుస్సో లను మళ్లీ రంగంలోకి దించింది. ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ లాంటి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈ దర్శక ద్వయం చేతుల్లోనే ఇప్పుడు అవెంజర్స్: డూమ్స్‌డే బాధ్యతలు ఉన్నాయి. ఇక సినిమా కథ విషయానికి వస్తే, మల్టీవర్స్ సాగాలో ఇదొక బిగ్గెస్ట్ క్రాస్ ఓవర్ ఈవెంట్ కాబోతోందని తెలుస్తోంది.



